e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home కొమరంభీం ఆందోళన వద్దు ..ఆదుకుంటాం..

ఆందోళన వద్దు ..ఆదుకుంటాం..

సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో రంగంలోకి..
ముంపు ప్రాంతాలు, మునిగిన పంటలను పరిశీలించిన కలెక్టర్‌ భారతీ హోళికేరి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌, ఎమ్మెల్యే దివాకర్‌రావు
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో యంత్రాంగం సహాయక చర్యలు
నాటు పడవల్లో సురక్షిత ప్రదేశాలకు ప్రజల తరలింపు
లోతట్టు ప్రాంత వాసులకు పునరావాసం
మంచిర్యాలలో కాలనీలను పరిశీలించిన సీపీ సత్యనారాయణ
పలుచోట్ల వరదల్లో చిక్కుకున్న 61 మందిని కాపాడిన అధికారులు
గుడిరేవు గోదావరి వద్ద చిక్కిన మొసలి
కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అత్యవసర సమావేశం
మూడో రోజులు అధికారులకు సెలవులు రద్దు

కుమ్రం భీం ఆసిఫాబాద్‌/మంచిర్యాల, జూలై 23, నమస్తే తెలంగాణఫకుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండగా, ప్రజలను ఆదుకునేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో శుక్రవారం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరికొందరికి పునరావాసం కల్పించారు. పలుచోట్ల వాగుల్లో చిక్కుకున్న 61 మందిని కాపాడారు. చెన్నూర్‌ మండలం సుందరశాల, కోటపల్లి మండలం రాంపూర్‌, కొల్లూర్‌, దేవులవాడలో నీటమునిగిన పంటలను ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌, కలెక్టర్‌ భారతీహోళికేరి పరిశీలించారు. మంచిర్యాలలోని పలు కాలనీల్లో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు నడుము లోతు నీటిలో తిరిగారు. బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వ పరంగా అండగా ఉంటామంటూ వారంతా భరోసానిచ్చారు. ఆసిఫాబాద్‌లో కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అత్యవసర సమావేశం నిర్వహించి, అధికారులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మూడు రోజుల పాటు సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు మంచిర్యాలలో బీభత్సం సృష్టించాయి. వానలకు తోడు ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి కిందకు నీటిని వదలడం, మరోవైపు కాసిపేట, మందమర్రి మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు రాళ్లవాగు ఉధృతంగా ప్రవహించడంతో మంచిర్యాల పట్టణానికి వరద పోటెత్తింది. పట్టణంలోని ఎన్టీఆర్‌ నగర్‌, కుమ్రం కాలనీ, రాంనగర్‌, ఎల్‌ఐసీ కాలనీ, పద్మశాలీ కాలనీ, పాతమంచిర్యాల ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరడంతో పట్టణ వాసులు ఇబ్బంది పడ్డారు. ఏసీసీ, జాఫర్‌నగర్‌, హమాలీవాడ, సీతారామకాలనీ, బృందావన్‌కాలనీ, సాయికుంట, గర్మిళ్ల ప్రాంతాల్లో నీరు ఇండ్ల మధ్య నిలిచిపోయింది. రంగంపేట కాజ్‌వే పైనుంచి రాళ్లవాగు ఉధృతంగా ప్రవహించింది.
సహాయక చర్యల్లో ఎమ్మెల్యే, అధికారులు, నాయకులు
మంచిర్యాల పట్టణంలో సహాయ చర్యలను కలెక్టర్‌ భారతీ హోళికేరి, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య పర్యవేక్షించారు. రాంనగర్‌లో ఇండ్లలోకి నీరు చేరడంతో బాధితులను తెప్పలపై బయటకు తీసుకువచ్చారు. ఎన్టీఆర్‌నగర్‌లో బాధితులను సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఎల్‌ఐసీ కాలనీ, రాంనగర్‌ కాలనీ వాసుల వద్దకు నడుంలోతున్న నీటిలో నడచుకుంటూ వెళ్లి ఎమ్మెల్యే దివాకర్‌రావు సహాయక చర్యలు చేపట్టారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పల్లె భూమేశ్‌, నడిపెల్లి ట్రస్ట్‌ చైర్మన్‌ విజిత్‌రావు, పలువురు కౌన్సిలర్లున్నారు. పట్టణ సీఐ ముత్తి లింగయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ స్వరూపారాణి, తహసీల్దార్‌ రాజేశ్వర్‌ వరద ప్రాంతాలకు చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో బాధితులను తెప్పలు, పడవల సాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించారు.
నీట మునిగిన ఇండ్లు..
హాజీపూర్‌, జూలై 23 : ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని వదులుతుండడంతో మండలంలోని తోతట్టు ప్రాంతాలైన వేంపల్లిలోని ఓ ఇల్లు సగానికి మునిగింది. అందులో ఐదుగురు చిక్కుకున్నారు. మంచిర్యాల గార్డెన్‌లో నలుగురు చిక్కుకున్నారు. వీరిని సర్పంచ్‌ శారద-రమేశ్‌ అక్కడికి చేరుకొని మంచిర్యాల రూరల్‌ సీఐ కుమార స్వామికి, ఎస్సైకి, తహసీల్దార్‌ సాయంతో నాటు పడవల ద్వారా బయటకు తీసుక వచ్చారు.
కర్ణపేటలో కూలిన పెంకుటిల్లు..
దండేపల్లి, జూలై 23 : మండలంలోని కర్ణపేటలో భూక్యా శ్రీధర్‌కు చెందిన పెంకుటిల్లు వర్షానికి కూలింది. గోదావరి ఉప్పొంగి ప్రవహించడంతో తీర ప్రాంతాల్లోని పొలాల్లో కి వరద చేరి విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. గుడిరేవు, ద్వారక,లక్ష్మీకాంతాపూర్‌, కాసిపేట, వెల్గనూర్‌, నంబాల, గూడెం గ్రామాల్లో గోదావరి వరదలో 150 ఎకరాల్లో పత్తి పంట నీట మునిగిందని అధికారులు అంచనా వేశారు. ద్వారకలో నీటమునిగిన పంటలను మండల వ్యవసాయాధికారి అంజిత్‌కుమార్‌ పరిశీలించారు.
కూలిన విద్యుత్‌ స్తంభాలు
జన్నారం, జూలై 23 : గోదావరి తీర గ్రామాలైన కలమడుగు, ధర్మారం, బాదంపెల్లి, చింతగూడ, రోటిగూడ, తపాలాపూర్‌లో 90 విద్యుత్‌ స్తంభాలు, 25 విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరిగాయి. విద్యుత్‌ మోటర్లు వరదనీటికి గోదావరిలో కొటుకుపోయాయని రైతులు తెలిపారు.
నస్పూర్‌కు గోదావరి వరద ఉధృతి
సీసీసీ నస్పూర్‌, జూలై 23 : ఎల్లంపల్లి ప్రాజెక్టు వరదతో నస్పూర్‌ గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. నస్పూర్‌, సీతారాంపల్లి, తాళ్లపల్లి, సింగాపూర్‌ ప్రాంతాల్లో పత్తి పంట, వరి పొలాలు నీట మునిగాయి. వ్యవసాయ మోటర్లు, చేపల వలలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరడంతో నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి, భోజన వసతి కల్పించారు. ఎమ్మెల్యే దివాకర్‌రావు పర్యటించి, సహాయక చర్యలు చేపట్టారు. 30ఏళ్ల క్రితం మాత్రమే ఇలాంటి వరదలు చూశామని స్థానికులు తెలిపారు. సహాయక చర్యల్లో మున్సిపల్‌ చైర్మన్‌ ఈసంపల్లి ప్రభాకర్‌, వైస్‌ చైర్మన్‌ తోట శ్రీనివాస్‌, కమిషనర్‌ తుంగపిండి రాజలింగు, డిప్యూటీ తహసీల్దార్‌ సంతోష్‌, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు వంగ తిరుపతి, కౌన్సిలర్లు జబిన్‌హైమద్‌, సుర్మిళ్ల వేణు, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ గర్శె భీమయ్య, నాయకులు జాబ్రిగౌస్‌, గడ్డం శ్రీనివాస్‌గౌడ్‌, దగ్గుల మధు, రాజు, రవిగౌడ్‌, తదితరులు ఉన్నారు.
ఉప్పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు
కాసిపేట, జూలై 23 : కాసిపేట మండలంలో ఒర్రెలు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గురువాపూర్‌, పెద్దనపల్లి, కొండాపూర్‌ నుంచి నగరం వెళ్లే దారిలో ఉన్న వాగులు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కుర్రేఘడ్‌లో మూడు ఎడ్లు వాగులో కొట్టుకుపోతుండగా రెండు ఎడ్లను గ్రామస్తులు కాపడగా కుర్సింగ మాధవరావుకు చెందిన ఎద్దు మృతి చెందింది. నష్ట పరిహారం అందించాలని బాధితుడు వేడుకున్నాడు. వరిపేట, కోనూర్‌, వెంకటాపూర్‌, రొట్టెపల్లిలో సుమారు 50 ఎకరాల్లో పంట నష్ట జరిగిందని మండల వ్యవసాయాధికారిని దేవులపల్లి వందన, ఏఈవో శ్రీధర్‌ అంచనా వేశారు.
వరద ఉధృతి పరిశీలన
నెన్నెల, జూలై 23: నెన్నెల సమీపంలోని లంబాడీ తండా ఎర్రవాగు కల్వర్టు ను తహసీల్దార్‌ సంపతి శ్రీనివాస్‌ పరిశీలించారు. జంగాల్‌పేటలోని వాగు ప్రవాహంతో దమ్మిరెడ్డి పేట వాసులకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆవుడంలో ఇల్లు పాక్షికంగా, పూరి గుడిసెలు దెబ్బతిన్నట్లు తహసీల్దార్‌ తెలిపారు. చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.
వాగులు దాటవద్దు
కన్నెపల్లి, జూలై 23 : భీమిని, కన్నెపల్లి మండలాల్లోని వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఎవరూ దాట వద్దని, చేపలను పట్టవద్దని తాండూర్‌ సీఐ బాబురావు సూచించారు. భీమిని మండలంలోని భీమిని ఎర్రవాగును పరిశీలించారు. అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచించారు. ఆయన వెంట భీమిని ఎస్‌ఐ కొమురయ్య, ఆర్‌ఎస్‌ఐలు కృష్ణాగౌడ్‌, ప్రసాద్‌, పోలీసులు ఉన్నారు.
కొట్టుకుపోయిన నీల్వాయి వాగుపై తాత్కాలిక వంతెన
వేమనపల్లి, జూలై 23 : నీల్వాయి ప్రాజెక్టు నిండి మత్తడి దూకింది. వాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన కొట్టుకపోయింది. 24 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చామనపల్లి, బద్వెల్లి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.రాకపోకలు నిలిచిపోయాయి. గొర్లపల్లి వాగు, ప్రాణహిత నదిలో నీరు పెరుగుతుండడంతో అక్కడికి వెళ్లవద్దని, చేపలు వేటాడవద్దని తహసీల్దార్‌ మధుసూదన్‌ సూచించారు. వర్షాలతో ఇండ్లు కూలినా, పశువులు మృతిచెందిన వెంటనే స్థానిక సర్పంచ్‌కు లేదా వీఆర్‌ఏకు తెలియజేయాలని సూచించారు. నీల్వాయి వాగు ఎవరూ దాటకుండా ఉండేందుకు బందోబస్తును చెన్నూర్‌ రూరల్‌ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
తెగిన ఊర చెరువు మత్తడి..
భీమారం, జూలై 23 : మండలంలోని కాజీపల్లి శివారు ప్రాంతంలో ఉన్న ఎలివెళ్లి చెరువును పరిశీలించిన అనంతరం నర్సింగాపూర్‌లోని ఊర చెరువును ఎంపీడీవో శ్రీనివాస్‌ , ఎంపీవో శ్రీపతి బాపు పరిశీలించారు. ఊర చెరువుగు మత్తడి తెగిన విషయాన్ని ఇరిగేషన్‌ డీఈ శారద దృష్టికి తీసుకెళ్లారు. వారి వెంట సర్పంచ్‌లు దుర్గం మల్లేశ్‌ , దాడి తిరుపతి , పంచాయతీ కార్యదర్శి నలిమల సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
నీటమునిగిన పంటలు
జైపూర్‌, జూలై 23: వరదలతో మండలంలోని వేలాల, శివ్వారం, పౌనూర్‌, తదితర గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. ఇందారం, టేకుమట్ల, వేలాల గ్రామాల్లో సుమారుగా 276 ఎకరాల్లో వరి, పత్తి మునిగినట్లు అధికారులు తెలిపారు. ముదిగుంటలో పత్తి దుర్గయ్యకు చెందిన ఇల్లు, మిట్టపల్లిలో రాచర్ల భూలక్ష్మికి చెందిన ఇల్లు కూలింది. ఎప్పటికప్పుడు ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డి, తహసీల్దార్‌ మోహన్‌రెడ్డి, ఎంపీవో సతీశ్‌కుమార్‌ పరిస్థితులను సమీక్షించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana