బుధవారం 12 ఆగస్టు 2020
Komarambheem - Jul 05, 2020 , 23:29:53

సర్కారు బాటలో ‘సాగు’తూ..

సర్కారు బాటలో ‘సాగు’తూ..

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : తెలంగాణ సర్కారు నియంత్రిత విధానంలో సాగు చేయాలని సూచించడంతో రైతులు ఆ దిశ గా అడుగులు వేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ చెప్పిన విధంగా వానకాలంలో లాభాదాయక పంటలు వేస్తున్నారు. నియంత్రిత సాగుకు అధికారులు నివేదికలు సిద్ధం చేసి లక్ష్యాలకు అనుగుణంగా రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఈ ఏడాది వానకాలంలో వరి 60,323 ఎకరాలు, కంది పంట 35 వేల ఎకరాలు, పత్తి 3 లక్షల 40 వేల ఎకరాలు, జొన్న 5736 ఎకరాలు, పెసర 5,500 ఎకరాలు, మినుములు 1,739 ఎకరాలు, వేరుశనగ 60 ఎకరాలు, కూరగాయలు 4,500 ఎకరాలు, మిగతా తదితర పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో సాగవుతున్న 60,323 ఎకరాల వరి సాగులో 30 శాతం ప్రభుత్వం నిర్ణయించిన తెలంగాణ సోన రకాన్ని సాగు చేస్తున్నారు. గతేడాది కంటే పత్తి సాగు 25 శాతం అదనంగా సాగవుతోంది.

గతేడాది కంటే అదనం..

గతేడాదికంటే ఈ ఏడాది జిల్లాలో 4795 ఎకరాల్లో అదనంగా పంటలు సాగు చేస్తున్నారు. గతేడాది వానకాలంలో 4,50,471 ఎకరాల్లో సాగు చేయగా, ఈ వానకాలంలో 4,55,266 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టులు, చెరువులు, బోర్లు, వ్యవసాయ బావు లు, లిఫ్ట్‌ ఇరిగేషన్ల ద్వారా ఈ ఏడాది వానకాలం లో 4795 ఎకరాల్లో అదనంగా సాగులోకి వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

సన్నరకాలకే ప్రాధాన్యం

ప్రభుత్వం డిమాండ్‌ ఉన్న పంటలనే సాగు చేయాలని సూచిస్తుండగా, జిల్లాలో ఈ ఏడాది అత్యధికంగా సన్నరకాలనే సాగు చేస్తున్నారు. జిల్లాలో వరి సాగువుతున్న విస్తీర్ణంలో 62.54 శా తం సన్నరకాలనే సాగు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. బీపీటీ-5204 రకాన్ని 3431 ఎకరాలు, ఆర్‌ఎన్‌ఆర్‌-15048 రకాన్ని 7640 ఎకరాలు, ఎన్‌ఎల్‌ఆర్‌-34449 రకాన్ని 630 ఎకరాలు, జేసీఎల్‌-1798 రకాన్ని 8022 ఎకరాలు, జేజీఎల్‌-384 రకాన్ని 6369 ఎకరాలు, డబ్ల్యూజీఎ ల్‌- 32100 రకాన్ని 400 ఎకరాలు, డబ్ల్యూజీఎల్‌-14 రకాన్ని 332 ఎకరాలు, హెచ్‌ఎంటీ సోనా 1666 ఎకరాలు, జై శ్రీరాం రకాన్ని 3433 ఎకరాలు, కావేరి చింటు రకాన్ని 975 ఎకరాలు, అక్షయ రకాన్ని 399 ఎకరాలు, గంగా కావేరి రకా న్ని 51 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.

అనుకూలిస్తున్న వర్షాలు..

జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పంటలకు ఢోకాలేదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ప్రధాన పంటలైన పత్తి, కంది, జొన్న, సోయా, ఇతర పప్పు దినుసుల పంటలతోపాటు, వరి పంటలకు వాతావరణం అనుకూలిస్తుండడంతో మంచి దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. మరోవైపు వర్షాలకు చెరువుల్లోకి వరద వస్తుండడంతో పంటలకు పుష్కలంగా నీరు అందే అవకాశాలు ఉన్నాయి. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఖాతాల్లో రైతుబంధు..

వానకాలానికి సంబంధించి రైతుల ఖాతాల్లో సర్కారు రైతుబంధు డబ్బులు జమ చేసింది. జిల్లా వ్యాప్తంగా 98,759 మంది ఖాతాల్లో ఎకరాకు రూ.5 వేల చొప్పున రూ.175.14 కోట్లు జమయ్యాయి. సీఎం కేసీఆర్‌ ఆర్థిక సాయం సకాలంలో అందడంతో పెట్టుబడి ఖర్చుకు అవస్థలు తప్పాయి. వ్యవసాయ అధికారులు, సిబ్బంది గ్రా మాల్లో పంటలను పరిశీలిస్తూ సూచనలు అందిస్తున్నారు. సర్కారు సూచించిన పంటలను వేస్తూ గతంలో కంటే ఈసారి తాము అధిక లాభాలు పొందుతామని రైతులు పేర్కొంటున్నారు.logo