మంగళవారం 19 జనవరి 2021
Komarambheem - Sep 18, 2020 , 01:25:02

ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనాలు విడుదల

       ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనాలు విడుదల

  •  మూడు నెలలకు సంబంధించి త్వరలో  ఖాతాల్లో జమ చేయనున్న అధికారులు 

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ/హాజీపూర్‌/ నిర్మల్‌టౌన్‌ : నిరంతరం ప్రజా సేవలో ఉండే ప్రజా పతినిధులకు సముచిత స్థానం కల్పించేందుకు వారికి ప్రతి నెలా గౌరవ వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నది. ఈ మేరకు జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలకు సంబంధించిన గౌరవ వేతనాలను గురువారం విడుదల చేసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు రూ.80.55 లక్షలను త్వరలో వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నటు జడ్పీ సీఈవో వేణు వెల్లడించా రు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌కు గౌరవ వేతనంగా నెలకు లక్ష రూపాయలు, జడ్పీటీసీలకు రూ.10 వేలు, ఎంపీపీలకు రూ. 10 వేలు,  సర్పంచులకు నెలకు రూ.5 వేలు, ఎంపీటీసీలకు రూ.5 వేలను  గౌరవ వేతనంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 123 మంది ఎంపీటీసీలకు మూడు నెలల వేతనాలు రూ. 18.45 లక్షలు, 334 మంది సర్పంచ్‌లకు రూ.50.10 లక్షలు, 15 మంది ఎంపీపీలకు రూ.4.50 లక్షలు. 15 మంది జడ్పీటీసీలకు రూ. 4.50 లక్షలు, జడ్పీ చైర్మన్‌కు రూ.3 లక్షలు వారి ఖాతాల్లో త్వరలో జమకానున్నాయని జడ్పీ సీఈవో తెలిపారు. 

మంచిర్యాల జిల్లాలోని మండల పరిషత్‌ అధ్యక్షులు, ఎంపీటీసీలు, కో-ఆప్షన్‌ సభ్యుల మూడు నెలల వేతనాలకు గాను రూ.24.15 లక్షలు, జడ్పీటీసీలు, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుల, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ వేతనాలు రూ.8.10 లక్షలు విడుదల చేసినట్లు జడ్పీ సీఈవో నరేందర్‌ తెలిపారు. త్వరలో వారి ఖాతా ల్లో జమ చేస్తామని తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఎంపీపీలు, ఎంపీటీసీలు, కో-ఆప్షన్‌ సభ్యుల మూడు నెలల వేతనాలు రూ.28.50 లక్షలు, జడ్పీటీసీలు, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుల, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ వేతనాల కోసం రూ.8.40 లక్షలు విడుదల చేసినట్లు జడ్పీ సీఈవో తెలిపారు. నిర్మల్‌ జిల్లాలో జడ్పీ చైర్‌పర్సన్‌కు మూడు నెలల వేతనం రూ. 3 లక్షలు, 396 మంది సర్పంచ్‌లకు రూ. 59.40 లక్షలు, 19 మంది జడ్పీటీసీలు, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యులకు రూ.5.70లక్షలు, 18 మంది ఎంపీపీలకు రూ. 5.40 లక్షలు, 156 మంది ఎంపీటీసీలు, కో-ఆప్షన్‌ సభ్యులకు రూ. 23.40 లక్షల వేతనాలు విడుదలైనట్లు జడ్పీ సీఈవో సుధీర్‌ వెల్లడించారు. త్వరలో వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.