ఆదివారం 17 జనవరి 2021
Komarambheem - Nov 28, 2020 , 00:31:00

ఇసుక పక్కదారి

ఇసుక పక్కదారి

  • ఆసిఫాబాద్‌ జిల్లాలో రెచ్చిపోతున్న సాండ్‌ మాఫియా
  • అభివృద్ధి పనుల పేరిట దందా
  • ట్రాక్టర్‌ ట్రిప్పునకు రూ. 6 వేలు, లారీ లోడ్‌ రూ. 35 వేలు
  • 20 రోజుల్లో 33 వాహనాలు సీజ్‌

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. అభివృద్ధి పనుల పేరుతో అనుమతులు తీసుకొని జిల్లా కేంద్రానికి సమీపంలోని పెద్దవాగుతో పా టు రెబ్బెన మండలంలోని పులికుంట, గంగాపూర్‌ వాగుల నుం చి నిత్యం పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఇత ర ప్రాంతాల్లో డంపు చేసుకొని  అక్కడి నుంచి  రాత్రుల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి అభివృద్ధి పావు వంతు కూడా ఇందులో ఉండదు. గత 20 రోజు ల్లో  విజిలెన్స్‌ అధికారుల దాడుల్లో 33 వాహనాలు పట్టుబడ్డాయంటే జిల్లాలో ఇసుక అక్రమ రవాణా ఏ మేరకు సాగుతుందో అర్థమవుతోంది.  ఇంకా అధికారులు కళ్లుగప్పి తరలిపోతున్న ఇసుక వాహనాలకు లెక్కలేకుండా పోతున్నదని పలువురు ఆరోపిస్తున్నారు.

అభివృద్ధి పనుల పేరిట..

జిల్లాలో రైతు వేదికలు, ప్రభుత్వ భవన నిర్మాణాల పేరిట పెద్ద ఎత్తున ఇసుక దందా నడుస్తున్నది. వాగుల్లో నుంచి ఇసుకను జిల్లాకేంద్రంతోపాటు జైనూర్‌, సిర్పూర్‌ (యూ), లింగాపూర్‌ మండలాల్లో డంప్‌ చేసుకొని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రె బ్బెన, ఆసిఫాబాద్‌, జైనూర్‌కు చెందిన కొంతమంది ఇసుక వ్యా పారులు పెద్ద ఎత్తున దందా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆసిఫాబాద్‌ శివారులోని పెద్ద వాగు, రెబ్బెనలోని గంగాపూర్‌ వాగు, పులికుంట వాగుల్లో నుంచి నిత్యం పదుల సంఖ్య లో ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారు.   తర్వాత లారీల ద్వారా జైనూర్‌, ఉట్నూర్‌, ఆదిలాబాద్‌ తదితర ప్రాంతాలకు త రలిస్తున్నారు. ఒక్క లారీలో ఆరు  ట్రాక్టర్ల ఇసుకను తీసుకెళ్లవచ్చు.

రాత్రుల్లో తరలింపు..

జైనూర్‌, సిర్పూర్‌ (యు), లింగాపూర్‌, ఉట్నూర్‌, ఆదిలాబాద్‌ ప్రాంతాల్లో ఇసుక దొరకకపోవడంతో అక్కడ జరిగే నిర్మాణాలన్నింటికీ ఆసిఫాబాద్‌ జిల్లాలోని వాగులే దిక్కు. దీంతో  ఇసుక  వ్యాపారులు ఇష్టానుసారంగా ఇక్కడి నుంచి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ నిర్మాణాల అనుమతుల పేరిట తరలిస్తున్న ఇసుకను ట్రాక్టర్‌ ట్రిప్పునకు రూ. 6 వేలు, లారీ లోడ్‌ను రూ. 35 వేల వరకు అమ్ముకుంటున్నారు. గత 20 రోజుల్లో అక్రమం గా ఇసుక తరలిస్తున్న 33 వాహనాలు పట్టుబడ్డాయి. పలు చోట్ల ఇసుక డంప్‌లను విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 30 ట్రాక్టర్లను, రెండు లారీలను, ఒక వ్యాన్‌ను పట్టుకొని సీజ్‌ చేశారు.