ఆదివారం 29 నవంబర్ 2020
Komarambheem - Oct 23, 2020 , 00:53:12

గిరులపై సిరులు

గిరులపై సిరులు

  • గుట్టలు, ఏటవాలు భూముల్లో ఆదివాసుల ఎవుసం
  • లక్ష ఎకరాల్లో పత్తి, జొన్న, కంది, పప్పు దినుసులు.. 
  • పత్తితోపాటు సంప్రదాయ ఆహార పంటల సాగు  
  • నీటి వసతి లేనిచోట సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం
  • తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి.. 
  • మెండుగా పోషక విలువలు..
  •  గిరిజనుల్లో రక్తపోటు, షుగర్‌ వ్యాధి తక్కువ

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ/కెరమెరి : కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో కొండలు, గుట్టలు, ఏటవాలు భూములపై గిరిజనులు సంప్రదాయ పద్ధతిలో పం టలు సాగు చేస్తుంటారు. సాధారణంగా అడవుల్లో జీవించే ఆదివాసులు అక్కడే గ్రామాలు ఏర్పాటు చేసుకొంటారు. తమ పరిధిలోని వ్యవసాయక్షేత్రాల్లో వివిధ పంటలు నీటి వనరులు లేకున్నా పండిస్తారు. వందల మీటర్ల ఎత్తులో ఉండే కొండలపై సాగునీటి వసతి కల్పించడం కష్టమే. అయినప్పటికీ కేవలం వర్షాధారంపై మాత్రమే సాగు చేస్తుంటారు. అరకొర నీటి వసతి ఉన్నప్పటికీ గిరిజనులు సమర్థవంతంగా వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. అడవుల్లో ఉండే వృక్షాలు, ఇతర మొక్కల కారణంగా భూమిలో తేమ అధికంగా ఉంటుంది. దీంతో పంటలకు అవసరమైన తేమ పుష్కలంగా లభిస్తున్నది. కెరమెరి, లింగాపూర్‌, తిర్యాణి, జైనూర్‌ వంటి మండలాల్లో వేల ఎకరాల్లో సాగవుతున్నాయి. ప్రధానంగా పత్తి, జొన్న, కంది, ఇతర పప్పు దినుసులు పండిస్తారు. దాదాపు పత్తి 80 వేల ఎకరాలు, జొన్న 3 వేలు, కంది 12 వేలు, ఇతర పప్పు దినుసులు 5 వేల ఎకరాల్లో గిరిజనులు సంప్రదాయపద్ధతుల్లో సాగు చేస్తుంటారు. 

తక్కువ పెట్టుబడి.. అధిక దిగుబడి.. 

వ్యవసాయరంగంలో ఆధునిక పద్ధతులు సంతరించుకుంటున్న క్రమంలో పెట్టుబడి కూడా పెరుగుతున్నది. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల ధరలు విపరీతంగా పెరిగాయి. దిగుబడులు అధికంగా రావాలనే తపనతో మైదాన ప్రాంతాల్లోని రైతులు అధిక మోతాదులో ఎరువులు, పురుగుల మందులను వినియోగిస్తున్నారు. ఫలితంగా  పెట్టుబడి భారం పెరుగుతున్నది. కానీ.. అటవీ ప్రాంతాల్లో గుట్టలపై సాగు చేసుకొనే గిరిజనులపై పెట్టుబడి భారం చాలా తక్కువనే చెప్పాలి. పత్తి విత్తనాలు తప్ప మిగతా కంది, జొన్న వంటి ఆహార పంటల విత్తనాలను సంప్రదాయంగా వస్తున్న వాటినే వినియోగిస్తున్నారు.

దీంతో ఆహార పంటలైన కంది, జొన్న, ఇతర పప్పు దినుసుల పంటలు నీటి ఎద్దడిని తట్టుకోవడమే కాకుండా తెగుళ్ల బెడద కూడా చాలా తక్కువగా ఉంటుందని రైతులు అంటున్నారు. ఎరువుగా పశువుల పేడ వినియోగిస్తున్నారు. రసాయనిక ఎరువులు పత్తి పంటలకు చాలా తక్కువగా పిచికారీ చేస్తారు. ఆహార పంటలపై రసాయనాలు వినియోగించరు. మైదాన ప్రాంతాల్లో సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.12 నుంచి రూ.15 వేల పెట్టుబడి అవుతుంటే.. కొండ ప్రాంతాల్లో సంప్రదాయ విధానంలో సాగు చేసే గిరిజనులకు ఎకరానికి రూ.5 నుంచి రూ.6వేలలోపు మాత్రమే పెట్టుబడి అవుతున్నది. 

మెండుగా పోషక విలువలు

గిరిజనులు సంప్రదాయబద్ధంగా, వినూత్నంగా సాగు చేస్తుంటారు. వీరు పండించే ఆహార పంటల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. సహజ పద్ధతిలో పండించే జొన్న, మక్క, కంది, ఇతర పప్పు దినుసుల్లో కార్బోహైడ్రెట్స్‌, కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు, ఖనిజ లవణాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఎరువులు, రసాయనిక ఎరువులతో పండించిన పంటలతో పోలిస్తే 20 నుంచి 30 శాతం అధికంగా ఉంటాయి. దీంతో గిరిజనుల్లో రక్తపోటు, చక్కెర వ్యాధి వంటివి చాలా తక్కువగా వస్తుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.