శుక్రవారం 14 ఆగస్టు 2020
Komarambheem - Aug 01, 2020 , 00:42:50

సేంద్రియ సేద్యం చేస్తూ అందరికీ ఆదర్శంగా

సేంద్రియ సేద్యం చేస్తూ అందరికీ ఆదర్శంగా

రసాయన ఎరువులను విచ్చలవిడిగా వాడుతూ చాలా మంది రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. అలా వాడిన రసాయనాలతో దిగుబడి రావడం అంటుంచి.. నేల స్వభావం పూర్తిగా దెబ్బతింటున్నది. చివరికి మిత్ర పురుగులు నశించి.. ఏ పంట వేసినా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. దీనిని గమనించిన రైతు బిక్కయ్య విభిన్నంగా ఆలోచించాడు. వరిలో సేంద్రియ సేద్యం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సొంతంగా జీవామృతం తయారు చేస్తూ అధికంగా లాభాలు గడిస్తున్నాడు.     - కాగజ్‌నగర్‌ రూరల్‌

కాగజ్‌నగర్‌ రూరల్‌ : మనం తినే ఆహారం, పాలు, నూనె ఇలా అనేక రకాల పదార్థాలు కల్తీ అవుతున్నాయి. కొందరు లాభాపేక్షతో దిగుబడి పెరగడానికి ఇలా విపరీతమైన రసాయనాలు వినియోగిస్తున్నారు. ఏ రైతైనా సాధారణ రీతిలో వ్యవసాయం చేస్తుంటాడు. వారందరికీ విభిన్నంగా ఆలోచించాడు చౌదరి బిక్కయ్య. వరి సాగు విధానాన్ని భిన్న పద్ధతిలో చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు కాగజ్‌నగర్‌ మండలంలోని ఆరెగూడ గ్రామానికి చెందిన రైతు చౌదరి బిక్కయ్య. నిత్యం నష్టాలంటూ చెప్పుకొస్తున్న వ్యవసాయంలో రసాయన ఎరువులకు దూరంగా ఉంటూ.. సేంద్రియ పద్ధతిలో వరి వేస్తూ లాభాల బాట పట్టొచ్చని నిరూపిస్తున్నాడు. తనకున్న రెండెకరాల్లో మూడేండ్లుగా వరి సాగు చేస్తున్నాడు. తక్కువ ఖర్చుతో సేంద్రియ ఎరువులు వాడుతున్నాడు. మొదటి సంవత్సరం ఎకరానికి 11 క్వింటాళ్లు రాగా, రెండో యేడాది 15 క్వింటాళ్లు వచ్చాయి. దీంతో ఈ యేడాది కూడా సేంద్రియ సాగుకు శ్రీకారం చుట్టాడు. ఏటేటా దిగుబడి పెరుగుతుండడంతో  ఆరోగ్యంతోపాటు నాణ్యమైన పంట చేతికి వస్తున్నది. మామూలు ధాన్యం కంటే ధర క్వింటాలుకు రూ.1000 నుంచి రూ.1500 అధికంగా ఉంటుంది. సుమారు రూ.50 వేలకు పైగా ఆదాయం సమకూరింది.

జీవామృతం తయారీ, ఉపయోగం..

ఆవుపేడ 10 కిలోలు, ఆవు మూత్రం 5 నుంచి 10 లీటర్లు, బెల్లం 2 కిలోలు, నీరు 200 లీటర్లు, పుట్టమన్ను లేదా పొలం గట్టు మన్ను పడికెడు తీసుకోవాలి. డ్రమ్ములో 200 లీటర్ల నీటిలో ఈ పదార్థాన్ని కలిపి ప్రతిరోజూ రెండు లేదా మూడు సార్లు కర్రతో తిప్పాలి. 48 గంటల తర్వాత వాడుకోవచ్చు. ఈ జీవామృతం ఒక ఎకరానికి సరిపోతుంది. పంటకు నీరు పారించే సమయంలో నీటితో కలిపి పొలంలో జీవామృతం అందేలా చేయాలి. ప్రతి 15 రోజులకు లేదా 30 రోజులకు ఒకసారి నీటితోపాటు పంటకు అందిస్తుండాలి. జీవామృతాన్ని పిచికారీ చేస్తే పత్తి, వరి వంటి పంటలకు చీడపీడలు నశిస్తాయి. దీంతో భూమిలోని జీవరాశి పెరిగి నేల ఆరోగ్యవంతమవుతుంది.
ప్రకృతి వ్యవసాయంతో నాకు పెట్టుబడి దాదాపుగా లేదు. ఎడ్లతో దున్నితే నాటు వేసేందుకు, కోతకు మాత్రమే ఖర్చవుతుంది. జీవామృతం ఉపయోగించడంతో వానపాములు నేలలో వేల సంఖ్యలో కనిపిస్తున్నాయి. ఇవి పంటకు ఎంతో మేలు చేస్తున్నాయి. ఎరువులు లేకుండా పండించిన అన్నం తినాలని ఇప్పుడు చాలా మంది కోరుకుంటున్నారు. నాకైతే ఎకరానికి ఖర్చులు పోనూ రూ.50 వేల లాభం వస్తున్నది. రసాయన మందులతో పురుగులు చావడం అటుంచి వాతావరణం కాలుష్యమవుతున్నది. దీంతో పాటు పంటకు సహకరించే మిత్ర పురుగులు కూడా చనిపోతున్నాయి. వీటికి దూరంగా ఉంటూ సేంద్రియ సాగు చేస్తుండడంతో నాణ్యమైన  దిగుబడి వస్తున్నది.  - బిక్కయ్య, రైతు 


logo