మంగళవారం 04 ఆగస్టు 2020
Komarambheem - May 26, 2020 , 23:28:13

రైతుల అభివృద్ధికి కృషి

రైతుల అభివృద్ధికి కృషి

ప్రభుత్వం సూచించిన పంటలే వేయాలి

మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ‘నియంత్రిత సాగు’పై అవగాహన సదస్సు

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : రైతులను ధనవంతులను చేసి, తెలంగాణ వ్యవసాయాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ‘నియంత్రిత సాగు’పై కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడారు. రైతులు నియంత్రిత సాగు విధానం వైపు మొగ్గుచూపేలా అధికార యంత్రాంగం కృషిచేయాలన్నారు. రాష్ట్ర సర్కారు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణే అన్నారు. పంటలకు మద్దతు ధర కల్పించి, రైతులు గర్వంగా అమ్ముకునేలా వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ అనేక మార్పులు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం సూచించిన పంటలు సాగు చేయాలన్నారు. అలాగే సర్కారు తీసుకుంటున్న చర్యలకు అండగా నిలువాలని రైతులకు సూచించారు. జిల్లాలోని ప్రతి రైతుకూ రైతుబంధు అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్రామాల్లో రైతులకు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, రైతు బంధు సమితి సభ్యులు అవగాహన కల్పించాలని సూచించారు. విత్తనాలు వేసే దగ్గరి నుంచి పంటల అమ్మకం దాకా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో 70 వ్యవసాయ క్లస్టర్లలో మండలం, గ్రామాల వారీగా రైతులు సాగు చేసే పంటల పూర్తి సమాచారం అధికారులు సేకరించాలన్నారు. 51 క్లస్టర్లలో రైతువేదికల నిర్మాణాలకు స్థలాలను గుర్తించామని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా తెలిపారు. మిగతా క్లస్టర్లలో వీలైనంత త్వరగా స్థలాలను ఎంపిక చేస్తామని చెప్పారు. అలాగే జిల్లాలో కొత్తగా ఏర్పడిన లింగాపూర్‌, పెంచికల్‌పేట్‌, చింతలమానేపల్లి మండలాల్లో గోదాముల నిర్మాణానికి కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది జిల్లాలో 3 లక్షల 40 వేల ఎకరాల్లో పత్తి,  60 వేల 323 ఎకరాల్లో వరి, 35 వేల ఎకరాల్లో కంది, 5736 ఎకరాల్లో జొన్న, 5500 ఎకరాల్లో పెసర, 1739 ఎకరాల్లో మినుము, తదితర పంటలు సాగుచేసేలా వ్యవసాయ శాఖ ప్రణాళికలు తయారు చేసిందన్నారు. సమావేశంలో కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌, డీసీసీబీ చైర్మన్‌ నాందేవ్‌, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కనక యాదవ్‌రావ్‌, జడ్పీ ఉపాధ్యక్షుడు కృష్ణారావు, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ మాంతయ్య, ఎంపీపీ, జడ్పీటీసీలు, రైతు బంధు సమితి సభ్యులు పాల్గొన్నారు.


logo