శుక్రవారం 22 జనవరి 2021
Komarambheem - Dec 04, 2020 , 01:41:39

దళారీ చెప్పిందే ధర

దళారీ చెప్పిందే ధర

  • పల్లెల్లో ఇష్టారాజ్యంగా పత్తి కొనుగోళ్లు
  •  రహదారుల పక్కనే కాంటాలు  
  •  అడ్డదారుల గుండా మహారాష్ట్రకు తరలింపు
  •  రూ.లక్షలు కొల్లగొడుతున్న వ్యాపారులు 
  •  ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
  •  పట్టించుకోని సీసీఐ అధికారులు  n ‘తెల్ల’బోతున్న రైతులు

పల్లెల్లో పత్తి దందా జోరుగా సాగుతున్నది. దళారులు చెప్పిందే ధర అవుతున్నది. వారు అందినకాడికి దండుకుంటున్నారు. రహదారుల పక్కనే కాంటాలు ఏర్పాటు చేసి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. అక్కడి నుంచి మహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా సర్కారు ఆదాయానికి గండి పడుతున్నది. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

- కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని మండలాల్లో పత్తి దందా జోరుగా సాగుతున్నది. రైతుల వద్ద నుంచి దళారులు అందినకాడికి దోచుకుంటున్నారు. ధర విషయంలో వారు చెప్పిందే వేదం అన్నట్టుగా మారింది. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో సీసీఐ అధికారులు 14 జిన్నింగ్‌ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు చేపడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు లేని ఏజెన్సీ లింగాపూర్‌, సిర్పూర్‌-యు, కెరమెరి, తిర్యాణి మండలాల్లో దళారులే నేరుగా రైతుల నుంచి కొనుగోళ్లు సాగిస్తున్నారు. ఒకటి, రెండు ఎకరాల్లో పత్తి పండించే చిన్న రైతులు తాము పండిన కొద్ది పాటి పత్తిని దూరంగా ఉన్న సీసీఐ కేంద్రాలకు తేలేకపోతున్నారు. వాహనాలను కిరాయికి తీసుకొని కేంద్రాలకు తెచ్చి విక్రయించక లేకపోతున్నారు. దీంతో తమ గ్రామాల్లోనే పత్తిని కొనేందుకు వస్తున్న వ్యాపారులకే విక్రయిస్తున్నారు. రైతుల పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకున్న వ్యాపారులు ఇష్టారీతిన కొనుగోళ్లు  చేపడుతున్నారు. సీసీఐ నిర్ణయించిన ధర క్వింటాలుకు రూ.5,825 ఉంటే గ్రామాల్లో కొనుగోలు చేసే వ్యాపారులు రూ.5 వేలకు మించి ఇవ్వడం లేదు. దీనికి తోడు క్వింటాలుకు 5-10 కిలోల మేర కోత విధిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

ప్రభుత్వ ఆదాయానికి గండి

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మండలాల నుంచి మహారాష్ట్రకు వెళ్లే దారుల్లో ఎలాంటి చెక్‌పోస్టులు లేకపోవడంతో వ్యాపారుల దందా సాగుతున్నది. చెక్‌పోస్టులు లేని దారులు అనేకంగా ఉండడంతో వ్యాపారులకు అడ్డూ అదుపులేకుండా పోతున్నది. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడుతున్నది. పట్టాలు లేని రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేస్తున్న వ్యాపారులు మహారాష్ట్రకు పత్తిని తరలించి విక్రయిస్తున్నారు. దళారులు స్థానికులే ఉండడంతో వారిని నమ్ముకొని తాము పండించిన పంటలను వారి చేతిలో పెడుతున్నారు. పత్తిని తరలించేందుకు వ్యాపారులు అక్కడి నుంచే తమ వాహనాలను తీసుకొస్తూ గ్రామాల్లో పత్తిని వారి కూలీలతోనే నింపుతుండడంతో రైతులు వారికి విక్రయించేందుకు ముందుకొస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్న వ్యాపారులు తమ జీరో వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. రోజుకు పదుల సంఖ్యలో పత్తి వాహనాలు తరలించినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.logo