ఆదివారం 12 జూలై 2020
Komarambheem - May 29, 2020 , 02:24:40

రైతులే ‘స్ఫూర్తి’ దాతలు..

రైతులే ‘స్ఫూర్తి’ దాతలు..

భూ విరాళంతో ఆదర్శంగా కుభీర్‌ అన్నదాతలు

 సమాజ శ్రేయస్సు కోసం ముందుకువచ్చిన కర్షకులు

 కుభీర్‌లో జూనియర్‌ కళాశాల, పార్డి(కె)లో పాఠశాలలకు ఎకరం చొప్పున విరాళం..

 వైకుంఠధామాల నిర్మాణానికి సాంగ్విలో ఎకరం,  మౌలా గ్రామంలో 10 గుంటల దానం

ఆలయ భూములు.., చెరువుల అడుగులు.., శ్మశాన వాటికలు, ప్రభుత్వ స్థలాలు.., ఇలా ఎక్కడ పడితే అక్కడ దర్జాగా ఆక్రమించుకొని పబ్బంగడుపుతున్న వారెందరో. అడుగు స్థలం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారు మరెందరో. ఎకరం భూమికి లక్షల విలువ పలుకుతున్నది. ఇలాంటి తరుణంలో తమకున్న భూములను సమాజశ్రేయస్సు కోసం దానం చేసి, భూ దాతలుగా కీర్తికెక్కుతున్నారు.. కుభీర్‌ మండల రైతులు.                                             - కుభీర్‌

కుభీర్‌ మండల కేంద్రానికి 2015లో సర్కారు.. జూనియర్‌ కళాశాలను మంజూరు చేసింది. అనుకూలమైన చోట ప్రభుత్వ భూమి లేకపోవడంతో చేసేదేమీలేక అధికారులు మిన్నకుండిపోయారు. వేరే ప్రాంతానికి తరలిపోతుందనుకున్న సమయంలో స్థానిక రైతు.. దొంతుల లింగన్న ముందుకు వచ్చాడు. కుభీర్‌-పార్డి(కె) రహదారి సమీపంలో తనకున్న సాగు భూమి నుంచి ఎకరం (సుమారు రూ.15 లక్షలు) విరాళంగా ఇస్తానన్నాడు. అప్పట్లో ఇది మండలంలోనే సంచలనం కలిగించింది. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్‌ చేయించి, తన ఉదారతను చాటుకున్నాడు. పెద్దగా చదువుకోలేక పోయినా.. భవిష్యత్‌లో ఎందరికో విద్యనందించే కళాశాలకు భూమిని ఇవ్వడం గర్వంగా ఉందంటున్నాడు లింగన్న..  

వైకుంఠధామం నిర్మాణానికి..

సాంగ్విలో వైకుంఠధామం లేక ప్రజలు ఇబ్బందులుపడుతుండగా, రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో తనకున్న ఎకరం (సుమారు రూ. 8 లక్షల విలువ) భూమిని అందించింది.. మహాగాం గ్రామానికి చెందిన మహిళా రైతు గాడే కోమల్‌. మండల అధికారుల సమక్షంలో సర్పంచ్‌ న్యాలపట్ల దత్తూగౌడ్‌కు పట్టా పాసుపుస్తకం అందించి ఉదారతను చాటుకున్నది. స్వగ్రామం కాకపోయినా సాంగ్విలో ఉన్న భూమిని దానం చేసి స్ఫూర్తి ప్రదాతగా నిలిచింది. అలాగే మౌలా గ్రామానికి చెందిన జైవంత్‌రావు పటేల్‌ గ్రామంలో నిర్మించే వైకుంఠధామానికి తన 10 గుంటల (సుమారు రూ.2.50 లక్షల విలువ) భూమిని దానం చేసి గ్రామానికి ఆదర్శంగా నిలిచాడు.

ప్రభుత్వ పాఠశాల కోసం..

అలాగే పార్డి(కె)లో 1970లో ప్రభుత్వ పాఠశాల నిర్మించేందుకు స్థలంలేకపోగా అప్పటి సర్పంచ్‌ దివంగత సింధే దాజీరావు పటేల్‌ తన ఎకరం (సుమారు రూ.10  లక్షల విలువ) భూమిని విరాళంగా అందించాడు. గ్రామస్తులు తన పేరును చిరస్థాయిగా గుర్తుపెట్టుకునేలా కీర్తికెక్కాడు.logo