గురువారం 06 ఆగస్టు 2020
Komarambheem - Jul 29, 2020 , 02:11:29

కడక్‌నాథ్‌ కోళ్లు కేరాఫ్‌ కొల్లూరు

కడక్‌నాథ్‌ కోళ్లు కేరాఫ్‌ కొల్లూరు

కడక్‌నాథ్‌.. ఈ నాటు కోడి మాంసానికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. మధ్యప్రదేశ్‌.. దేశీజాతికి చెందిన ఈ కోడి లాభాలను తెచ్చి పెడుతున్నది. బాయిలర్‌ కోళ్లతో పోలిస్తే దీనిలో పోషక విలువలు ఎక్కువగా ఉండడంతో  భలే గిరాకీ ఉంది. నరాలు, ఆస్తమా, గుండె సంబంధిత వ్యాధులకు ఇది ఔషధంగా పని చేస్తుందన్న నమ్మకంతో మాంసం ప్రియులు తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

కోటపల్లి మండలం కొల్లూరు గ్రామానికి చెందిన దేవులపల్లి మధూకర్‌, సైదుల వెంకటేశ్‌ కడక్‌నాథ్‌ కోళ్లు పెంచాలని నిర్ణయించారు. ఎనిమిది నెలల క్రితం విజయవాడ నుంచి 800 కడక్‌నాథ్‌ కోడి పిల్లలను తీసుకొచ్చారు. ఒక్కోదానికి రూ.60 చొప్పున చెల్లించి కొనుగోలు చేశారు. కోడి పిల్లలు, ట్రాన్స్‌పోర్టుకు కలిపి మొత్తం రూ.60 వేలు ఖర్చు అయ్యాయి. రూ.1.50 లక్షలతో షెడ్డును నిర్మించి కంచె ఏర్పాటు చేశారు. దాణా, మందుల కోసం సుమారు రూ.40 వేలు పెట్టారు. ప్రతిరోజూ దాణా పెట్టడం, వ్యాధులు రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సీజన్‌లో వ్యాధులు రాకుండా వైద్యుల సూచనల మేరకు మందులు అందించారు. కోడి 7 నుంచి 8 నెలల్లో 2 నుంచి 3 కిలోల బరువు పెరుగుతుంది. ఒక కోడి 100 నుంచి 200 వరకు గుడ్లు పెడుతున్నది. వీటిని ప్రత్యేక యంత్రంలో వేసి పొదగ పెట్టాల్సి ఉంటుంది.

కడక్‌నాథ్‌ కోళ్ల మాంసం తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నరు. బాయిలర్‌ కోళ్లతో పోలిస్తే ఈ మాంసంలో అధిక పోషకాలు ఉంటాయట. మేమైతే ఇప్పటిదాకా 60 కోళ్లు, 400 కోడిగుడ్ల దాకా అమ్మినం. రూ.లక్ష దాకా సంపాదించినం.- దేవులపల్లి మధూకర్‌, కొల్లూరు

కడక్‌ నాథ్‌ కోడి మాంసానికి మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. కిలోకు రూ.600 నుంచి రూ.800 వరకు ధర పలుకుతు ంది. కోడి గుడ్డులో పోషకాలు అధికంగా ఉండడంతో వాటికి కూడా ధర బాగానే ఉంది. ఒక్కో గుడ్డుకు రూ.50 నుంచి రూ.60 వరకు పలుకుతున్నది. కోళ్లను పెంచుతూ షెడ్డు వద్దే అమ్ముతున్నాం. కోడి గుడ్లు కూడా విక్రయిస్తున్నాం. ప్రస్తుతం కోళ్లు, గుడ్లను విక్రయిస్తుండడంతో ఆదాయం బాగుంది. మున్ముందు యంత్రం కొనుగోలు చేసి గుడ్లను పొదగపెట్టే విషయమై ఆలోచిస్తున్నాం.- సైదుల వెంకటేశ్‌, కొల్లూరు
logo