శనివారం 28 నవంబర్ 2020
Komarambheem - Nov 22, 2020 , 00:20:04

కాంట్రాక్ట్‌ లెక్చరర్లకు బదిలీయోగం

కాంట్రాక్ట్‌ లెక్చరర్లకు బదిలీయోగం

  • విధివిధానాలు రూపొందించాలని  ఇటీవల సీఎం కేసీఆర్‌ ఆదేశాలు 
  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 473 మందికి మేలు 
  •  ఆనందోత్సాహాల్లో ఒప్పంద అధ్యాపకులు

ఆసిఫాబాద్‌ టౌన్‌ : తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్ట్‌ లెక్చరర్లపై వరాల జల్లు కురిపించింది. జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో 2000 సంవత్సరం నవంబర్‌ 20 న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్ట్‌ లెక్చరర్ల పద్ధతిని అమలు చేసింది. నాటి నుంచి ఈ విధానం కొనసాగుతూనే వచ్చింది. అప్పుడు చేరిన కాంట్రాక్‌ ్టలెక్చరర్లు ఏళ్లుగా కష్టాలు పడుతూనే కొనసాగుతూ వచ్చారు. 2011 తర్వాత కొంత మెరుగైన స్థితి వచ్చింది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతుండడం, అప్పటి ఉద్యమ నాయకుడు, ప్రస్తుత సీఎం కేసీఆర్‌ కాంట్రాక్ట్‌ లెక్చరర్లను తెలంగాణలో రెగ్యులరైజ్‌ చేస్తామని ప్రకటించడం, వారికి అండగా నిలువడంతో ప్రభుత్వం వారి వేతనాలను రూ.9 వేల నుంచి రూ.18వేలకు పెంచింది. అయితే, సెలవులు లేకపోవడం,

ప్రసూతి సెలవులు సైతం ఇవ్వకపోవడం, తదితర సమస్యలు అలాగే ఉండిపోయా యి. తెలంగాణ ఏర్పడిన వెంటనే సీఎం కేసీఆర్‌ వారి వేతనాన్ని రూ.28 వేలకు పెంచారు. అలాగే మొదటి కేబినెట్‌ సమావేశంలోనే వారి సర్వీస్‌లను క్రమబద్ధీకరించాలని తీర్మానించారు. అయితే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు నాయకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో రెగ్యులరైజేషన్‌ ప్రక్రియకు ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో కాంట్రాక్ట్‌ లెక్చరర్ల సంక్షేమం కోసం ఇతర సౌకర్యాలు కల్పించాలని సీ ఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో 2016లో వారి వేతనాన్ని రూ.37, 100కు పెంచారు. అలాగే మహిళలకు రెండు నెలల ప్రసూతి సెలవులు, నెలకు ఒక సెలవును మంజూరు చేశారు. మరీ ముఖ్యంగా కాంట్రాక్ట్‌ లెక్చరర్లకు 12 నెలల వేతనం చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో కేవలం 10 నెలలే వేతనం చెల్లించి, ఏప్రిల్‌, మే నెలలకు ఇవ్వకపోయేది. ఈ పద్ధతిని తొలగించి, పన్నెండు నెలలపాటు వేతనం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు, గత విద్యా సంవత్సరం నుంచి అందజేస్తున్నారు. తాజాగా, కాంట్రాక్ట్‌ లెక్చరర్ల బదిలీలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 120 మంది, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా 473 మందికి లబ్ధి చేకూరనుంది. 

సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..

గత 13 ఏళ్లుగా బదిలీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ద్వారా సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసు కెళ్లినం. ఆయన వెంటనే స్పందించి బదిలీల ప్రక్రియ చేప ట్టాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. అంతే గాకుండా 12 నెలల వేతనం ఇస్తూ ఆర్థిక ఇబ్బందులను దూరం చేయ డంతో పాటు బదిలీలు చేపట్టాలన్న నిర్ణయంతో కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాం ట్రాక్ట్‌ అధ్యాపకుల తరఫున కృతజ్ఞతలు. సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.

-బంద్రపు గంగాధర్‌, ఆర్జేడీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు,కుమ్రం భీం ఆసిఫాబాద్‌

సొంత ప్రాంతాలకు వెళ్లే అవకాశం ..

20 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడ్డాం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చినకంగా కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు ఏకంగా రూ. 37, 100 వేతనం పెంచి 12 నెలలు అందించడంతో తిప్పలు తప్పినయ్‌. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బదిలీలకు సైతం సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం ఆనందంగా ఉన్నది. ఇంతకుముందు భార్య,పిల్లలను ఎక్కడో ఉంచి విధులు నిర్వహించేవాళ్లం. ఇప్పుడు బదిలీలతో మా సొంత ప్రాంతాలకు వెళ్లే  అవకాశం వచ్చింది. 

బొజ్జ ప్రవీణ్‌,  ఆర్జేడీ అసోసియేషన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు, కుమ్రం భీం ఆసిఫాబాద్‌