బుధవారం 28 అక్టోబర్ 2020
Komarambheem - Oct 18, 2020 , 02:43:29

కొండచరియలు విరిగిపడి జవాన్‌ మృత్యువాత

కొండచరియలు విరిగిపడి జవాన్‌ మృత్యువాత

లద్దాఖ్‌లో బేస్‌క్యాంప్‌నకు తిరిగి వస్తుండగా ప్రమాదం

ఆరుగురి దుర్మరణం..  అందులో కాగజ్‌నగర్‌ వాసి..

2001లో ఆర్మీలో చేరిన షాకీర్‌ హుస్సేన్‌

వచ్చే ఏడాదే ఉద్యోగ విరమణ 

కాగజ్‌నగర్‌టౌన్‌ : దేశ సరిహద్దు ప్రాంతమైన లద్దాఖ్‌లో విధులు నిర్వహిస్తున్న కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లోని అహ్మద్‌ రజా కాలనీ (రిక్షా కాలనీ) కి చెందిన  ఆర్మీ జవాన్‌ షాకీర్‌ హుస్సేన్‌ (39) మృతిచెందాడు. కేంద్ర పాలిత ప్రాం తమైన లద్దాఖ్‌ సరిహద్దులో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.ఆరుగురు సభ్యు ల  బృందం విధులు ముగించుకొని బేస్‌క్యాంప్‌కు తిరిగి వస్తుండగా ప్రమాదవశా త్తు కొండ చరియలు (మంచు) విరిగి పడడంతో అందులో చిక్కుకొని ఆరుగురు జవాన్లు మృత్యువాత పడ్డారు. అందులో  కాగజ్‌నగర్‌కు చెందిన షాకీర్‌ హుస్సేన్‌  మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు ఫోన్‌ ద్వారా మధ్యాహ్న 12 గంటలకు  సమాచారం అందించారు. దీంతో స్థానికులు జవాన్‌ ఇంటి వద్దకు చేరుకున్నారు. కాగజ్‌నగర్‌కు చెందిన షేక్‌ హుస్సేన్‌, జమ్షిత్‌ సుల్తానా దంపతులకు  పెద్ద కుమారుడు షాకీర్‌ హు స్సేన్‌. తండ్రి పండ్ల వ్యాపారి, తల్లి గృహిణి. షాకీర్‌ హుస్సేన్‌ స్థానిక బాల విద్యామందిర్‌ పాఠశాలలో ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదివాడు.  ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌  ప్రథమ సంవత్సరం చదువుతుండగా 2001లో ఆర్మీలో ఉద్యో గం సాధించాడు. ఉద్యోగంలో చేరిన 15 ఏళ్లకే  ఉద్యోగ విరమణ పొందినప్పటికీ, మరో ఐదేళ్లు దేశ సేవ చేయాలనే ఉద్దేశంతో గడువు పొడిగించుకున్నాడు. 2021 ఫిబ్రవరిలో రిటైర్డ్‌ కావాల్సి ఉంది. అతనికి  2007లో నిఖత్‌ సుల్తానాతో వివాహమైంది. వీరికి నుజ్హత్‌ సుల్తానా (9), నమీ రా సుల్తానా (7), షామీర్‌ హుస్సేన్‌ (6) ఉన్నారు.  రెండు నెలల క్రితమే ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో గడిపాడు. ఆరు నెలల తర్వాత  ఉద్యోగ విరమణ పొంది, ఇక కుటుంబ సభ్యులతోనే ఉంటానంటూ చెప్పి వెళ్లిన ఆయన మృత్యువాత పడడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. రెండు రోజుల క్రితమే తమతో ఫోన్‌లో మాట్లాడాడంటూ కుటుంబ సభ్యు ల రోదనలు మిన్నంటాయి. బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున వారి ఇంటికి చేరుకున్నారు. జరిగిన ఘటనపై ఉన్నతాధికారుల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు.

సైనికుడిని కోల్పోవడం బాధాకరం 

దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశ భద్రతే ధ్యేయంగా పనిచేస్తున్న సైనికుడిని కోల్పోవడం బాధాకరమని సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. కాగజ్‌నగర్‌కు చెందిన జవాన్‌ షాకీర్‌ హుస్సేన్‌ లద్దాఖ్‌లో మృతి చెందడంతో బాధిత కుటుంబంతో శనివారం క్యాంపు కార్యాలయంలో  ఆయన మాట్లాడారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జవాన్‌ భౌతిక కాయాన్ని కాగజ్‌నగర్‌కు తరలించేందుకు ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎమ్మెల్యే వెంట  కాలనీవాసులు ఉన్నారు. 


logo