Tea | చిన్నిచిన్ని సంతోషాలను ఘనంగా చేసుకోవడంలో తేనేటి విందును మించింది మరొకటి లేదు. సర్కారు డీఏ ప్రకటించినప్పుడు సగటు ఉద్యోగులు చేసుకునే ఘనమైన విందు ఇది. ఏ బంద్లోనో బందోబస్తుకు వెళ్లిన పోలీసులకు టీ ఆస్వాదనే ఆట విడుపు. చట్టాలకు రక్షణ కల్పించే పోలీసులు మొదలుకొని.. ఆ చట్టాలు చేసే ప్రజా ప్రతినిధుల వరకూ అందరూ తేనేటి విందులో భాగస్వాములే! ముఖ్యంగా పార్లమెంట్ సెషన్‌కు ముందు తేనేటి విందు ప్రహసనం ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతుంది. అస్మదీయులు, తస్మదీయులు అంతా ఒక్కచోట చేరి సమశీతోష్ణ వాతావరణంలో ఉష్ణోదకాన్ని సేవిస్తూ తరిస్తారు. ఈ సంప్రదాయం ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ, దశాబ్దాలుగా నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది. మిత్రపక్ష, ప్రతిపక్ష, వామపక్ష సభ్యులంతా ఈ క్రతువులో టీ పక్షం అయిపోతారు. సభాపర్వాన్ని వాదప్రతివాదాలతో కురుక్షేత్రంగా మార్చే ప్రజా ప్రతినిధులు.. తేనీటి అంకంలో ఒకరి చంకలో ఒకరు దూరి చమత్కార బాణాలు విసురుకుంటారు. సభకు ముందు సభ్యుల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనడానికి ఈ తంతును మొదలుపెట్టి ఉంటారు. అయితే,
ఏకాక్షరి సాధనలో ఏకపక్షంగా వ్యవహరించి చెట్టాపట్టాలు వేసుకొని సభాసదనానికి చేరిన సదరు సభ్యులు.. ఆపై మినిట్ టు మినిట్ మెట్టు దిగేది లేదని బెట్టు చేస్తుంటారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముడతారు. ఒకరి గుట్టును మరొకరు రట్టు చేసి, పరువును మట్టుపెట్టాలని కట్టుదాటి వ్యవహరిస్తారు. పట్టుబట్టి వాయిదాలు కోరడంలో బయటికి వెళ్లాక మరో టీని ఆస్వాదించాలనే స్వార్థమూ లేకపోలేదు! ఏమంటారు?
కావలసిన పదార్థాలు: మచ్చా టీ పొడి, వేడినీళ్లు, తేనె
తయారీ విధానం: ముందుగా ఒక స్పూన్ మచ్చా టీ పొడిని తీసుకుని టీ జాలీలో వేసి చెంచా సాయంతో జల్లించాలి. దీంతో టీపొడి ఉండలు లేకుండా తయారవుతుంది. ఇప్పుడు అరకప్పు గోరువెచ్చటి నీళ్లను ఈ పొడికి కలిపి అరనిమిషం పాటు గిలకొట్టాలి. ఈ మిశ్రమం పైభాగం బాగా నురగ వచ్చిన తర్వాత వేడి నీటిని కలిపితే సరి. రుచికి కావాలంటే తేనె కూడా జోడించి సేవించవచ్చు. ఈ టీ పొడిని ప్రత్యేకంగా నీడలో పెంచిన తేయాకు చెట్ల నుంచి తయారుచేస్తారు. అందుకే టీ ఆకుపచ్చ రంగులో ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ పానీయం మెదడును చురుగ్గా ఉంచేందుకు సాయపడుతుంది. గుండె ఆరోగ్యానికీ, రోగనిరోధక వ్యవస్థ బలోపేతానికీ తోడ్పడుతుంది.
రాజకీయాలు అంటే తేనీటి విందు కాదు! పనిచేయాల్సిన సమయం వచ్చినప్పుడు వేగంగా, నిశ్చయాత్మకంగా వ్యవహరించాలి.
n ఎడ్వర్డ్ బ్రూక్, అమెరికా నేత
“Tea | విషం తిన్న వ్యక్తిని కాపాడిన ఛాయ్.. ఎక్స్పైరీ అయిన టీపొడి కూడా ఆరోగ్యమే !”
Bostan Tea Party | అమెరికాకు స్వాతంత్య్రం రావడానికి టీనే కారణమని తెలుసా
Tea History | వాళ్లే చాలా తెలివిగా మనకు ఛాయ్‌ను అలవాటు చేశారు !!
“Green Tea | జుట్టు ఎక్కువగా రాలిపోతున్నప్పుడు గ్రీన్ టీ తాగొచ్చా?”