ఆదివారం 17 జనవరి 2021
Komarambheem - Dec 04, 2020 , 01:41:39

అన్వేషణ ఫలించేనా..!

అన్వేషణ ఫలించేనా..!

  • బోన్లకు చిక్కని పెద్దపులి
  • అటవీ గ్రామాల్లో భయాందోళనలు
  • చేలకు వెళ్లేందుకు జంకుతున్న జనం
  •  భరోసా కల్పించని అధికారుల చర్యలు

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : ఇద్దరిని బలితీసుకున్న పెద్దపులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నా ఫలించడం లేదు. గత నెల 11న దహెగాం మండలం దిగిడ గ్రామ సమీపంలోని పెద్దవాగులో చేపల వేటకు వెళ్లిన విఘ్నేశ్‌పై పెద్దపులి దాడి చేయగా అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో దానిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన అధికారులు పది బోన్లు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. దిగిడ ప్రాంతంలో కేవలం రెండు బోన్లను ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఆ ఘటన మరువకముందే అదేనెల 29న పెంచికల్‌పేట్‌ మండలం కొండపెల్లికి చెందిన నిర్మలను బలితీసుకున్నది. దీంతో మళ్లీ హడావుడి చేసిన అధికారులు కొండపెల్లి సమీపంలో మరో రెండు బోన్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో ట్రాక్‌ చేస్తున్నామని ప్రకటించారు. కానీ.. పులి ఇప్పటి వరకు చిక్క లేదు. అధికారులు నాలుగు రోజులు హడావుడి చేసి.. ఆ తర్వాత ఊరుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

చేలకు వెళ్లేందుకు జంకుతున్న జనం

ఆదివాసులు అడవులపై ఆధారపడి జీవిస్తారు. ము ఖ్యంగా కోయ, మన్నేవార్‌, తోటి, గోండ్‌ గిరిజనుల జీవనం పూర్తిగా అడవులతోనే ముడిపడి ఉంటుంది. తరతరాలుగా చేస్తున్న వ్యవసాయం అడవుల్లోనే సాగుతుంది. వారి నివాసాలు అడవులను ఆనుకొనే ఉంటాయి. పదేళ్లు కూడా నిండని పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి అడవుల్లోకి వెళ్తుంటారు. ప్రస్తుతం రెండు ఘటనలతో తమ చేలల్లోకి వెళ్లేందుకు జంకుతున్నారు. పులి ఏ వైపు నుంచి వచ్చి తమపై దాడి చేస్తుందోనని భయపడుతున్నారు.

భరోసా కల్పించని అధికారులు

ఇద్దరిని బలి తీసుకున్న పులిని పట్టుకునేందుకు  అధికారులు తీసుకుంటున్న చర్యలు అటవీ సమీప గ్రామాల ప్రజల్లో భరోసా కల్పించలేకపోతున్నాయి. విఘ్నేశ్‌ను చంపిన పులి మహారాష్ట్ర నుంచి వచ్చిందని, ఆ తర్వాత తిరిగి అక్కడికే వెళ్లిపోయిందని చెప్పిన అధికారులు, తాజాగా నిర్మలపై దాడిచేసిన పులి ఎక్కడిదనే విషయంపై నిర్ధారణకు రాలేకపోతున్నారు. జిల్లాలో సంచరించే పులులు మనుషులపై దాడులు చేయవని, అవి ఫ్రెండ్లీ మూమెంట్‌ తో ఉంటాయని చెబుతున్నా.. గిరిజనులకు నమ్మ కం కుదరడం లేదు. అధికారులు సీసీ కెమెరాలతో పాటు బోన్లు ఏర్పాటు చేసినా.. ఇప్పటి వరకు చి క్కింది లేదు. అటవీ అధికారులు చేస్తున్న ప్రకటన లు, చేపడుతున్న చర్యలు గిరిజనుల్లో భరోసా కల్పించలేకపోతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. నిత్యం ఎక్కడో చోట పులులు పశువులపై దాడులు చేస్తూనే ఉండడంతో.. భయం వెంటాడుతున్నది.