సోమవారం 25 మే 2020
Komarambheem - May 23, 2020 , 02:02:27

ఇటు సాగు.. అటు సేవ

ఇటు సాగు.. అటు సేవ

రైతుగా.. జడ్పీటీసీగా రాణిస్తున్న శ్యామల

కూరగాయలు పండిస్తూనే.. ప్రజా సమస్యల పరిష్కారం  

ఆదర్శంగా నిలుస్తున్న మహిళా ప్రజాప్రతినిధి

చిన్నపాటి పదవులకే గొప్పలకు పోయే ఈ రోజుల్లో జడ్పీటీసీగా ఎన్నికైనా.. తనకిష్టమైన కూరగాయ లు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది గుండ్ల సోమారం గ్రామానికి చెందిన సింగతి శ్యామల. పదవిలో ఉండి ప్రజా సేవ చేస్తూనే.. ఎప్పట్లాగే తమ తోట పనులు చేసుకుంటూ ఆదాయం పొందుతున్నది.          

 - నెన్నెల

గుండ్లసోమారం గ్రామానికి చెందిన సింగతి శ్యామల ప్రస్తుతం నెన్నెల జడ్పీటీసీ. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆమె పదో తరగతి దాకా చదివారు. భర్త రాంచందర్‌ కూడా సర్పంచ్‌గా పని చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు. వారిని ఉన్నత చదువులు చదివిస్తున్నారు. తమకున్న ఐదెకరాల్లో నాలుగెకరాల్లో వరి, ఎకరంలో కూరగాయలు సాగు చేస్తున్నారు. రాంచందర్‌ వరి సాగు చూసుకుంటుండగా, కూరగాయల సాగుపై శ్యామలకు ఆసక్తి ఎక్కువ. నాలుగేళ్ల క్రితం ఆరుతడి పంటలు వేయగా ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. దీంతో ఐకేపీ సంఘాల ద్వారా రూ. లక్ష వరకు రుణం తీసుకొని ఎకరం పొలంలో బోరు బావి వేయించారు. అప్పటి నుంచి యేటా మూడు పంటలు తీస్తున్నారు.

రైతుగా రాణిస్తూ..

శ్యామల మగవారితో సమానంగా పొలం పనులు చేస్తుంది. తమ కూరగాయల చేనులో అన్నీ తానై చేసుకుంటుంది. ఎరువులు వేయడం, మందులను పిచికారి చేయడం, మడులు చేయడం, విత్తనాలు వేయడం, నాటు వేయడం, నీటి తడులు పెట్టడంలాంటివి స్వయంగా చేస్తుంది. సీజన్‌ను బట్టి తమకున్న ఎకరంలో తోట కూర, మెంతి, కొత్తిమీర, గోంగూర, పాలకూర, టమాట, వంకాయ, బీర, కాకర, అనుపకాయ, చిక్కుడు, గోరు చిక్కుడులాంటివి పండిస్తున్నది. దీనికి తోడు వివిధ రకాల పూలతో పాటు నిమ్మ, జామ తోటలు కూడా పెంచుతూ లాభాలు పొందుతున్నారు. గతంలో నేరుగా మార్కెట్‌కు తరలించి విక్రయించేవారు. ప్రస్తుతం హోల్‌సేల్‌ వ్యాపారులకు అమ్ముతున్నారు. సీజన్‌ను బట్టి రోజుకు రూ. వెయ్యి దాకా సంపాదిస్తున్నది. ప్రతి నెల రూ. 15 నుంచి రూ.20 వేల వరకు ఆదాయం వస్తుందని ఆమె చెబుతున్నది. 

జడ్పీటీసీగా మన్ననలు..

శ్యామల ఓ వైపు జడ్పీటీసీగా ప్రజలకు సేవలందిస్తూనే.. మరోవైపు కూరగాయలు సాగు చేస్తున్నది. ఉన్నతమైన పదవిలో కొనసాగుతున్నా.. ఏమాత్రం నామోషీ పడకుండా తనకిష్టమైన సాగు పనుల్లో నిమగ్నమవుతున్నది. ఉదయం లేవగానే ఇంటి పనులు పూర్తి చేసుకొని.. తోటకు వెళ్లి కూరగాయలు తెంపుక వస్తుంది. వాటిని హోల్‌సేల్‌ వ్యాపారికి అప్పగిస్తుంది. ఆ తర్వాత ప్రజాప్రతినిధిగా అధికారిక కార్యక్రమా ల్లో పాలు పంచుకుంటోంది. సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరి స్తూ ప్రజల మన్ననలు పొందుతున్నది.

సామాజిక సేవలోనూ..

రైతుగా.. ప్రజాప్రతినిధిగా ఉంటూనే.. తన భర్తతో కలిసి పలు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటోంది. లాక్‌డౌన్‌ సందర్భంగా నిరుపేద లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. హరితహారంలో మొక్కలు నాటడం, అంటు వ్యాధులపై, పరిశుభ్రతపై అవగా హన కల్పించి ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు.

వ్యవసాయం అంటే ఇష్టం..

 మాది వ్యవసాయ కుటుంబం. సమయం దొరికితే మా ఆయనతో కలిసి పనులు చేస్త. పదేండ్లుగా కూరగాయలు పండిస్తున్న. రోజూ తోటకు వెళ్తా.. ఇది వరకు మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మేదాన్ని. ఇప్పుడు వ్యాపారులకే అప్పగిస్తున్న. జడ్పీటీసీగా ఎన్నికైన తర్వాత వ్యవసాయం ఎట్లా అనుకునేదాన్ని. జడ్పీటీసీగా సర్కారు కార్యక్రమాల్లో పాల్గొంటూనే తోట పనులు చేసుకుంటున్నా. నాకిష్టమైన వ్యవసాయాన్ని ఎప్పటికీ వదులుకోను.

- సింగతి శ్యామల, జడ్పీటీసీ

logo