శనివారం 15 ఆగస్టు 2020
Komarambheem - May 29, 2020 , 02:24:34

యూరియా వచ్చేసింది..

యూరియా వచ్చేసింది..

 రైతులకు ఇబ్బందులు కలుగకుండా సర్కారు చర్యలు

 పంటల సాగుకు ముందే పంపిణీ

 ఆనందంలో అన్నదాతలు

 నెన్నెల : జిల్లా వ్యాప్తంగా ఈ వానకాలంలో 3.70 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 36,208 మెట్రిక్‌ టన్నుల యూరియా కోసం ప్రతిపాదనలు పంపగా, ప్రస్తుతం 7200 మెట్రిక్‌ టన్నుల యూరియా జిల్లాకు చేరుకున్నది. మిగతాది వీలైనంత త్వరగా తెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాకు చేరుకున్న యూరియాను ఇప్పటికే రైతులకు పంపిణీ చేస్తున్నారు.

ముందుగానే ఎరువుల పంపిణీ.

గతంలో ఎరువులు, యూరియా కోసం రైతులు చెప్పులు అరిగేలా తిరిగేవారు. వ్యాపారులు యూరియాను అధిక ధరలకు విక్రయించేవారు. 45 కిలోల యూరియా రూ.320 నుంచి రూ. 400 వరకు అమ్మేవారు. చాలా మంది కాంప్లెక్స్‌ ఎరువులు తీసుకుంటేనే యూరియా బస్తా ఇచ్చే వారు. అవసరం లేకున్నా రైతులు యూరియా కోసం కాంప్లెక్స్‌ ఎరువులను కొనుగోలు చేసి నష్టపోవాల్సి ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా రైతులకు యూరియా బస్తాలను అందిస్తున్నది. 45 కిలోల యూరియా బస్తా హమాలీతో కలిపి రూ.265కే ఇస్తున్నారు. జిల్లాలో డీసీఎంఎస్‌, పీఏసీఎస్‌ల ద్వారా గ్రామాలకు సరఫరా చేశారు. 

జిల్లాలో దాదాపు 19 పీఏసీఎస్‌లు కేంద్రాలు, 30 డీసీఎంఎస్‌ల కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తుండగా, 200 ప్రైవేట్‌ ఫర్టిలైజర్స్‌ దుకాణాలు ద్వారా యూరియా అందిస్తున్నారు. ఎలాంటి కొరత లేకుండా ముందస్తుగా జిల్లాలో రైతులకు అవసరమైన యూరియాను అందిస్తుండడంతో రైతులు మురిసి పోతున్నారు. గతంలో ఎన్నడూ రైతులకు ఇలా ముందస్తుగా ఎరువులను ఇవ్వలేదని, ఇప్పుడు పంటలు వేయక ముందే ఎరువులు అందించడం ఒక్క కేసీఆర్‌ సార్‌కే సాధ్యమైందని, ఇక తమ పంటలకు ఢోకా లేదని రైతులు ఆనంద పడుతున్నారు.

గిట్ల ఎవ్వరూ ఇయ్యలే.. 

పదేండ్లుగా వ్యవసాయం చేస్తున్న. 10 ఎకరాల్లో వరి, పత్తి పంట వేస్తున్న. మునుపైతే యూరియా కోసం మస్తు తిప్పలు పడేటోళ్లం. తెలంగాణ వచ్చి.. కేసీఆర్‌ సార్‌ సీఎం అయినంక మా బాధలన్నీ పోయినయి. పంట వేయక ముందే సరిపడా ఎరువులు ఇస్తన్రు. గిట్ల ముందుగా ఎవ్వరూ ఇచ్చింది లేదు. నాకు ఎకరానికి రెండు యూరియా సంచులు ఇచ్చిన్రు. మరోసారి ఎకరానికి మళ్లా రెండు సంచులు ఇస్తమన్నరు. చాలా ఆనందంగా ఉంది.            

- బిర్దు మల్లేశ్‌ రైతు(నెన్నెల)

కేసీఆర్‌ సార్‌కు రుణపడి ఉంట.. 

మా ఊరిలో నాకు ఐదెకరాల భూమి ఉంది. ఇంక పంట కూడా వేయలే. అప్పుడే యూరియా బత్తాలిత్తన్రు. నాకు పది సంచులు ఇచ్చిన్రు. చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్‌ సార్‌కు రుణ పడి ఉంటాం. గిట్ల ఎన్నడూ ముందుగాల సంచులు తీసుకున్నది లేదు. ఇది వరకైతే చెప్పులు అరిగేలా తిరిగినా యూరియా దొరికేది కాదు. నాలాంటోళ్లు మస్తు తిప్పలపడేటోళ్లు. పైసలెక్కువ ఇచ్చి యూరియా కొనుక్కునేటోళ్లం. ఇప్పుడు మంచిగుంది.  

- పురంశెట్టి శ్రీనివాస్‌ రైతు(నెన్నెల)


logo