ఆదివారం 17 జనవరి 2021
Komarambheem - Dec 04, 2020 , 01:41:39

బాలల హక్కులను పరిరక్షించాలి

బాలల హక్కులను పరిరక్షించాలి

  • రాష్ట్ర కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ మెంబర్‌ దేవయ్య
  • అన్ని శాఖల అధికారులతో సమీక్ష

ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌ : బాలల హక్కుల పరిరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని రాష్ట్ర కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ మెంబర్‌ ఏ దేవయ్య సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బాలల హక్కుల కమిషన్‌ 2019లో ఏర్పాటైందన్నారు. ప్రభుత్వం బాలల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా గిరిజన ప్రాంతాల్లో మెరుగైన సేవలు అందించాలని తెలిపారు.

పిల్లల సంక్షేమం, మెరుగైన సేవలు అందించేందుకు తగు ప్రణాళికలు అమలు చేయాలన్నారు. పిల్లలందరినీ ఆయా పాఠశాలల్లో చేర్పించేందుకు కృషిచేయాలని తెలిపారు. మహిళా శిశు సంక్షేమ, పోలీసు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. ప్రతి మూడు నెలలకోసారి అన్ని శాఖలతో సమీక్షిస్తామని వెల్లడించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో కృషిచేయాలన్నారు. విద్య, వైద్యం పరంగా బాలల హక్కులను రక్షించాలని సూచించారు. బాలల హక్కుల పరిరక్షణకు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ రాంబాబు, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి సావిత్రి, డీఎంహెచ్‌వో కుమ్రం బాలు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.