e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home కొమరంభీం ఈడు ఆగదు.. పిల్ల దొరకదు..

ఈడు ఆగదు.. పిల్ల దొరకదు..

ఈడు ఆగదు.. పిల్ల దొరకదు..

మూతపడ్డ మ్యారేజ్‌ బ్యూరోలు.. కనిపించని వేదికలు
మెజార్టీ సామాజిక వర్గాల్లో అమ్మాయిల కొరత
మూడు పదుల వయసు దాటుతున్నా పడని మూడుముళ్లు
ఆలస్యపు పెళ్లిళ్లతో అనేక అనర్థాలు : ప్రముఖ ఇన్‌ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ బూర పద్మజ

కరీంనగర్‌, మే 29 (నమసే ్తతెలంగాణ ప్రతినిధి) :‘జీవితంలో కష్ట సుఖాలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, మూడు ముళ్లు.. ఏడు అడుగులతో తన జీవితంలోకి అడుగు పెట్టే శ్రీమతిపై యువకులు ఎన్నెన్నో కలలు కంటారు.’ ఏ వయసు ముచ్చట ఆ వయసులోనే తీరాలంటారు పెద్దలు. కానీ, చాలా మంది యువకులు ఈ ముచ్చటకు దూరమవు తున్నారు. పెళ్లికాని ప్రసాదుల్లా మిగిలిపోతున్నారు.. సకాలంలో అమ్మాయిలు దొరక్క వయసు మీరిపోతున్నారు. 33 దాటినా మూడుముళ్ల బంధానికి నోచుకోలేక అబ్బాయే కాదు.. వారి తల్లిదండ్రులూ మదన పడుతున్నారు. ఇదే సమయంలో అమ్మాయి కుటుంబ సభ్యులు సూక్ష్మ అన్వేషణ చేస్తున్నారు. తగిన వాడు అనుకుంటే తప్ప.. ముందడుగు వేయడం లేదు. పరిస్థితులన్నింటినీ బేరీజు వేసి చూస్తే.. మూడు పదులు దాటుతున్న యువకుల సంఖ్య పెరుగుతుండగా.. ఆలస్యపు పెళ్లిళ్ల వల్ల ఎన్నో అనర్థాలున్నాయంటున్నారు ప్రముఖ వైద్యురాలు పద్మజ. అంతేకాదు.. సంతానమే ఓ సమస్యగా మారుతుందని, మారుతున్న జీవన శైలికి అనుగుణంగా సకాలంలో పెళ్లిళ్లు చేసుకుంటేనే శ్రేయస్కరమంటున్నారు.

ఇటీవలి కాలంలో మెజార్టీ సామాజిక వర్గాల్లో అమ్మాయిల కొరత కనిపిస్తున్నది. పురుషులు 29 ఏళ్లలోపు పెళ్లి చేసుకోవాలని అనేక శాస్ర్తాలు, అధ్యయనాలు, వైద్యులు చెబుతున్నా.. ప్రస్తుత పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నది. అమ్మాయిల కొరత ఒక అంశం అయితే.. కొన్ని కుటుంబాల్లో కోటి ఆశలు ఉండడం ఆ యువకులను ఎటు కాకుండా చేస్తున్నది. మంచి అమ్మాయి దొరికితే కట్నం కోసం ఆరా తీయడం.. కట్నం ఇచ్చే వారు దొరికితే అమ్మాయి అంత అందంగా లేదని వంకలు పెట్టడం.. ఉద్యోగం ఉంటే మరో రకమైన వంక పెట్టడం ఎన్నో కుటుంబాల్లో కనిపిస్తున్నది. ఇలా ఆలస్యం చేయడం వల్ల ఎంతో మంది యువకుల వయసు కూడా మీదపడుతున్నది. ఇటు మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించడం, లేదంటే జీవితంలో సెటిల్‌ అయ్యే దాకా వేచి చూడడం లాంటి కారణాలతోనూ ఈడు దాటుతున్నది. అసలే అమ్మాయిల కొరత ఉండగా, 30 దాటుతున్న వారికి పిల్ల దొరకడం కష్టమవుతున్నది.
కరోనా ప్రభావం
కరోనా ప్రభావం ప్రతి ఒక్కరిపైనా పడుతున్నది. పెళ్లిళ్లపైనా ఈ ఎఫెక్ట్‌ కనిపిస్తున్నది. కొవిడ్‌కు ముందు పరిస్థితి వేరేగా ఉండేది. తెలిసిన వారి ద్వారానో.. మ్యారేజ్‌ బ్యూరోల ద్వారానో సంబంధాలు కుదుర్చుకునే వాళ్లు. లేదంటే ఫంక్షన్లలో అబ్బాయినో.. అమ్మాయినో చూసినప్పుడు ఆరాతీసేవాళ్లు. నచ్చితే ఇటు అబ్బాయి, అటు అమ్మాయి వాళ్లు ముందుగా జాతకాలు చూసేవాళ్లు. ఓకే అయితే పెళ్లిచూపులు ఏర్పాటు చేసుకునేవాళ్లు. మాటా ముచ్చట కూడా మాట్లాడుకునే వాళ్లు. ప్రస్తుతం ఆ పరిస్థితుల్లేవు. ఒకరింటికి మరొకరు వెళ్లే రోజులు లేవు. మ్యారేజ్‌ బ్యూరోలు వేదికలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. అయినా, కొంత మంది అబ్బాయిలు తొందర పడుతున్నా అమ్మాయిల కుటుంబం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడం లేదు. ‘మీకు వీలైతే ఆగండి.. లేదా వేరే సంబంధం చూసుకోండి’ అంటూ తెగేసి చెబుతున్నారు అమ్మాయి తరఫువారు. ఇందుకు చాలా కారణాలు ఉంటున్నాయి. మరోవైపు చాలా సామాజికవర్గాల్లో మ్యారేజ్‌ బ్యూరోలు పెళ్లి పెద్దల పాత్ర పోషించేవి. ఉమ్మడి జిల్లాలో వివిధ సామాజిక వర్గాలకు సంబంధించి 280కి పైగా మ్యారేజ్‌ బ్యూరోలు ఉండేవి. పెళ్లిళ్ల సీజన్‌ వచ్చిదంటే చాలు.. సంబంధాలు కుదుర్చడంలో చాలా బిజీగా ఉండేవి. ప్రస్తుతం కరోనాతో కార్యకలాపాలు సాగించడం లేదు.
పెరుగుతున్న పెళ్లికాని ప్రసాద్‌లు
జీవితంలో సెటిల్‌ అయిన తర్వాతే చేసుకుంటామని ప్రతి ఒక్కరూ చెబుతుండడం కనిపిస్తున్నది. ఇది నిజమే. కానీ, సెటిల్‌ అయ్యే సరికి చాలా మంది ఈడు దాటిపోతున్నది. చదువు, మంచి జాబ్‌ లేదంటే బిజినెస్‌లో స్థిరపడడం.. లాంటి కారణాలతో అప్పుడే వయసు 28 లేదా 30 ఏండ్లకు చేరుతున్నది. ఇక అప్పుటి నుంచి పెళ్లి చూపులు చూడడం మొదలు పెడుతున్నా, కొరతతో పిల్ల దొరకడం కష్టమవుతున్నది. ఇటు జీవితంలో పూర్తిస్థాయిలో స్థిర పడడం ఒక ఎత్తయితే.. మంచి కుటుంబంతోపాటు మంచి వేతనం ఉంటేనే అమ్మాయిలను ఇవ్వడానికి తల్లిదండ్రులు ఇష్టపడడం కనిపిస్తున్నది. ఒకప్పుడు తల్లిదండ్రుల అంగీకారంతో పెళ్లిళ్లు జరిగినా, ఇప్పుడు పెళ్లి విషయంలో అమ్మాయిల ప్రాధాన్యం పెరిగింది. అబ్బాయి ఆస్తిపరుడైనా ఉండాలని, లేదంటే మంచి ఉద్యోగం చేస్తూ ఉండాలని కోరుకోవడం కూడా వివాహాల ఆలస్యానికి కారణమవుతున్నది. మరోవైపు కరోనా ప్రభావం కూడా పడుతున్నది. ఈ క్రమంలోనే అబ్బాయిల వయసు పైబడి పోతున్నది. కొన్ని సామాజిక వర్గాల్లో పిలగానికి అన్ని హంగులున్నా.. పిల్ల దొరకడానికి చాలా సమయం పడుతున్నది. ప్రస్తుతం ఏ సామాజికవర్గం తీసుకున్నా.. మూడు పదులు దాటిన యువకులే ఎక్కువగా కనిపిస్తున్నారు. వీరికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు కూడా అష్టకష్టాలు పడుతున్నారు. మున్ముందు ఎంత మంది పెళ్లికాని ప్రసాద్‌లుగా మిగిలి పోతారోనన్న ఆందోళన కూడా పలు కుటుంబాల్లో నెలకొంటున్నది.

ఆదిలాబాద్‌ జిల్లాకేంద్రంలో నివాసం ఉంటున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి వ్యాపార రంగంలో దిట్ట. కోట్ల కొద్దీ ఆస్తులు. ఇతనికి ఒక బిడ్డ, కొడుకు. బిడ్డకు పెళ్లయ్యేవరకు కొడుక్కు చేయనని అందరికీ చెప్పాడు. కూతురికి 28 వయసులో పెళ్లయింది. ఇప్పుడు అబ్బాయికి 33 ఏండ్లు. వయసు పైబడిందని ఎవరూ అమ్మాయిని ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఈ సామాజిక వర్గంలోనూ అమ్మాయిల కొరత తీవ్రంగా ఉన్నది. ఇవి మచ్చుకు మాత్రమే. అన్ని సామాజివర్గాల్లోనూ అమ్మాయిలు దొరకడం లేదు. పైగా కరోనా ప్రభావంతో మెజార్టీ తల్లిదండ్రులు పెళ్లిళ్లు చేసేందుకు ముందుకు రావడం లేదు. పెళ్లి చూపులకు కూడా ఇష్టపడడం లేదు. కొవిడ్‌ ప్రభావం తగ్గిన తర్వాత చూద్దాంలే అని అంటుండగా, ఎంతో మంది అబ్బాయిలు సకాలంలో పిల్ల దొరక్క వయసుమీరుతున్నారు. పెద్ద సంఖ్యలో పెళ్లికాని ప్రసాద్‌లుగా మారుతున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఈడు ఆగదు.. పిల్ల దొరకదు..

ట్రెండింగ్‌

Advertisement