మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Komarambheem - Aug 09, 2020 , 01:30:58

ఆదివాసుల సంక్షేమమే ధ్యేయంగా సర్కారు అనేక పథకాలు

ఆదివాసుల సంక్షేమమే ధ్యేయంగా సర్కారు అనేక పథకాలు

సమైక్య పాలనలో చీకట్లో మగ్గిన గిరిగూడేలు.. నేడు స్వరాష్ట్రంలో ప్రగతి బాట పడుతున్నాయి. ఆదివాసుల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ సర్కారు ఐటీడీఏ ద్వారా అనేక పథకాలు అమలు చేస్తున్నది. పల్లె పల్లెనా విద్య, వైద్యం, రవాణా సౌకర్యంతో పాటు మౌలిక వసతులు కల్పిస్తున్నది. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మి, పోడు రైతులకు సైతం రైతుబంధు, రైతు బీమావంటి వాటితో భరోసానిస్తున్నది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికి బాటలు వేస్తున్నది. ఇక పోరుగడ్డ జోడెఘాట్‌లో రూ. 25 కోట్లతో భీం స్మృతివనం, స్మారక చిహ్నం నిర్మించి వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. అడవిబిడ్డల సంస్కృతీ సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తూనే.. వారి ఆరాధ్య దైవాలైన నాగోబా, జంగుబాయి ఉత్సవాలను అధికారికంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నది. ఇక 500 జనాభా ఉన్న గూడేలు, తండాలను పంచాయతీలుగా మార్చి, ‘మా ఊళ్లో.. మా రాజ్యం’ కలను సాకారం చేసింది. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా, వారి జీవితాల్లో వచ్చిన మార్పులపై ప్రత్యేక కథనం.   - ఉట్నూర్‌/కెరమెరి

ఆదివాసులు అనగానే.. గుర్తొచ్చేది సంస్కృతీ సంప్రదాయాలు. రేలారే రేలా పాటలు.. గుస్సాడీ నృత్యాలు. గత పాలకుల పట్టింపులేని తనంతో చీకట్లో మగ్గిన అడవిబిడ్డలు, కుమ్రం భీం పోరాట స్ఫూర్తితో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తమవంతు పాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పడి, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి జీవితాల్లో అనేక మార్పులు వచ్చాయి. ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా లెక్కకు మించి పథకాలు అమలు చేస్తుండగా, వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. సర్కారు పల్లెపల్లెనా విద్య, వైద్యం, రవాణా వంటి సౌకర్యాలు కల్పిస్తున్నది. నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తుండడంతో వారు ఆర్థికాభివృద్ధి వైపు సాగుతున్నారు. ఇక ముఖ్యంగా 500 జనాభా కలిగిన గూడేలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో వారికి వారే పాలించుకునే అవకాశం కలిగింది. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.    - ఉట్నూర్‌/కెరమెరి
సమైక్య పాలనలో ఆదివాసులను పట్టించుకున్న వారు లేరు. అభివృద్ధికి ఆమడదూరంలో దుర్భర జీవితం గడిపారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వారి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలతోపాటు విద్య, వైద్యం, రోడ్డు, సాగు, తాగు నీటి వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మి పేరిట రూ.లక్షా 116 ఆర్థిక సాయం అందిస్తున్నారు. గిరి రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు అమలు చేస్తున్నది. అడవిబిడ్డలకు పథకాలు నేరుగా అందించే లక్ష్యంతో ఐటీడీఏ రెగ్యులర్‌ పీవోలను నియమించింది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో భాగంగా వృత్తి శిక్షణ కోర్సులు తీసుకొస్తున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగిన యువతకు డ్రైవర్‌ కం ఓనర్‌ పథకం ద్వారా వాహనాలు అందజేస్తున్నారు. ఆదివాసుల్లో అత్యంత వెనుకబడిన పీటీజీ కులాల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా సూపర్‌వైజర్లు, అసిస్టెంట్‌ సూపర్‌వైజర్లను నియమించారు. కావాల్సినన్ని సీసీడీపీ నిధులను ఖర్చు చేస్తున్నారు. జీసీసీ ద్వారా పెట్రోల్‌ బంక్‌, ఇతర పరిశ్రమలు నిర్వహిస్తూ వందశాతం గిరిజనులకే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఏజెన్సీలో గిరిజన మరణాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నది. అందులో భాగంగానే ఉట్నూర్‌ సామాజిక వైద్యశాలను జిల్లా దవాఖానగా మార్చారు. డయాలసిస్‌, బ్లడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేసి అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. పల్లెల్లో మోబైల్‌ టీంలు ఏర్పాటు చేసి ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. గిరిజనుల పిల్లలకు ఉన్నత విద్యను అందించేందుకు ప్రత్యేక గురుకులాలు, డిగ్రీ, బీఈడీ, పాలిటెక్నిక్‌ వంటి కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. గిరిజనులకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ భూములపై  రైతుబంధు పథకం అమలు చేస్తూ ఎకరానికి రూ.5 వేలు అందిస్తున్నారు. మిషన్‌ కాకతీయ పథకం ద్వారా చెరువులను మరమ్మతులు చేయించి సాగు నీరందిస్తున్నారు. మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా కుమ్రం భీం ప్రాజెక్ట్‌ నుంచి ఇంటింటీకీ తాగు నీరందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని గిరిజన గ్రామాలకు పైప్‌లైన్‌ పనులు పూర్తయి మంచినీరు వస్తున్నది. ఇక నల్లాలు బిగించడమే మిగిలింది.
నిర్మల్‌, నమస్తే తెలంగాణ : ఆదివాసుల అభివృద్ధి, సంక్షేమానికి సర్కారు ప్రత్యేక కృషి చేస్తున్నది. గతంలో ఏ ప్రభుత్వాలు చేపట్టని పథకాలను తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నది. రాష్ట్ర అవతరణ అనంతరం అడవి బిడ్డలు ఆత్మగౌరవంతో బతికేలా ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్నారు. ప్రత్యేకించి తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి ‘మా ఊళ్లో.. మా రాజ్యం’ కలను సాకారం చేశారు. అటవీ హక్కుల చట్టం అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అటవీ ఉత్పత్తులపై ఆధారపడిన వారికి స్వావలంబన కల్పించేందుకు కృషి చేస్తున్నారు. గిరిజనుల విద్యాభివృద్ధికి రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను ప్రారంభించాం. ఆర్వోఎఫ్‌ఆర్‌ పథకం కింద గిరిజన రైతులకు పట్టా హక్కు పత్రాలు అందించడంతోపాటు రైతు పథకం కూడా అమలు చేస్తున్నాం. దక్షిణ భారత దేశ కుంభమేళగా చెప్పుకునే మేడారం సమ్మక్క-సారక్క జాతరను ఘనంగా నిర్వహిస్తున్నాం. ఆదివాసుల ఆత్మగౌరవ ప్రతీకగా కుమ్రం భీం వర్ధంతిని కెరమెరి మండలం జోడెఘాట్‌లో అధికారికంగా నిర్వహిస్తున్నాం. రూ.25 కోట్లతో జోడెఘాట్‌ను అభివృద్ధి చేశారు. జోడెఘాట్‌కు డబుల్‌ రోడ్డు విస్తరణ కోసం రూ.7 కోట్లు మంజూరు చేశారు. యేటా కెస్లాపూర్‌ నాగోబా జాతరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నది. నాగోబా ఆలయం, దర్బార్‌, రోడ్డు నిర్మాణం, ఇతర పనుల కోసం రూ.7 కోట్లు మంజూరు చేసింది. నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆదివాసుల ప్రాంతాల్లో విద్య, వైద్యం, రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్న గిరిపుత్రులందరికీ శుభాకాంక్షలు. - అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి
భూమి, భుక్తి, విముక్తి కోసం నైజాం సర్కారుతో పోరాడి 1940లో పోలీసు తూటాలకు పోరాట వీరుడు కుమ్రం భీం నేలకొరిగాడు. అనంతరం ఆదివాసుల స్థితిగతులు తెలుసుకునేందుకు బ్రిటీష్‌ ప్రభుత్వం ఆస్ట్రేలియాకు చెందిన మానవ పరిణామ శాస్త్రవేత హైమన్‌డార్ఫ్‌ను నియమించింది. దీంతో ఆయన తన సతీమణి బెట్టి ఎలిజబెత్‌తో కలిసి ఆదివాసులతో ఉంటూ గోండి భాషను నేర్చుకున్నారు. ప్రొఫెసర్‌గా కాకుండా వారిలో ఒకరిగా ఉంటూ జీవన స్థితిగతులను లోతుగా పరిశోధన చేశారు. ఆనాటి మారుమూల ప్రాంతమైన మార్లవాయిలో ఉంటూ ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి సమగ్ర నివేదికను రూపొందించారు. అమాయకులైన ఆదివాసుల్లో అక్షర జ్ఞానం కల్పించేందుకు పాఠశాలలు నెలకొల్పారు. వారి సమస్యలను శాస్త్రీయ దృష్టితో విశ్లేషణ చేసి, వాటికి పరిష్కార మార్గాల్ని సూచించారు. నేడు ఆదివాసులు కొంత అభివృద్ధి దిశగా పయనిస్తున్నారంటే అది వారు చేసిన అధ్యయనం కృషే. అందుకే నేటికీ ఈ దంపతులు ఆదివాసుల గుండెల్లో కొలువై ఉన్నారు.
అడవుల్లో ఉంటూ పోడు వ్యవసాయం చేసి జీవిస్తున్న ఆదివాసులపై నిజాం పాలకులు హింసకు పాల్పడ్డారు. జల్‌, జంగల్‌, జమీన్‌ నినాదంతో గిరిరత్న కుమ్రం భీం వీరోచిత పోరాటం చేసి జోడెఘాట్‌లో అసువులు బాశారు. ఆ అమరవీరుడిని స్మరించుకునేందుకు ప్రభుత్వం జోడెఘాట్‌లో అధికారికంగా యేటా వర్ధంతి నిర్వహిస్తున్నది. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు పోరుగడ్డను అభివృద్ధి చేశారు. రూ.25 కోట్లతో స్మారక చిహ్నం, గిరిజన మ్యూజియాన్ని నిర్మించి, వారి ఖ్యాతిని ప్రపంచానికి తెలిసేలా చేశారు. దశాబ్దాలుగా సరైన రహదారికి కూడా నోచుకోని ఆ గ్రామానికి రూ.15.95 కోట్లతో రెండు వరుసల రహదారిని నిర్మించారు. 
ఆదివాసులకు సంస్కృతీ సంప్రదాయాలంటే పంచప్రాణాలు. పండుగలైనా.. ఆరాధ్య దేవతల పూజలైనా భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా నియమనిష్టలు పాటిస్తూ తరతరాలుగా వస్తున్న ఆచారాలు నేటికీ కొనసాగిస్తూనే ఉన్నారు.
పండ్లతోటలు పెంచే రైతులకు ఐటీడీఏ ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తున్నది. గిరిజన రైతులు వివిధ రకాల వాణిజ్య పంటలను వేసి నష్టపోకుండా ఉండేందుకు వారిని పండ్ల తోటల వైపు మళ్లించి శాశ్వత ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నది. పండ్ల తోటల్లో బిందు సేద్యం ద్వారా సాగునీటి వసతులు కల్పిస్తున్నది. చేపల పెంపకం, వేటపై ఆధారడి జీవించే గిరిజన కుటుంబాల కోసం కూడా ఐటీడీఏ ఈ ఏడాది భారీగానే నిధులను కేటాయించింది. దీని ద్వారా జిల్లాలో వారి కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించడంతోపాటు వారికి అవసరమైన చేప పిల్లలు, వలలు, తెప్పలు, సైకిళ్లను అందిస్తున్నది. గిరిజనులు చేపలు పట్టేందుకు అవసరమైన నైలాన్‌ వలలు, తెప్పలు, సైకిళ్లు, ఇతర సామగ్రిని అందించేందుకు నిధులను కేటాయించింది. 
గిరిజనుల అభ్యున్నతికి బాటలు పడాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను విభజించి కొత్తగా మంచిర్యాల, నిర్మల్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలను ఏర్పాటు చేసింది. మరోవైపు ఆదివాసుల కలలను సాకారం చేస్తూ గిరిజన గ్రామాలు, తండాలను కొత్త పం చాయతీలుగా ఏర్పాటు చేసి పాలనను ప్రజలకు చేరువ చేసింది. గిరిజన గ్రామాలు స్వావలంబన దిశగా అడుగులు వేసేందుకు మార్గం సుగమం చేసింది. గిరిజనుల సంక్షేమం కో సం రాజ్యాంగం కల్పించిన హక్కులు, గిరిజన చట్టాల అమలు పంచాయతీల తీర్మానాలతో మరింత పటిష్టం చేసుకునే అవకాశం కలిగింది. పల్లెలు అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకొంటూ ‘మా ఊళ్లో.. మా రాజ్యం’ కలలను సాకారం చేసింది.


logo