e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, January 28, 2022
Home కొమరంభీం సలాం పోలీస్‌

సలాం పోలీస్‌

  • విధి నిర్వహణలోప్రాణాలర్పిస్తున్న పోలీసులు
  • ఉమ్మడి జిల్లాలో 55 మంది..
  • త్యాగాలకు గుర్తుగా ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో భవనాలు
  • నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం

మంచిర్యాల, నమస్తే తెలంగాణ/ గర్మిళ్ల/ ఎదులాపురం, అక్టోబర్‌ 20 : పోలీసు విధి నిర్వహణ చాలా శ్రమతో కూడుకున్నది. అమోఘమైంది. ఇతర ఉద్యోగుల్లా కొన్ని గంటలకు పరిమితమైంది కాదు. ప్రతి ఒక్కరూ ఏ ఆపదకైనా ఆశ్రయించేది పోలీసులనే. విధి నిర్వహణలో పోలీసు త్యాగాలు చిరస్మరణీయమైనవి. పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం. సంపన్నుడు మొదలు సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ ప్రతి అవసరానికీ సాయం కోరేది పోలీసులనే. దండెత్తి వచ్చే శత్రువుల నుంచి దేశాన్ని కాపాడేవారు సైనిక జవానులైతే, అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడి, భద్రతకు భరోసా ఇచ్చేది, సామాజిక ఆస్తులను సంరక్షించేది పోలీసులు. శాంతిభద్రతలను అదుపులో పెట్టడం, నేరగాళ్లను నియంత్రించడం పోలీసు కర్తవ్యం. అంతర్గత భద్రతను కాపాడే పనిలో పోలీసులు ప్రాణాలు సైతం అర్పిస్తున్నారు. సంఘ విద్రోహ శక్తులతో పోరాడి విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకునేందుకు గురువారం జిల్లాలో పోలీసుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. అమరులైన పోలీసులకు నివాళి అర్పించడం, వారి త్యాగాలను గుర్తు చేస్తూ ర్యాలీలు, మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు.

నాటి అమరవీరుల గాథ..
పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేం. వ్యవస్థ సాఫీగా నడవడంలో పోలీసులది కీలకపాత్ర. పోలీసుల అమరవీరులను స్మరించుకునే రోజుకు మహోన్నత చరిత్ర ఉంది. 1959, అక్టోబరు 21.. అంటే సరిగ్గా 62 ఏళ్ల కిందట ‘భారత్‌ – టిబెట్‌’ సరిహద్దుల్లో ఉన్న లఢక్‌లోని ఆక్సాయ్‌చిన్‌ వద్ద భారత్‌కు చెందిన కేంద్ర రిజర్వు పోలీసులు (సీఆర్‌పీఎఫ్‌) సరిహద్దు రక్షణలో ఉన్నారు. విపరీతమైన చలిలో పది మంది సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు విధులు నిర్వహిస్తుండగా, చైనా సైనికులు భారీ సంఖ్యలో మన దేశ సరిహద్దులోకి చొచ్చుకొచ్చారు. వారిని ఈ 10 మంది పోలీసులు ధైర్యంగా ఎదిరించారు. చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి, దేశం కోసం అసువులు బాశారు. భారత దేశ రక్షణ కోసం పోలీసులు ప్రాణాలు వదిలిన తొలి సందర్భమది. ఇందుకు గాను అన్ని రాష్ర్టాల పోలీసు ఉన్నతాధికారులు 1960 జనవరి 9న సమావేశమయ్యారు. అక్టోబర్‌ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించాలని తీర్మానించారు. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా అక్టోబర్‌ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నారు. అమర పోలీసుల వీర త్యాగాన్ని స్మరించుకొని వారి కుటుంబాలకు సానుభూతిని, సహకారాన్ని ప్రకటించి వారికి ఘనమైన నివాళులర్పిస్తున్నారు. ఇదే కాకుండా విధి నిర్వహణలో అమరులైన పోలీసులు చేసిన ప్రాణత్యాగాలను గుర్తు చేసుకుంటూ అమరుల పేరిట కట్టడాలకు ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌ వేదికైంది.

- Advertisement -

ఉమ్మడి జిల్లాలో 55 మంది అమరులు..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 1985 నుంచి 2001 వరకు 55 మంది పోలీసులు మావోయిస్టుల ఘాతుకాలకు బలయ్యారు. వీరిలో ఒక సీఐ, ఏడుగురు ఎస్‌ఐలు, ఒక ఏఎస్‌ఐ, 14 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 32 మంది కానిస్టేబుళ్లున్నారు. పోలీసు చరిత్రలోనే చెరిపివేయలేని ఘటనగా 1987, ఆగస్టు 18న రాష్ట్రంలోనే మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడిన తొలి సంఘటన ఇది. కడెం మండలం అలంపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో అప్పటి ఉట్నూర్‌, సిర్పూర్‌(యూ) ఎస్‌ఐలు వెంకటనర్సయ్య, టీ రాజన్నతో పాటు మరో 8 మంది పోలీసు సిబ్బంది మరణించారు. 1956, జూన్‌ 23న శ్రీరాంపూర్‌ గ్రామంలో మావోయిస్టులు ఉన్నారని సమాచారం తెలుసుకున్న సీఐ చక్రపాణి కానిస్టేబుల్‌ అశోక్‌తో సంఘటనా స్థలానికి వెళ్లారు. గమనించిన మావోయిస్టులు వీరిపై ఎదురుకాల్పులు జరపడంతో మరణించారు. ఉట్నూర్‌ మండలం గంగాపూర్‌ గ్రామ శివారులో తునికాకు కళ్లాలను మావోయిస్టులు కాలుస్తున్నారని తప్పుడు సమాచారంతో కొరియర్‌ ద్వారా పోలీసులకు 1991, మే17న సమాచారం అందించారు. మావోయిస్టులు మాటు వేసి గిరిజన పోలీస్‌ ఎస్‌ఐ కోట్నాయక్‌తో ఇద్దరు పోలీసులను కిరాతకంగా హతమార్చారు. విధి నిర్వహణలో ఉన్న బెల్లంపల్లి ఐడీ పార్టీ పోలీసులు శేషు, సంజీవ్‌పై సికాస మావోయిస్టులు 1998, మే 28న పట్టపగలే కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి చెందారు.

అల్లంపల్లి ఘటనకు గుర్తుగా..
పోలీసు చరిత్రలోనే చెరిపివేయలేని ఘటనగా 1987, ఆగస్టు 18న రాష్ట్రంలోనే తొలి మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడిన సంఘటన ఇది. క డెం మండలం అలంపల్లి అటవీ ప్రాంతంలో జరిగి న ఈ ఘటనలో అప్పటి ఉట్నూర్‌, సిర్పూర్‌(యూ) ఎస్‌ఐలు వెంకటనర్సయ్య, టీ రాజన్నతో పాటు మరో 8 మంది పోలీసు సిబ్బంది మరణించారు. వీరికి గుర్తుగా పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌ ప్రాంగణంలో అల్లంపెల్లి కాంప్లెక్స్‌ పేరిట భవనాన్ని నిర్మించారు.

సీఐ చక్రపాణి పేరుతో సమావేశ మందిరం..
1956, జూన్‌ 23న శ్రీరాంపూర్‌ గ్రామంలో మావోయిస్టులు ఉన్నారని సమాచారం తెలుసుకున్న సీఐ చక్రపాణి కానిస్టేబుల్‌ అశోక్‌తో సంఘటనా స్థలానికి వెళ్లారు. గమనించిన మావోయిస్టులు వీరిపై ఎదురు కాల్పులు జరపడంతో మరణించారు. సీఐ చక్రపాణి చేసిన సేవలను గుర్తుంచుకొని హెడ్‌క్వార్టర్‌లో చక్రపాణి మెమోరియల్‌ సమావేశ మందిరాన్ని నిర్మించారు.

కోట్నాక్‌ పేరుతో పార్కు..
ఉట్నూర్‌ మండలం గంగాపూర్‌ గ్రామ శివారులో తునికాకు కళ్లాలను మావోయిస్టులు కాలుస్తున్నారన్న తప్పుడు సమాచారంతో కొరియర్‌ ద్వారా పోలీసులకు 1991, మే17న సమాచారం అందించారు. మావోయిస్టులు మాటువేసి గిరిజన పోలీసు ఎస్‌ఐ కోట్నాయక్‌తో సహా ఇద్దరు పోలీసులను కిరాతకంగా హతమార్చారు. ఆయనను స్మరించుకుంటూ హెడ్‌క్వార్టర్‌లో పోలీసుల పిల్లల కోసం పార్కు నిర్మించారు.

కానిస్టేబుళ్ల పేరిట జిమ్‌ ఏర్పాటు..
బెల్లంపల్లి ఐడీ పార్టీ పోలీసులు శేషు, సంజీవ్‌పై సికాస మావోయిస్టులు 1998, మే 28న పట్టపగలే కాల్పులు జరిపారు. ఇద్దరూ మృతి చెందడంతో హెడ్‌క్వార్టర్‌లో వారి పేరిట కానిస్టేబుళ్లకు జిమ్‌ ఏర్పాటు చేశారు. ఈ కట్టడాలను చూస్తూ అమరుల త్యాగాలను స్మరించుకుంటున్నారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement