సోమవారం 10 ఆగస్టు 2020
Komarambheem - Jul 23, 2020 , 01:28:44

సాగు లెక్క పక్కాగా..

సాగు లెక్క పక్కాగా..

రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా నియంత్రిత సాగుపై రైతులు దృష్టి పెట్టారు. దీంతో ఈ వానకాలంలో సాగవుతున్న పంటల వివరాలను వ్యవసాయ విస్తరణా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తు సేకరిస్తున్నారు. రైతులు ఎన్ని ఎకరాల్లో ఏఏ పంటలు వేశారనే వివరాలు తెలుసుకొని, ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో సాగు విస్తీర్ణంతోపాటు దిగుబడి అంచనా వేయ నున్నారు. పంటల కొనుగోలు సమయంలో ఈ వివరాల ప్రకారం ఏఈవోలు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు. వీటి ఆధారంగా రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఉత్పత్తులను విక్రయించి మద్దతు ధర పొందుతారు. 

 కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ/కోటపల్లి :   వానకాలం పంటల సాగుపై అధికారులు సమగ్ర వివరాలను సేకరిస్తున్నారు. రైతులు ఎన్ని ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు.. ఏయే పంటలు సాగుచేస్తున్నారనే విషయమై పూర్తి స్థాయిలో ఏఈవోలు వివరాలు సేకరించనున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలోనూ ఈ సర్వే కొనసాగుతున్నది. ప్రతి పల్లెలో ఏఈవోలు పర్యటించి, ఈ వివరాలు సేకరిస్తున్నారు.

నియంత్రిత సాగువైపే దృష్టి..

ప్రభుత్వం నియంత్రిత సాగువైపు దృష్టి సారించాలని సూచించగా, రైతులంతా ఆ దిశగా అడుగులు వేశారు. ఈ మేరకు జిల్లాలో సాగవుతున్న పంటల పూర్తి వివరాలను తెలుసుకునేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. రైతుపేరు, సర్వే నంబర్లు, రైతుకు ఉన్న భూమి, ఏయే పంటలను సాగుచేశాడనే వివరాలను తెలుసుకుంటారు. క్లస్టర్ల వారీగా సేకరించిన పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఈ సర్వే ద్వారా జిల్లాలో ఏయే గ్రామాల పరిధిలో ఏయే పంటలు ఏ మేరకు సాగుచేస్తున్నారనే వివరాలను ఖచ్చితంగా లెక్కకట్టేందుకు వీలు కలుగనుంది. సాగవుతున్న పంటల వివరాల ఆధారంగా జిల్లాలో ఏయే పంటలు ఏమేరకు దిగుబడి వస్తాయనే అంచనాలను అధికారులు వేయనున్నారు. దీని ఆధారంగా వ్యవసాయ దిగుబడులు ఏమేరకు వస్తాయోననే అంచనాలు సరిగా వేసే వీలు         కలుగుతుంది. 

అన్ని వివరాలు ఆన్‌లైన్‌..

ఏఈవోలు సేకరించిన పంటల పూర్తి వివరాలను వ్యవసాయ పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని 15 మండలాల్లోని 70 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో 4 లక్షల 55 వేల ఎకరాల్లో రైతులు పంటలను సాగుచేస్తున్నారు. ఈ జిల్లాలో రైతులు పత్తి పంటను అత్యధికంగా సాగుచేస్తున్నారు. జిల్లాలో 3.60 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, మంచిర్యాల జిల్లాలోనూ ప్రస్తుతం వేగంగా ఈ సర్వే కొనసాగుతున్నది. రైతులు పండించిన పంటలను అమ్ముకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మార్కెట్‌లో వసతులు కల్పించడంలో అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై ముందస్తుగా ఏర్పాట్లు చేసే వీలు కలుగుతుంది. 

కొనుగోళ్లలో పారదర్శకత..

నియంత్రిత సాగు విధానంలో భాగంగా రైతులు సాగు చేసిన పంటలకు మంచి డిమాండ్‌ ఉం టుంది. జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థలు మార్క్‌ఫెడ్‌, నాఫెడ్‌, ఆయిల్‌ఫెడ్‌, సీసీఐ ద్వారా పత్తి, కంది, సోయాబీన్‌, శనగ పంటలను కొనుగోలు చేస్తారు. లైసెన్స్‌ ఉన్న ప్రైవేటు వ్యాపారులు వివిధ పంటలను కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుతం వ్యవసాయ విస్తరణ అధికారులు సేకరిస్తున్న పం టల వివరాలతో పలు రకాల ప్రయోజనాలు చేకూరనున్నాయి. జిల్లాలో వివిధ రకాల పంటలు ఎన్ని ఎకరాల్లో సాగవుతున్నాయో పక్కాగా తెలుస్తున్నది. దీంతోపాటు ఆయా పంటల దిగుబడు లు కూడా తెలుస్తాయి. ఈ వివరాల ప్రకారం రైతు లు ధాన్యం విక్రయించే సందర్భంలో ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటారు. జిల్లాలో వివిధ పంటల సేకరణకు ఎన్ని కొనుగోలు కేంద్రాలు, ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే విషయంలో ప్రణాళికలు తయారు చేస్తారు.

దళారుల దందాకు చెక్‌

దళారులు గ్రామాల్లో రైతుల వద్ద నుంచి తక్కు వ ధరకు కొనుగోలు చేసేవారు. వివిధ పంటలను విక్రయించి మద్దతు ధర పొందేవారు. దీంతో రైతులు నష్టపోవాల్సి వచ్చేది. వారు నష్టపోకుం డా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంటలు విక్రయించాలంటే ఏఈవోల ధ్రువీకరణ పత్రం ఉండాలనే నిబంధన విధించారు. ప్రస్తుతం సేకరిస్తున్న పంట ల వివరాలను ఏఈవోలు ఆన్‌లైన్‌లో పొందు పరుస్తున్నారు. కొనుగోళ్లు జరిగేటప్పుడు ఈ వివరాల ఆధారంగా వారు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు. పంటల ఆధారంగా దిగుబడిని అంచనా వేసి పత్రం ఇస్తారు. ఈ ప్రక్రియతో అసలైన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభిస్తుంది. దళారులు దందాకు చెక్‌ పడనుంది. 


logo