బుధవారం 02 డిసెంబర్ 2020
Komarambheem - Oct 31, 2020 , 00:27:04

గిరిగూడేల్లో వెలుగు దివ్వె

గిరిగూడేల్లో వెలుగు దివ్వె

  • నేడు జోడెఘాట్‌లో కుమ్రం భీం 80వ వర్ధంతి
  • అన్ని ఏర్పాట్లూ చేసిన అధికారులు
  • సప్త రంగుల్లో వెలిగిపోతున్న విగ్రహం
  • హట్టి నుంచి ఉచితంగా బస్సులు
  • తరలిరానున్న అడవిబిడ్డలు
  • కొవిడ్‌-19 నేపథ్యంలో దర్బార్‌ రద్దు 
  • పోలీసుల భారీ బందోబస్తు
  • స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో పోరుగడ్డ

ఆదివాసుల ఆరాధ్య దైవం కుమ్రం భీం 80వ వర్ధంతికి జోడెఘాట్‌ ముస్తాబైంది. స్వరాష్ట్రంలో పర్యాటకంగా ప్రగతి సాధించిన ఈ గడ్డపై నేడు  ఘనంగా నిర్వహించేందుకు యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. గిరిజనులు  పెద్ద సంఖ్యలో తరలిరానుండగా, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసింది. మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి,  సత్యవతి రాథోడ్‌, ఎంపీలు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, కలెక్టర్లు, ఐటీడీఏ పీవోతో పాటు తదితర నేతలు హాజరయ్యే అవకాశమున్నది. ఆసిఫాబాద్‌ డీఎస్పీ అచ్చేశ్వర్‌రావు ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ/ కెరమెరి: కుమ్రం భీం 80వ వర్ధంతిని శనివారం నిర్వహించనున్నారు. కెరమెరి మండలంలోని సంకెపల్లి గ్రా మంలో కుమ్రం భీం జన్మించాడు. పెరిగింది సుర్తాపూర్‌ గ్రామం. 1935వ సంవత్సరంలో ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంగా ఉండేది. అడవిని నమ్ముకొ ని జీవిస్తున్న గిరిజనులపై అటవీ శాఖ అధికారుల దౌర్జన్యం మితిమీరిపోయింది. గిరిజనులు, గిరిజనేతరుల భూములను భూస్వాములు స్వాధీనం చేసుకున్నారు. వారు సేకరించే అటవీ ఉత్పత్తులను కూడా దోచుకున్నారు. అడవిని నరికి కష్టపడి పోడు వ్యవసాయం చేసే గిరిజనులు పంటను కొట్టిన కల్లంలోనే కౌలు కింద గింజలు ప్రభుత్వానికి అప్పజెప్పాల్సి ఉండేది.గిరిజనుల పోడు భూ ములకు పట్టాదారులుగా భూస్వాములు, పెత్తందార్లు ఉండేవారు. తిరగబడ్డ గిరిజనులపై కేసులు పెట్టేవాళ్లు.. ఇలాంటి సంఘటనలే భీంను కదిలించాయి. పంట వసూలు కోసం తమ చేనులోకి వ చ్చిన సిద్ధిఖీ అనే వ్యకిని భీం కర్రతో తలపై కొట్ట గా, అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం భీం మహారాష్ట్రలోని బల్లార్షా, చాందా పారిపోయాడు. అక్కడ తేయాకు తోటల్లో కూలీపని చేసుకుంటూ చదవడం, రాయడంతో పాటు మరాఠీ, ఉర్దూ భా షలు నేర్చుకున్నాడు.

పంటలు పండించడం, మార్కెట్‌లో మంచి ధరలకు అమ్మడం తెలుసుకున్నాడు. తర్వాత భీం తల్లిదండ్రులు ఉంటున్న కాకన్‌ఘాట్‌ గ్రామానికి వచ్చాడు. అక్కడ లచ్చుపటేల్‌ అనే గిరిజనుడి దగ్గర పనిచేశాడు. తర్వాత భీంకు సోంబాయితో పెళ్లి జరిగింది. ఆ కాలంలో అరకకు రూ. 5, పోడుకు రూ.2 చొప్పున పన్నును ఆసిఫాబాద్‌ తహసీల్దార్‌కు కట్టేది. భీం అప్పటి తహసీల్దార్‌తో మాట్లాడి లచ్చుపటేల్‌కు చెందిన 12 ఎకరాల భూమి కేసును కొట్టి వేయించాడు. అప్పటినుంచి ఆ ప్రాంత గిరిజనులందరికీ భీం నాయకుడయ్యాడు. 60 ఎకరాల అటవీ భూమిని నరికి 12 గ్రామాలను ఏర్పరిచాడు. ఆ గ్రామాలు జోడెన్‌ఘాట్‌, పట్నాపూర్‌, బాబెఝరి, నర్సాపూర్‌, కల్లెగాం, చాల్‌బడి, బోయికన్‌ మోవాడ్‌, బోమన్‌గొంధి, భీమన్‌గొంధి, దేవునిగూడ, గొగిన్‌మోవా డ్‌.. ఇక్కడి గిరిజనులు సాగుచేస్తున్న భూములపై వారికే హక్కులు కల్పించాలని సర్కారుతో పోరు ప్రారంభించాడు భీం. సుమారు 300 మంది గిరిజనులు ఉండేవారు.

భూముల హక్కుల కోసం..

భీం పోరాటం ఉధృతమైంది. పోలీసులు జోడెఘాట్‌కు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. 1940 సెప్టెంబర్‌ 1న గిరి గ్రామాలను పో లీసులు చుట్టుముట్టారు. మొదట భూములకు పట్టాలు ఇస్తామని నమ్మించిన పోలీసులు గిరిజనులను బయటకు పిలిచి భీంతో పాటు మరో 11 మందిని కాల్చిచంపారు. అయితే భీం పోరాటం నిజాం ప్రభువును కదిలించింది. గిరిజనుల సమస్యలు, కావాల్సిన సదుపాయాలు, వారి జీవన విధానంపై పరిశోధన చేసి నివేదిక సమర్పించాలని కోరుతూ ఇంగ్లాండ్‌కు చెందిన సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హైమన్‌డార్ఫ్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయన గిరిజనులతో కలిసిపోయి వారి జీవన విధానాలను అధ్యయనం చేసి వారి అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన పథకాలను సూచిస్తూ నివేదిక తయారు చేసి నిజాం సర్కారుకు నివేదించారు. ప్రస్తుతం జిల్లాలోని గిరి గ్రా మాల్లో జరుగుతున్న అభివృద్ధి భీం త్యాగఫలిత మే. కుమ్రం భీం వారసులు సిర్పూర్‌(యూ) మండలం పెద్దదోబ అనే గ్రామంలో ప్రస్తుతం ని వాసముంటున్నారు. మనువడు కుమ్రం సోనేరావ్‌ ప్రభుత్వం నిర్వహించే వర్ధంతిలో పాల్గొంటున్నారు. జోడెఘాట్‌లో మునిమనువరాలు భీంబాయి నివసిస్తున్నారు.

అభివృద్ధికి బాటలు వేసిన హైమన్‌డార్ఫ్‌..

ఆదివాసుల అభివృద్ధికి హైమన్‌డార్ఫ్‌ దంపతులు బాటలు వేశారు. అతడి సతీమణి బెట్టి ఎలిజబెత్‌తో కలిసి జైనూర్‌ మండలం మార్లవాయిలోని పూరిగుడిసెలో  నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆదివాసుల భాష, వారి ఆచారాలను నేర్చుకొని గిరిజనులతో కలిసిపోయారు. వారి జీవన స్థితిగతులను పూర్తిగా అధ్యయనం చేసి వారి అభివృద్ధికి అనేక మార్గాలను ప్రభుత్వానికి నివేదించారు. ఆ దివాసీలకు పలక, బలపం ఇచ్చి అక్షరాలు నేర్పించారు. అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టా రు. ఆదివాసీల ఆప్యాయత వీరిని ఆకట్టుకుంది. కొంతకాలానికి బెట్టి ఎలిజబెత్‌ మరణించగా ఆమె సమాధిని మార్లవాయిలోనే కట్టించారు. తర్వాత హైమన్‌డార్ఫ్‌ కూడా కన్నుమూయడంతో ఎలిజబెత్‌ సమాధి పక్కనే ఇతని సమాధిని నిర్మించారు. హైమన్‌డార్ఫ్‌ చివరి కోరికగా అతని మనువడు లచ్చుపటేల్‌  2012 ఫిబ్రవరిలో హైమన్‌డార్ఫ్‌ అస్థికలను మార్లవాయిలోనే సమాధి చేశారు. ఈ ఆది దంపతులు చేసిన సేవలు, త్యాగాలు జిల్లా ఆ దివాసులకు శాశ్వత జ్ఞాపకాలను మిగిల్చాయి.

పోరుగడ్డ నేడు అభివృద్ధి బాటలోకి..

కుమ్రం భీం పోరు సల్పిన జోడెఘాట్‌ స్వరాష్ట్రం లో అభివృద్ధి పథంలోకి వెళ్తున్నది. సమైక్య పాలనలో అభివృద్ధి ఎరుగని ఈ గ్రామం, ఆరేండ్లుగా ప్రగతి బాట పడుతున్నది. ప్రభుత్వం ఇప్పటికే రూ.50 కోట్లకు పైగా నిధులు వెచ్చించి పనులు చేయించింది. గత పాలకుల శీతకన్నుతో ఎన్నో ఏండ్లు చీకట్లో మగ్గిన పోరు గడ్డ కొత్త రూపు సంతరించుకుంటున్నది. రూ. 25 కోట్లతో గిరిజన మ్యూజియం, స్మారక చిహ్నం, స్మృతి వనం, 8 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రూ.15.70 కోట్లతో హట్టి నుంచి జోడెఘాట్‌ వరకు రెండు వరుసల రహదారి నిర్మించింది. 11 ఆదివాసీ గ్రామాల బిడ్డల కోసం రూ.2.95 కో ట్లతో చేపట్టిన ఆశ్రమ పాఠశాల నిర్మాణం తుది దశకు చేరుకున్నది. సీసీ రోడ్ల నిర్మాణాలతోపాటు, పరిసరాల్లోని 11 గ్రామాలకు ఇంటింటికీ స్వచ్ఛమైన మిషన్‌ భగీరథ నీటిని అందిస్తున్నది. జోడెఘాట్‌ గ్రామానికి త్రీఫేజ్‌ విద్యుత్‌ వసతి కల్పించా రు. గిరిజన రైతులకు ఎడ్ల జతలు, బండ్లను ఐ టీడీఏ ద్వారా పంపిణీ చేశారు. దాదాపు 30 మం ది రైతులకు ఎడ్ల జతలను అందించారు. విద్య, వై ద్య సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు.

ముస్తాబైన జోడెఘాట్‌

కుమ్రం భీం 80వ వర్ధంతికి జోడెఘాట్‌ ముస్తాబైంది. మ్యూజియం వద్ద సందర్శకులను ఆకట్టుకునేలా సౌండ్‌ అండ్‌ లైటింగ్‌ ఏర్పాటు చేశారు. కొవిడ్‌-19 కారణంగా దర్బార్‌ రద్దు చేయగా, పోరాట యోధుడికి నివాళులర్పించేందుకు వచ్చే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆసిఫాబాద్‌ డీఎస్పీ అచ్చేశ్వర్‌రావ్‌ ఆధ్వర్యంలో 300మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. ప్రజలు, అతిథులకు వేర్వేరుగా భోజనం, తాగునీటి సౌకర్యంతో పాటు వాహనాల పార్కింగ్‌ కో సం స్థలాలను సిద్ధం చేశారు. హట్టి నుంచి జోడెఘాట్‌ వరకు ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉచితంగా బస్సులను నడిపించనున్నారు. కుమ్రం భీం స్మారక ప్రాంగణం విద్యుద్దీపాలతో అలంకరించారు. సప్త రంగుల్లో విప్లవ వీరుడు కుమ్రం భీం విగ్రహం జిగేల్‌మంటున్నది. 

హాజరు కానున్న నేతలు, అధికారులు..

వేడుకలకు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, ఐటీడీఏ పీవో భవేశ్‌ మిశ్రా ఆధ్వర్యంలో అతిథులను ఆ హ్వానిస్తున్నారు. సభ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఉండగా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి స త్యవతి రాథోడ్‌, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, ఎంపీలు సోయం బాపురావ్‌, బోర్లకుంట వెంకటేశ్‌, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ కుమార్‌, ఎ మ్మెల్యేలు కోనేరు కోనప్ప, బాల్క సుమన్‌, దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్‌రావు, రేఖా నాయక్‌, జోగు రామన్న, రాథోడ్‌ బాపురావు, విఠల్‌ రెడ్డి, ఆదిలాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ రాథోడ్‌ జనార్దన్‌, ప్రత్యేక అతిథులుగా ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, ప్రత్యేక ఆహ్వానితులుగా కుమ్రం సోనేరావ్‌తో పాటు ఉత్సవ కమిటీ చైర్మన్‌, సభ్యులు ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులతో పాటు స్థానిక ఎంపీపీ పేందోర్‌ మోతీరాం, జడ్పీటీసీ సెడ్మకి దుర్పతాబాయి, తదితరులు హాజరు కానున్నారు.

సంప్రదాయబద్ధంగా అవ్వల్‌ పేన్‌ పూజ

కెరమెరి : మండలంలోని జోడెఘాట్‌లో ఆదివాసీలు శుక్రవారం రాత్రి అవ్వల్‌ పేన్‌ పూజలు చే శారు. గ్రామానికి రక్షణగా నిలిచే పోచమ్మతల్లిని దర్శించుకునేందుకు, సంప్రదాయ వాయిద్యా ల నడుమ భీం వారసులు ఊరేగింపుగా వచ్చా రు.  స్మృతి చిహ్నం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం నేరుగా అవ్వల్‌ పేన్‌ వద్దకు చేరుకున్నారు. భీం మనుమడు సోనేరావ్‌ ఆధ్వర్యం లో ఆదివాసీలు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి గొర్రె, కోళ్లను బలిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అక్కడే వంటలు వండి సహపంక్తి భోజనాలు చేశారు.