సోమవారం 08 మార్చి 2021
Komarambheem - Jan 27, 2021 , 01:17:22

గుస్సాడీకి గౌరవం

గుస్సాడీకి గౌరవం

  • ఆదివాసీ కనక రాజును వరించిన పద్మశ్రీ    
  • 40 ఏండ్లుగా వేలాది వేదికలపై ప్రదర్శనలు
  • ఇందిరా, అబ్దుల్‌ కలాం ఎదుట ప్రదర్శన    
  • మంత్రి కేటీఆర్‌, అల్లోల, పలువురు ప్రముఖుల అభినందనలు    
  • కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా మార్లవాయిలో సంబురాలు 

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, జనవరి 26 (నమస్తే తెలంగాణ ): ఆదివాసుల సంస్కృతీ సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. వీరి కళా నృత్యాల ప్రదర్శన జనరంజకంగా ఉంటాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రతి విషయంలో నియమ నిష్టను మాత్రం తప్పరు. దేశంలో ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినా, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి ఆదివాసులు తప్పనిసరిగా పాల్గొంటారు. ముఖ్యంగా గుస్సాడీతో జిల్లా ఆదివాసులకు విడదీయరాని అనుబంధం ఉంది. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుస్సాడీ కళాకారుడు కనకరాజుకు కేంద్రం పద్మశ్రీ ప్రకటించడం, తమ సంస్కృతికి దక్కిన గౌరవంగా ఆదివాసీ సమాజం భావిస్తున్నది. 60 ఏళ్ల కనక రాజు 40 ఏళ్లుగా గుస్సాడీ ప్రదర్శనలో నైపుణ్యాన్ని చాటుతున్నాడు. 

ఇంటిపేరునే గుస్సాడీగా మార్చుకున్న రాజు..

గుస్సాడీ ప్రదర్శనలో తనదైన ప్రతిభను చూపుతున్న కనకరాజు తన ఇంటిపేరునే గుస్సాడీగా మార్చుకున్నారు. కనక రాజుగా కంటే గుస్సాడీ రాజుగానే స్థానికంగానే పేరొందాడు. తన 20వ యేటా గుస్సాడీ నృత్యాన్ని నేర్చుకొని, వేలాది వేదికలపై ప్రదర్శననిచ్చారు. రాష్ట్రంతోపాటు దేశంలో ఎక్కడా సాంస్కృతిక ప్రదర్శనలు జరిగినా, ఐటీడీఏ తప్పనిసరిగా మార్లవాయికి చెందిన రాజు బృందాన్ని తీసుకెళ్లేది. ఏ వేదికపై ప్రదర్శననిచ్చినా, రాజు బృందానికి అవార్డులు, రివార్డుల పంట పండేది. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా గుస్సాడీ నృత్యానికి దేశవ్యాప్త గుర్తింపు తేవడంలో ఆయన కృషి చాలా ఉంది.

యువతకు వారధిగా.. 

తమ సనాతన సంప్రదాయాలను నేటి యువతకు అందించే వారధిగా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు రాము-రాజుబాయి నుంచి ఈ కళను నేర్చుకుని గుస్సాడీ టోపీలను తయారు చేయడం దగ్గరి నుంచి గుస్సాడీ నృత్యాలు ప్రదర్శించడం, సంప్రదాయ పద్ధతులను పాటించడం నేటి యువతకు నేర్పిస్తున్నారు. ఈ 40 ఏండ్ల కాలంలో వందలాది మంది ఆదివాసీ యువకులకు గుస్సాడీ నృత్యాన్ని నేర్పించారు. ఇప్పటికీ నేర్పిస్తూనే ఉన్నారు.

ఎర్రకోటలో ప్రదర్శన..

1981లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎదుట, ఆ తరువాత రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్‌ కలాం ఉన్న సమయంలో ఎర్రకోటలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించి మన్ననలు పొందారు. కాగా..  మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా అభినందించగా, మంత్రి అల్లోల స్వయంగా ఫోన్‌లో మాట్లాడి, శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు కోవ లక్ష్మి, కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు అభినందించి ప్రత్యేకంగా సన్మానించారు. మార్లవాయి యువకులు ప్రత్యేకంగా సత్కరించారు.

కనకరాజును అభినందించిన మంత్రి  అల్లోల

నిర్మల్‌ అర్బన్‌, జనవరి26 : పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం కనకరాజుకు ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. ఆదివాసీ సంప్రదాయాలను ప్రతిబింబించే గుస్సాడీ నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన కనకరాజుకు దక్కిన అరుదైన గౌరవమని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. 

VIDEOS

logo