మంగళవారం 11 ఆగస్టు 2020
Komarambheem - Aug 03, 2020 , 01:52:57

పల్లెల ప్రగతి బాట

పల్లెల ప్రగతి బాట

  • ఉమ్మడి జిల్లాలో 45 గ్రామ పంచాయతీలు ఎంపిక
  • రాష్ట్రంలో అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 29..
  • త్వరలో ప్రతి జీపీకీ రూ. 20 లక్షలు
  • పలు అభివృద్ధి పనులకు వినియోగించుకునే వీలు
  • ఇప్పటికే గ్రామ సభల ద్వారా సమస్యలు గుర్తింపు

‘ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన’తో దళిత గ్రామాలు ప్రగతి బాట పట్టనున్నాయి.ఈ పథకం కింద  ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 45  గ్రామ పంచాయతీలను ఎంపిక చేయగా, అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 29, ఆదిలాబాద్‌ జిల్లాలో 4, నిర్మల్‌లో 6, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 6 ఎంపికయ్యాయి. త్వరలో ప్రతి జీపీకీ రూ. 20 లక్షల చొప్పున మంజూరు కానుండగా, పలు అభివృద్ధి పనులకు వినియోగించుకునే అవకాశమున్నది. ఇప్పటికే గ్రామ సభల ద్వారా సమస్యలు గుర్తించగా, మరికొద్ది రోజుల్లో పరిష్కరించే అవకాశమున్నది.    

కోటపల్లి : ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకంతో దళిత గ్రామాలు ప్రగతి బాట పట్టనున్నాయి. ఈ పథకం ద్వారా అత్యధికంగా ఎస్సీ జనాభా ఉన్న గ్రామాలకు నిధులు మంజూ రు అవుతాయి. 2010లో ఈ పథకాన్ని ప్రారంభించగా, గతేడాది నుంచి మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 137 గ్రామాలను ఎంపిక చేయగా, ఈ యేడాది 162 పంచాయతీలను ఎంపిక చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం 45 గ్రామ పంచాయతీలు ఎంపిక కాగా, ఆదిలాబాద్‌ జిల్లాలో 4, నిర్మల్‌ జిల్లాలో 6, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 6, మంచిర్యాల జిల్లాలో 29 గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా మంచిర్యాల జిల్లాలోని 29 గ్రామాలను ఎంపిక చేయడం విశేషం.

ఎంపికైన గ్రామాలు ఇవే..

మంచిర్యాల జిల్లా : భీమారం మండలం ఆరెపల్లి, అంకుశాపూర్‌, కొత్తపల్లి, భీమిని మండలం కేస్లాపూర్‌, చెన్నూర్‌ మండలం అంగ్రాజ్‌పల్లి, ఎర్రగుంటపల్లి, గంగారం, కొమ్మెర, పొన్నారం, వెంకటాపూర్‌, జైపూర్‌ మండలం నర్వా, పౌనూర్‌, వేలాల, ఎల్కంటి, జన్నారం మండలం తిమ్మాపూర్‌, కోటపల్లి మండలం మల్లంపేట, నాగంపేట, బొప్పారం, దేవులవాడ, బబ్బెరచేలు, ఆలుగామ, ఎదుల్లబంధం, రొయ్యలపల్లి, లక్షెట్టిపేట మం డలం మెట్‌పల్లి, మందమర్రి మండలం మామిడిగట్టు, వెంకటాపూర్‌, నెన్నెల మండలం గుండ్లసోమారం, జెండావెంకటాపూర్‌, మన్నెగూడ గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారు.

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా : కెరమెరి మం డలం ముకుదంగూడ, సిర్పూర్‌(టీ) మండలం దొరపల్లి, రెబ్బెన మండలం కిష్టాపూర్‌, కౌటాల మండలం చీపురుదుబ్బ, ఆసిఫాబాద్‌ మండలం రౌటసంకెపల్లి, తిర్యాణి మండలం దేవాయిగూడ ఎంపికయ్యాయి.

ఆదిలాబాద్‌ జిల్లా : ఇచ్చోడ మండలం తలమద్రి, ఉట్నూర్‌ మండలం నర్సాపూర్‌ బీ, నేరడిగొండ మండలం తార్నం-కే, నార్నూర్‌ మం డలం మాలెపూర్‌ ఎంపికయ్యాయి.

నిర్మల్‌ జిల్లా: కడెం మండలం కొత్తమద్దిపడగ, బుట్టాపూర్‌, నాజన్‌ యెల్లాపూర్‌, నిర్మల్‌ మండ లం పాకపట్ల, ముథోల్‌ మండలం కిర్నోల్‌, లోకేశ్వరం మండలం బాగాపూర్‌ గ్రామపంచాయతీలు ఎంపికయ్యాయి.

దళిత జనాభా ఉన్న గ్రామాలకు..

అత్యధికంగా దళితులు ఉన్న గ్రామాలను ఈ పథకానికి ఎంపిక చేశారు. దళిత గ్రామాలను అభివృద్ధి చేయడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలనేదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద ఎంపికైన గ్రామాలకు మొదటి విడుతలో రూ. 20 లక్షలు మంజూరు చేయనుండగా, ఇప్పటికే అధికారుల బృందం పర్యటించి పనులను గుర్తించారు. గ్రామ సభలు నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ పథకం ద్వారా రహదారులు, అంగన్‌వాడీ భవనాలు, సామూహిక మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు పారిశుద్ధ్య పనులు, మౌలిక వసతులు కల్పించనున్నారు. విద్యుత్‌ సమస్యలు పరిష్కరించనున్నారు. ప్రధానంగా అంతర్గత రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యమివ్వనున్నారు. పంచాయతీల్లో సర్పంచ్‌లు పనులు చేపట్టనున్నారు. మున్ముందు ఈ పంచాయతీలకు మరిన్ని నిధులు మంజూరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.logo