శుక్రవారం 04 డిసెంబర్ 2020
Komarambheem - Oct 21, 2020 , 09:14:29

పోలీస్‌ అమరుల త్యాగాలు వెలకట్టలేనివి

పోలీస్‌ అమరుల త్యాగాలు వెలకట్టలేనివి

  • మెరుగైన సమాజమే లక్ష్యంగా పనిచేయాలి
  • మెగా రక్తదాన శిబిరం ప్రారంభంలో రామగుండం సీపీ వీ సత్యనారాయణ

గర్మిళ్ల : విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని రామగుండం సీపీ వీ సత్యనారాయణ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల పట్టణంలోని ఎఫ్‌సీఏ ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం డీసీపీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఇచ్చేందుకు పోలీసులు అన్ని వేళలా సిద్ధంగా ఉండాలని సూచించారు. తలసేమియా, కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయని ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యులు డీసీపీని కోరారన్నారు. ఇందులో భాగంగానే శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పేదలు, బాధితులకు సత్వర న్యాయం అందించడంతో పాటు మెరుగైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేసినప్పుడే అమరుల త్యాగానికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి, మంచిర్యాల ఇన్‌చార్జి ఏసీపీ నరేందర్‌, పట్టణ సీఐ ముత్తి లింగయ్య, ట్రాఫిక్‌ సీఐ ప్రవీణ్‌ కుమార్‌, ఎస్‌ఐలు మారుతి, ప్రవీణ్‌కుమార్‌, రాజమౌళీగౌడ్‌, ట్రాఫిక్‌ ఎస్‌ఐలు వినోద్‌, శివకేశవులు, సురేందర్‌, పోలీసు పిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల బైక్‌ ర్యాలీ..

అంతకుముందు ట్రాఫిక్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. డీసీపీ ఉదయ్‌కుమార్‌ ప్రారంభించారు. ఐబీ చౌరస్తా నుంచి బెల్లంపల్లి చౌరస్తా మీదుగా రైల్వేస్టేషన్‌ ఎదుట నుంచి ఎఫ్‌సీఏ ఫంక్షన్‌ హాల్‌కు చేరుకుంది.  

మానవతా దృక్పథంతో విధులు నిర్వర్తించాలి..

నూతనంగా నియామకమైన 26 మంది మహిళా కానిస్టేబుళ్లతో డీసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సత్యనారాయణ మాట్లాడారు. కష్టపడి ఉద్యోగం సాధించి, శిక్షణ పూర్తిచేసుకున్న కానిస్టేబుళ్లు నూతనోత్సాహంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ సమావేశంలో మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ సీహెచ్‌ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 

శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర..

ఆసిఫాబాద్‌ : నూతనంగా నియామకమైన 115 మంది సివిల్‌, ఏఆర్‌ కానిస్టేబుళ్లు జిల్లాకు వచ్చిన సందర్భంగా స్థానిక ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కుమ్రం భీం ఇన్‌చార్జి ఎస్పీ, రామగుండం సీపీ సత్యనారాయణ మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమన్నారు. ప్రకృతి రమణీయ, ఆహ్లాదకర వాతావరణం గల ఆసిఫాబాద్‌ జిల్లాలో ఉద్యోగం నిమిత్తం రావడం సంతోషంగా భావించాలని సూచించారు. కష్టపడి ఉద్యోగం సాధించి, శిక్షణ పూర్తిచేసుకొని వచ్చారని, మంచి సేవలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ అడ్మిన్‌ వైవీఎస్‌ సుధీంద్ర, ఏఆర్‌ అదనపు ఎస్పీ సురేశ్‌కుమార్‌, డీఎస్పీ అచ్చేశ్వర్‌ రావు, సీఐ అశోక్‌ కుమార్‌, ఆర్‌ఐలు శేఖర్‌బాబు, ఎం శ్రీనివాస్‌, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

తాజావార్తలు