సోమవారం 30 నవంబర్ 2020
Komarambheem - Oct 11, 2020 , 06:09:01

కొత్త జిల్లాతో సాగునీటి సమస్యలు పరిష్కారం

కొత్త జిల్లాతో సాగునీటి సమస్యలు పరిష్కారం

  • మిషన్‌ కాకతీయతో 353 చెరువులకు మరమ్మతులు
  • అదనంగా 35 వేల ఎకరాలకు సాగునీరు
  • కొత్తగా 18 చెక్‌డ్యాంలు మంజూరు
  • ‘నమస్తే’ ప్రత్యేక ఇంటర్వ్యూలో జిల్లా నీటి పారుదల శాఖ అధికారి గుణవంత్‌రావ్‌

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ఏర్పడిన ఈ నాలుగేళ్లలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో గణనీయమైన మార్పు కనిపిస్తున్నదని, ముఖ్యంగా సాగు నీటి రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని జిల్లా నీటి పారుదల శాఖ అధికారి గుణవంత్‌రావ్‌ పేర్కొన్నారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కొత్తగా 18 చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం కోట్లాది రూపాయ లు మంజూరు చేసిందని, మిషన్‌ కాకతీయ పథకం ద్వారా 353 చెరువులకు మరమ్మతులు చేయడంతో అదనంగా 35 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నదని తెలిపారు. మరోవైపు అధికార యంత్రాంగం ప్రజలకు చేరువకావడంతో సమస్యలు త్వరగా పరిష్కారమవుతున్నాయని తెలిపారు.

నమస్తే : ఈ నాలుగేళ్లలో సాగునీటి రంగంలో మార్పు కనిపించిందా?

అధికారి : జిల్లా ఏర్పడిన తర్వాత చిన్ననీటి పారుదల రంగంలో చాలా మార్పులు వచ్చాయి. గతంతో పోలిస్తే సాగునీటి వనరులు చాలా వరకు మెరుగుపడ్డాయి. ముఖ్యంగా మిషన్‌ కాకతీయ ద్వారా మంచిఫలితం కనిపిస్తోంది. గతంలో ఉమ్మడి జిల్లా పరంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లేవి. దీంతో ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాలపై దృష్టిసారించే వారు కాదు. ఇప్పుడు ఆసిఫాబాద్‌ జిల్లా ప్రత్యేకంగా ఏర్పడడం వల్ల మన జిల్లా నుంచి వెళ్లే ప్రతిపాదనలు ప్రత్యేకంగా చూస్తున్నారు. దీంతో కొత్త పనుల మంజూరు, బిల్లుల చెల్లింపులు త్వరగా అవుతున్నాయి. దీంతో సాగునీటికి సంబంధించిన పనులు త్వరగా పూర్తి అవుతున్నాయి. ప్రతి పనినీ ఫీల్డులోకి వెళ్లి పరిశీలించే వీలు కలిగింది.

నమస్తే : మిషన్‌ కాకతీయ ద్వారా ఎన్ని చెరువులకు మరమ్మతులు చేశారు?

అధికారి : జిల్లా ఏర్పడిన తర్వాత చిన్ననీటి పారుదల రంగంలో చాలా మార్పులు వచ్చాయి. చెరువుల నిర్మాణం, మరమ్మతులు వేగంగా సాగుతున్నాయి. జిల్లాలో ముఖ్యంగా మిషన్‌ కాకతీయ ద్వారా ఇప్పటి నాలుగు విడుతల్లో 411 చెరువుల మరమ్మతులకు ప్రభుత్వం రూ. 129 కోట్లు అంచనాలతో నిధులు కేటాయింది. ఇందులో రూ. 77.10 కోట్లు ఖర్చుచేసి 353 చెరువులకు మరమ్మతులు చేశాం. వీటి ద్వారా అదనంగా 35 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది.

నమస్తే : కొత్త చెరువులు ఏమైనా మంజూరయ్యాయా?

అధికారి : జిల్లాకు కొత్తగా 7 చెరువులను ప్రభుత్వం మంజూరు చేసింది. రూ. 1006.25 లక్షలతో చెరువుల నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటి ద్వారా 10,122 ఎకరాలకు సాగునీటి అందనున్నది. ప్రస్తుతం భూసేకరణ కోసం రూ. 43.78 కోట్లకు పరిపాలన ఆమోదం లభించింది. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. కొత్త చెరువుల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసి సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటాం.

నమస్తే : చెరువుల మరమ్మతులకు ఇతర నిధులేమైనా వచ్చాయా ?

అధికారి : జిల్లాలో మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణకు మినరల్‌ ఫండ్‌ నుంచి కూడా నిధులు వచ్చాయి. చింతలమానేపల్లి మండలం బాబాసాగర్‌ చెరువు, కాగజ్‌నగర్‌ మండలం ఈస్‌గాం చెరువుల మరమ్మతుల కోసం రూ. 45 లక్షలు ప్రభుత్వం కేటాయించింది. వీటి ద్వారా 875 ఎకరాలకు సాగునీరు అందనున్నది. త్వరలో పనులు పూర్తిచేస్తాం.

నమస్తే : జిల్లాకు కొత్తగా చెడ్‌డ్యాంలు ఎన్ని వచ్చాయి?

అధికారి : జిల్లాకు కొత్తగా 18 చెక్‌డ్యాంలు అవసరమని గుర్తించాం. వీటిలో 8 చెక్‌ డ్యాంలు ఉన్నాయి. వీటి ద్వారా 911 ఎకరాలకు సాగునీరు అందుతుంది. వీటి కోసం రూ. 18.57 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. వీటిలో 5 చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ. 11.22 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిం ది. అదేవిధంగా ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో 10 చెక్‌డ్యాంల కోసం రూ. 35 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. వీటి ద్వారా 531 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపిం చాం. వీటిలో 6 చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ. 22.19 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం వీటికి సంబంధించి గ్రౌండ్‌ వర్క్‌ నడుస్తోంది.