శుక్రవారం 14 ఆగస్టు 2020
Komarambheem - Jun 24, 2020 , 23:44:42

చిట్టడవులకు చిరునామా మియావాకి

చిట్టడవులకు చిరునామా మియావాకి

“మియావాకి.. జపాన్‌ దేశానికి చెందిన వృక్ష శాస్త్రవేత్త పేరు. అంతరించి పోతున్న వృక్ష సంపదను చూసి ఈయన చలించిపోయాడు. తక్కువ సమయం.. తక్కువ విస్తీర్ణం.. తక్కువ వ్యయంతో చిట్టడవులను పెంచడంలో సఫలుడయ్యాడు. ఆయన పేరు మీదనే నూతన విధానం అమల్లోకి వచ్చింది. ఈ విధానంలో ఇప్పటికే కొన్నిచోట్ల మియావాకి ప్లాంటేషన్స్‌ ఉండగా.. తెలంగాణ సర్కారు పల్లె, పట్టణాల్లో నూతనంగా ప్లాంటేషన్స్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 

తాంసి/ఆదిలాబాద్‌ రూరల్‌ : పల్లెలు, పట్టణాలు కాంక్రీట్‌ జంగిల్‌లా మారుతున్నాయి. జనసాంద్రత అధికంగా ఉన్నచోట స్వచ్ఛమైన గాలి కూడా లభించడం లేదు. మానవుల అవసరాల దృష్ట్యా చెట్లను నరికి వేయడంతో ప్రకృతికి విఘాతం కలుగుతున్నది. పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటున్నది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చెట్ల నరికివేత, రణగొణ ధ్వనులతో పర్యావరణానికి హాని కలుగుతున్నది. కాలుష్యం పెరిగిపోయి స్వచ్ఛమైన గాలి లభించని పరిస్థితి. వాహనాల నుంచి వచ్చే కార్బన్‌ డై ఆక్సైడ్‌ను పీల్చుకుని జనం రోగాల బారిన పడుతున్నారు. కనుమరుగవుతున్న వనసంపదను తిరిగి సృష్టించడానికి సర్కారు ప్రయత్నాలు చేస్తున్నది. మానవులు నరికేసిన చెట్లచోట మొక్కలు నాటి అవి వృక్షాలుగా మారాలంటే దశాబ్దాలు పడుతోంది. ఇప్పటికే హరితహారం పేరిట ఐదు విడుతలుగా కోట్లాది మొక్కలు నాటి సంరక్షిస్తున్నది. అయినప్పటికీ కొన్ని మొక్కలు బతకడం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ యేడు ఆరో విడుతలో మియావాకి నూతన విధానానికి శ్రీకారం చుట్టనుంది. జిల్లావ్యాప్తంగా మండలాల పరిధిలోని ఒక గ్రామ పంచాయతీలో ఉపాధి పనుల ద్వారా ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మండలంలోని ఒక జీపీలో ఈ యేడు ప్రయోగాత్మకంగా ఉపాధి నిధులతో ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్లు కూడా జిల్లాస్థాయి అధికారులతో నిర్వహించే ప్రతి హరితహారం సమావేశంలో సూచిస్తున్నారు. ఈ విధానం విజయవంతమైతే వచ్చే యేడాది నుంచి అన్ని జీపీల్లో  అమలు చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు.  

నిర్మల్‌లో స్థల సేకరణ

నిర్మల్‌ అర్బన్‌ : మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు నిర్మల్‌ మున్సిపల్‌ అధికారులు మియావాకి చెట్ల పెంపకానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణంలోని విశ్వనాథ్‌పేట్‌-బంగల్‌పేట్‌ శివారులోని రెండెకరాల స్థలంలో పెద్ద ఎత్తున అడవిని తలపించేలా చెట్లను పెంచనున్నారు. ఇందుకోసం మున్సిపల్‌ అధికారులు స్థలాన్ని సేకరించి పిచ్చి మొక్కలను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 25న రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మొక్కలు నాటనున్నారు.

రెండు శాఖల భాగస్వామ్యం

హరితహారంలో బాగంగా మియావాకి పద్ధతిలో మొక్కలు పెంచే బాధ్యతను అటవీ, మున్సిపల్‌ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా వచ్చే నిధుల్లో 10 శాతం పచ్చదనానికి కేటాయించాల్సి ఉండగా, పురపాలక శాఖ ఆ నిధులను మియావాకి పద్ధతిలో పెంచే మొక్కలపై ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆదిలాబాద్‌ జిల్లా దుర్గానగర్‌లో గుర్తించిన ఐదెకరాల స్థలాన్ని కలెక్టర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పరిశీలించారు. నాలుగు నెలల కాలంలోనే మొక్కలు పెరిగేలా చూస్తారు. మొక్కల పెంపకం కోసం ఇప్పటికే గుంతలు తవ్వారు. ఒక ఎకరం పరిధిలో 4వేల మొక్కలను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. గుంతల్లో నల్ల మట్టి, జీవామృతం వేసిన తర్వాత మొక్కలు నాటుతారు. మొక్కలు పెరిగే కొద్ది కింది పక్కలను కట్‌చేసి ఏపుగా పెరిగేలా చేస్తారు. మొత్తం ఐదెకరాల్లో 20 వేల మొక్కలను పెంచడమే లక్ష్యంగా నిర్ణయించారు. ఇందు కోసం జిల్లా అటవీ, మున్సిపల్‌ శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేయనున్నారు. 
మియావాకి అంటే జపాన్‌ దేశానికి చెందిన ప్రముఖ పర్యావరణ, వృక్షశాస్త్రవేత్త. బోటినిస్ట్‌ అకీరా మియావాకి అంతరించిపోతున్న వృక్ష సంపదను చూసి తల్లడిల్లి పోయాడు. అడవులను పెంచడానికి అనేక ప్రయోగాలు చేశాడు. తక్కువ సమయం.. తక్కువ విస్తీర్ణం.. నిర్వహణ ఖర్చు తక్కువ, ఎక్కువ మొక్కలు పెంచి కృత్రిమ చిట్టడవులను తయారు చేసి పర్యావరణాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో కొత్త విధానాన్ని రూపొందించాడు. ఈయన పేరు మీదనే నూతన విధానం అమలులోకి వచ్చింది. ఈ పద్ధతిలో పట్టణాలు, పారిశ్రామిక ప్రాంతాలు, పాఠశాలలు, బంజరు, అటవీ భూములు, ఖాళీ స్థలాల్లో చిట్టడువులను తలపించేలా మొక్కలను పెంచను న్నారు. ఎకరంలో నాలుగు వేల మొక్కలు నాటే అవకాశం ఉంటుంది. ఇందులో అన్ని రకాల మొక్కలను దగ్గర దగ్గరగా నాటుతారు. నాటే మొక్కల్లో స్థానికంగా, అందుబాటులో ఉండి త్వరగా పెరిగే మొక్కలను ప్రాధాన్యమిస్తారు. చిన్నవి, పెద్దవి, మధ్యస్థం, పొట్టివి ఉండేలా చూసుకుంటారు. నాటిన మొక్కలకు డ్రిప్‌ విధానంలో రోజూ నీరు అందేలా చూస్తారు. మొక్కలు నాటిన మూడు నుంచి నాలుగేండ్లలో 10రెట్ల పచ్చదనం పంచుతుంది. దీనివల్ల 30 శాతం అధికంగా ఆక్సిజన్‌ అందుతుంది. 

పారిశ్రామిక ప్రాంతాలు అనువు

మొక్కలు నాటడానికి పారిశ్రామిక ప్రాంతాలు, పాఠశాలు, కళాశాలల స్థలాలు అనువుగా ఉంటాయి. ఉన్న తక్కవ స్థలంలో వీటిని పెంచడానికి ఆస్కారం ఉంటుంది. పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పుడు తప్పకుండా చెట్లను పెంచాలి. ఈ విధానంలో అందుబాటులో ఉన్న స్థలంలో చెట్లను పెంచడానికి అవకాశం ఏర్పడుతోంది. ఈ దిశగా పరిశ్రమల యజమానుల ను సన్నద్ధం చేయడానికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందిస్తున్నది. అలాగే ఖాళీగా ఉన్న పాఠశాల, కాలేజీ స్థలాల్లో పెంచ డానికి అధికారులు సమాయత్తం అవు తున్నారు. మొత్తానికి ఈ విధానంతో అంతరించిపోతున్న వన సంపదను తక్కువ సమయంలో పునరుద్ధరించ డానికి ఆస్కారం కలుగనుంది. 
మంచిర్యాల జిల్లాలో స్థలం కేటాయింపు
మంచిర్యాల టౌన్‌ : మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు పట్టణంలో రెండు చోట్ల స్థలాలు కేటాయించారు. ఇందులో ఆండాళమ్మకాలనీ సమీపంలోని శ్రీనిధి లే అవుట్‌, వేములపల్లి సమీపంలోని ఆదర్శ  లే అవుట్‌లో స్థలాలను మున్సిపల్‌ అధికారులు ఎంపిక చేశారు. మియావాకి ఫారెస్టు పేరిట  జపాన్‌లో అడవులను పెంచిన విధంగానే యాదాద్రి మోడల్‌ ఫారెస్టు పేరిట ఈ చిట్టడవులను పెంచాలని మంత్రి సూచించారు.


logo