గురువారం 13 ఆగస్టు 2020
Komarambheem - Jun 15, 2020 , 00:24:15

ఇంటికో ఇంకుడు గుంత

ఇంటికో ఇంకుడు గుంత

కాగజ్‌నగర్‌ రూరల్‌: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లడంలో మండలంలోని భట్టుపల్లి పంచాయతీ పాలకవర్గ సభ్యులు పూర్తిస్థాయిలో సఫలీకృతులయ్యారు. సర్పంచ్‌ మ్సైం ఉమ గ్రామాన్ని అద్దంలా తీర్చిదిద్దారు. భట్టుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో జీడిచేను, బామన్‌చేను, లక్ష్మీనగర్‌ కాలనీలు ఉన్నాయి. ఇంకుడు గుంతల నిర్మాణంలో ప్రభుత్వాలు పూర్తి సహకారం అందిస్తుండగా, పాలకవర్గ సభ్యులు వాటి అవశ్యకతను ప్రజలకు వివరించి ఇంటింటికీ నిర్మించుకునేలా చైతన్యవంతులను చేశారు.

భట్టుపల్లి గ్రామ పంచాయతీ ఐఎస్‌ఎల్‌ నిర్మాణాల్లో జనాభాకు అనుకూలంగా వందశాతం చేరువలో ఉన్నారు. ఉపాధి హామీ పథకంలో ఒక్కో ఇంకుడుగుంత నిర్మాణానికి ప్రభుత్వం రూ.2400 ప్రోత్సాహకం అందజేస్తున్నది. గ్రామంలో మహిళలు 2218, పురుషులు 2295 కలిపి మొత్తం 4513 మంది ఉండగా, నివాసాలు 1164 ఉన్నాయి. 470 ఇంకుడు గుంతలను నిర్మించారు. వానకాలంలో డాబాలు, ఇండ్లపై కురిసే వర్షపు నీరు, ఇండ్లలోని, బోర్లు, చేతి పంపుల వద్ద వృథా నీరంతా నేరుగా ఇం కుడు గుంతల్లోకి వెళ్లేలా ఏర్పాటు చేశారు. దీంతో గ్రామం లో ఎక్కడా  మురుగు నీరు నిలిచిన దాఖలాలు లేవు.  

అందరి సహకారంతోనే 

ఇంటింటికీ ఇంకుడు గుంత తప్పనిసరి అని గ్రామస్తులకు అవగాహన కల్పించడంలో పాలకవర్గ సభ్యులు అహర్నిశలు కృషి చేశారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడానికి కారణాలు వివరిస్తూ, ఇంకుడుగుంత నిర్మించుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయని తెలుపుతూ గ్రామస్తుల్లో చైతన్యం తెచ్చాం. ప్రజలకు సౌకర్య వంతమైన పాలన అందించడమే లక్ష్యం. -మ్సైం ఉమ, సర్పంచ్‌, భట్టుపల్లి 

ఇంకుడు గుంతలపై అవగాహన

మండలంలోని 30 గ్రామాల్లో ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. ప్రతి గ్రామ పంచాయతీలోని పాలకవర్గ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి ఇంకుడుగుంతల ఆవశ్యకతను వివరించడంతో ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణలో నిర్మించుకుంటున్నారు. దీంతో భూగర్భజలాలు అడుగంటిపోకుండా ఉంటాయని అవగాహన కల్పించాం.   -సుశీల్‌రెడ్డి, ఎంపీడీవో, కాగజ్‌నగర్‌logo