పులకించిన పోరుగడ్డ

- జోడెఘాట్‌లో ఘనంగా కుమ్రం భీం వర్ధంతి
- గిరిజన వీరుడికి నివాళులర్పించిన అడవిబిడ్డలు
- ఆదివాసులతో కలిసి పూజలు చేసిన భీం మనువడు సోనేరావు
- నివాళులర్పించిన జడ్పీ చైర్పర్సన్, ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులు
- 24 జతల ఎడ్లు, బండ్లు పంపిణీ
- 34 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన
- పోలీసుల భారీ బందోబస్తు
జల్.. జంగల్.. జమీన్ కోసం పోరాడిన గిరిజన వీరుడి త్యాగాలను గిరిజనం స్మరించుకున్నది. శనివారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడెఘాట్‌లో కుమ్రం భీం వర్ధంతిని నిర్వహించగా పోరుగడ్డ పులకించింది. వివిధ ప్రాంతాల నుంచి అడవిబిడ్డలు వేలాదిగా తరలిరావడంతో ఆ ప్రాంతం జాతరను తలపించింది. భీం మనువడు సోనేరావు ఆదివాసులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. కుమ్రం భీం సమాధి, విగ్రహం వద్ద ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఆదిలాబాద్ ఎంపీ బాపురావు, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, ఐటీడీఏ పీవో భవేశ్‌మిశ్రా, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గిరిజనులకు 24 జతల ఎడ్లు, బండ్లను అందజేశారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
- కుమ్రం భీం ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ/కెరమెరి
కుమ్రం భీం ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ/కెరమెరి : అడవితల్లి ముద్దుబిడ్డ, ఆదివాసుల ఆరాధ్య దైవం కుమ్రం భీంకు ఘనంగా నివాళులర్పించారు. కెరమెరి మండలం జోడెఘాట్‌లో శనివారం భీం, సూరు వర్ధంతి నిర్వహించగా, వివిధ ప్రాంతాల నుంచి గిరిజనులు వేలాదిగా తరలివచ్చారు. ఉదయాన్నే ఇక్కడికి చేరుకున్న ఆదివాసులు, కుమ్రం భీం సమాధి వద్ద సంప్రదాయ పూజలు చేశారు. భీం మనువడు సోనేరావు ఆదివాసీ పెద్దలు, నాయకులతో కలిసి దేవతలకు ప్రతీకలుగా భావించే మూడు జెండాలను ఆవిష్కరించారు. భీం సమాధి వద్ద పూజలు చేశారు. పేర్సాపేన్, అవ్వల్‌పేన్ దేవుళ్లకు మొక్కుకున్నారు. అనంతరం సూరు మనువడు పాండు ఆధ్వర్యంలో సూరుకు నివాళులర్పించారు. గ్రీవెన్స్, ఐసీడీఎస్ బేబీ కేర్ సెంటర్, సఖీ కేంద్రం ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికోసం ఉచితంగా బస్సులు నడిపించారు. వేర్వేరుగా భోజన సౌకర్యం కల్పించారు. ఏజెన్సీ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ మనోహర్, ఆసిఫాబాద్ డిప్యూ టీ డీఎంహెచ్‌వో సుధాకర్ నాయక్ ఆధ్వర్యంలో సిబ్బంది మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. సీసీడీపీ పథకం ద్వారా కొలాం ఆదివాసులకు 24 జతల ఎడ్లు, బండ్లను పంపిణీ చేశారు.
ప్రముఖుల నివాళి..
భీం వర్ధంతికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఐటీడీఏ పీవో భవేశ్ మిశ్రా తదితరులు హాజరయ్యారు. భీం సమాధి వద్ద సంప్రదాయ పూజలు చేశారు. భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గిరిజనుల అభ్యున్నతికి కృషి : జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి
గిరిజనుల అభ్యున్నతికి సర్కారు కృషి చేస్తున్నదని జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోవ లక్ష్మి పేర్కొన్నారు. వర్ధంతి సభలో ఆమె మాట్లాడుతూ.. జోడెఘాట్‌లో డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరగా పూర్తిచేస్తామని తెలిపారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. జోడెఘాట్‌కు రెండు వరుసల రహదారి నిర్మించారని, మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగు నీరు అందిస్తున్నారని తెలిపారు.
డబుల్ బెడ్ రూం ఇండ్లకు భూమిపూజ..
జోడెఘాట్ గ్రామస్తులకు మంజూరైన 34 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి అధికారులు, ప్రజాప్రతినిధులు భూమిపూజ చేశారు. డీటీడీవో దిలీప్‌కుమార్, ఇన్చార్జి ఎస్పీ సత్యనారాయణ, ఉత్సవ కమిటీ నాయకులు పాల్గొన్నారు.
భారీ బందోబస్తు..
భీమ్ వర్ధంతి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏఎస్పీ సుధీంద్ర ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.