సోమవారం 03 ఆగస్టు 2020
Komarambheem - Jul 19, 2020 , 02:43:15

పల్లెలు ప్రగతిబాట పట్టాలి

పల్లెలు ప్రగతిబాట పట్టాలి

కెరమెరి : పల్లెలు అన్ని రంగాల్లో ప్రగతి బాట పట్టాలని పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా అన్నారు. మండలంలోని సావర్‌ఖేడ గ్రామంలో కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝాతో కలిసి శనివారం పర్యటించారు. శ్మశాన వాటిక, డంప్‌ యార్డు, రైతు వేదిక తదితర అభి వృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. వ్యవసాయాన్ని బలోపేతం చేసేందుకు రైతులకు రైతు బంధు, రైతు బీమా అందించి ఆదుకుంటున్నదని పేర్కొన్నారు. సబ్సిడీపై యంత్రాలు, పనిముట్లతో చేయూతనిస్తున్నదన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం తండాలు, గూడేలను పంచాయతీలుగా మార్చిందని వెల్లడించారు. ఆ జీపీలను అభివృద్ధి దిశగా నడిపించాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామాలు పరిశుభ్రతతోపాటు పచ్చని చెట్ల నడుమ ప్రశాంత వాతావరణంలో వికసించాలన్నదే ‘పల్లె ప్రగతి’ ఉద్దేశమని, దాని సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. ప్రతి ఇంటిని శుభ్రంగా ఉంచాలని తడి, పొడి చెత్త బుట్టలు అందించి, డంప్‌యార్డుకు తరలిస్తున్నట్లు చెప్పారు. అలాగే జీపీకి ఒక ట్రాక్టర్‌, ట్యాంకర్‌ అందించిందని, సద్వినియోగం చేసుకొని ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం కొవిడ్‌-19 ప్రభావం తీవ్రంగా ఉన్నదని, ప్రజలు ఆందోళన చెందకుండా నివారణ చర్యలు పాటించాలని సూచించారు. వైరస్‌ సోకిన వారిని వెలివేసినట్లు చూడడం సరికాదన్నారు. చిరువ్యాపారాలతో ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో మహిళా సంఘాలకు ప్రభుత్వం రుణాలు అందిస్తున్నదని, సద్వినియోగం చేసుకొని సకాలంలో చెల్లించేలా చూడాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సావర్‌ఖేడ ప్రభుత్వ పాఠశాల నిర్వహణపై కార్యదర్శిని ప్రశంసించారు. సకల సౌకర్యాల నడుమ విద్యార్థులకు ఉత్తమ బోధన అందిస్తున్న ప్రధానోపాధ్యాయుడు రంగయ్యను అభినందించారు. అనంతరం ధనో రా గ్రామంలోని కేంద్రె బాలాజీకి చెందిన యాపి ల్‌ తోటను సందర్శించి, మొక్కలు నాటారు. సాగు విధానంపై బాలాజీని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ రాం బాబు, డీఆర్డీవో వెంకట్‌ శైలేష్‌, డీపీవో రమేశ్‌, ఆర్డీవో సిడాం దత్తు, ఎంపీడీవో మహేందర్‌, తహసీల్దార్‌ గోడం సంతోష్‌కుమార్‌, అటవీ రేంజ్‌ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఏపీవో నగేశ్‌, సర్పంచ్‌లు కావుడే తులసీరాం, మడావి చిలుక, వైస్‌ ఎంపీపీ అబుల్‌ కలాం, తదితరులు ఉన్నారు.


logo