గురువారం 06 ఆగస్టు 2020
Komarambheem - Jun 10, 2020 , 04:47:13

కొనసాగిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు

  కొనసాగిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు

  • ఎనిమిది రోజుల పాటు గ్రామాల్లో వివిధ పనులు
  • సీజనల్‌ వ్యాధులపై అవగాహన
  • రెండు విడుతల పల్లె ప్రగతి పనులపైనా దృష్టి
  • రెండు జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల సందడి

వానకాలం సీజన్‌లో వ్యాధులను అరికట్టేందుకు గ్రామాలు, పట్టణాల్లో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు సోమవారంతో ముగిశాయి. ఈనెల 1 నుంచి 8 వరకు ఎనిమిది రోజుల పాటు అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పల్లెల్లో పర్యటిస్తూ గ్రామాల్లో వివిధ పనులు చేపట్టారు. పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి, తీసుకోవాల్సిన చర్యలపై అధికార యంత్రాంగంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు,దుర్గం చిన్నయ్య, కలెక్టర్‌ భారతీ హోళికేరి వివిధ గ్రామాల్లో పర్యటించి, పనుల్లో భాగస్వాములయ్యారు.

కుమ్రం భీం ఆసిఫాబాద్‌/ మంచిర్యాల, నమస్తే తెలంగాణ: పల్లెల్లో ఎనిమిది రోజుల పాటు నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమాలో పరిశుభ్రమైన వాతావరణం నెలకొంది. వానకాలం సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌ లాంటి సీజనల్‌వ్యాధులు ప్రబలకుండా అడ్డుకట్ట వేసినైట్లెంది. పల్లెలను పరిశుభ్రత వైపు నడిపించడంతో పాటు, ప్రజల్లో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించేలా పలు పనులు చేపట్టడంతో ఈ స్పెషల్‌ డ్రైవ్‌ విజయవంతమైంది. గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సందడి వాతావరణం నెలకొంది.

పల్లె ప్రగతి స్ఫూర్తితో..

పల్లె ప్రగతి స్ఫూర్తితో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా తగు చర్యలు తీసుకుంది. వానకాలం సీజన్‌ దృష్ట్యా కాలువలు శుభ్రం చేయడం, చెత్తాచెదారాన్ని తొలగించడం, మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం లాంటి కార్యక్రమాలు చేపట్టింది. దీంతో పాటు వ్యాధులు ప్రబలే అవకాశం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా చోట్ల ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని 15 మండలాల పరిధిలో 334 గ్రామాల్లో ఈ కార్యక్రమాలు కొనసాగాయి. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వివిధ పనులు చేపట్టారు. జిల్లాలోని పలు గ్రామాల్లో కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా పర్యటించారు. పారిశుధ్యంతో పాటు హరితహారం నర్సరీలను పరిశీలించారు. స్థానిక యంత్రాంగంతో పాటు సర్పంచులకు, ఇతర ప్రజాప్రతినిధులకు పలు జాగ్రత్తలు సూచించారు. వానకాలం వస్తున్నందున ఎక్కడా పారిశుద్ధ్యం లోపించకుండా చూసుకోవాలన్నారు. చెత్తను డంపింగ్‌ యార్డులకు ఎప్పటికప్పుడు తరలించాలని, మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు.

మంచిర్యాల జిల్లాలో.. 

జిల్లాలో విప్‌ బాల్క సుమన్‌తో పాటు ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌, ఎమ్మెల్యేలు, మిగతా ప్రజాప్రతినిధులు, అధికారులు రోజుకు ఒక గ్రామ పంచాయతీ, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతి రోజు చేసిన పనులను సాయంత్రంలోగా నివేదికతో పాటు ఫొటోలను జిల్లా ఉన్నతాధికారులకు పంపుతున్నారు. జిల్లా కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారి ఇతర జిల్లా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. కలెక్టర్‌ భారతి హోళికేరి పలు చోట్ల అధికారులను మందలించారు. 

చురుగ్గా పనులు

జిల్లాలోని 311 గ్రామ పంచాయతీల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలించడం, మురుగు కాల్వలను శుభ్రం చేసి బ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లడం, గ్రామాల్లో నీటి నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని మొరంతో నింపడం, పైప్‌లైన్‌ లీకేజీ మరమ్మతులు, గ్రామాల్లో ఫాగింగ్‌ యంత్రం ద్వారా స్ప్రే చేసి రోగ కారక జీవులు చేరకుండా చూడడం వంటి పనులు చేపట్టారు. ఆయా గ్రామాల్లో ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు తొలగించారు. మొక్కల చుట్టూ హద్దులు, మొక్కల కొమ్మలను సరి చేయడం, అంతర్గత రహదారులను శుభ్రం చేశారు. పట్టణాల్లో మురుగు కాల్వలను శుభ్రం చేయడం వంటి పనులు చేశారు. logo