శనివారం 16 జనవరి 2021
Komarambheem - Nov 26, 2020 , 00:48:24

ధాన్యపు రాశులు

ధాన్యపు రాశులు

  • ఈ యేడాది ఆసిఫాబాద్‌ జిల్లాలో 60 వేల ఎకరాల్లో వరి సాగు
  • 28 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం
  • ఇప్పటికే 10 చోట్ల ప్రారంభం.. త్వరలో మిగతా 18 చోట్ల..
  • 41 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం 
  • ఇప్పటికే 236 మెట్రిక్‌ టన్నుల కొనుగోలు
  • గతేడాదికంటే  పెరిగిన మద్దతు ధర 
  • అన్నదాతల్లో ఆనందం

అన్నదాతలు ఆరుగాలం  కష్టపడి పండించిన ధాన్యపు ‘సిరి’  ఇంటికి వస్తున్నది. వానకాలంలో  జిల్లా వ్యాప్తంగా 60 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, 41 వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని యంత్రాంగం అంచనా వేసింది. అందుకనుగుణంగా 28 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ప్రస్తుతం 10 చోట్ల ప్రారం భించింది. ఆయా చోట్ల కొనుగోళ్లు జోరుగా సాగుతుండగా, ఇప్పటికే 236 మెట్రిక్‌ టన్ను లు సేకరించింది. ప్రభుత్వం గతేడాదికంటే అదనంగా మద్దతు ధర చెల్లిస్తుండగా, రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.

- కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : జిల్లా వ్యాప్తంగా వానకాలంలో 60 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. సుమారు 41 వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ యేడాది 28 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటికే 10 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మిగతా 18 కేంద్రాలను త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ వరిధాన్యం కొనుగోళ్లపై ఇటీవల సమీక్ష నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైతుల వారీగా సంచులపై నంబర్లను వేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

కొనుగోలు కేంద్రాల వద్ద సందడి

ప్రస్తుతం వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. రైతులు ధాన్యాన్ని ఎండబెట్టి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్నారు. ఎడ్ల బండ్లు, వ్యాన్లు, ట్రాక్టర్లలో తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ఏ కొనుగోలు కేంద్రంలో చూసినా రైతుల సందడి కనిపిస్తున్నది. అధికారులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మద్దతు ధర పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. మార్కెటింగ్‌, పౌరసరఫరాల అధికారులు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ సర్కారు చొరవతో దళారుల దందాకు చెక్‌ పడింది. రైతులు నేరుగా కొనుగోలు కేంద్రాలకు వచ్చి ధాన్యాన్ని విక్రయించుకొని వెళ్తున్నారు. మరోవైపు మిషన్‌కాకతీయ, 24 గంటల ఉచిత విద్యుత్‌తో గతేడాది కంటే 18 వేల ఎకరాల్లో అదనంగా సాగు చేశారు.

గతేడాదికంటే రూ. 73 అదనం

ప్రభుత్వం గతేడాది వరి ధాన్యానికి క్వింటాలుకు రూ. 1815 చొప్పున మద్దతు ధర చెల్లించింది. ఈ యేడాది క్వింటాలుకు రూ. 1888 మద్దతు ధర నిర్ణయించి చెల్లిస్తోంది. గతేడాదికంటే క్వింటాలుకు రూ. 73 అదనంగా అందజేస్తున్నది. దీంతో రైతులు ఆనందంగా ఉన్నారు.