శనివారం 06 జూన్ 2020
Komarambheem - May 22, 2020 , 00:05:48

రేయింబవళ్లు డ్యూటీలో పోలీసన్న..

రేయింబవళ్లు డ్యూటీలో పోలీసన్న..


మంచిర్యాల జిల్లాలో సుమారు 600 మంది పోలీసులు తమ కుటుంబాలను సైతం మరిచి రేయింబవళ్లు సేవలందిస్తున్నారు. వీరిలో 20 మంది ఎస్‌ఐలు, 10 మంది సీఐలు, ముగ్గురు ఏసీపీలు, డీసీపీ ఉన్నారు. సరిహద్దుల్లోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ల వద్ద పకడ్బందీగా పహారా కాస్తూ జిల్లాలోకి ఎవ్వరూ రానీయకుండా నిలువరించడంతో సఫలమయ్యారు. కోటపల్లి మండలంలోని రాపన్‌పల్లి-సిర్వంచ, దండేపల్లి మండలంలోని గూడెం-రాయపట్నం,జన్నారం మండలంలోని ఇందన్‌పల్లి-కలమడుగు సరిహద్దుల నుంచి రాకపోకలను నియంత్రించేందుకు కంటి మీద కునుకు లేకుండా పనిచేశారు. కాలినడకన వెళ్తున్న వలస కార్మికులకు భోజనం పెట్టి మానవత్వాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా లక్షెట్టిపేట మండలం పాత కొమ్ముగూడేనికి చెందిన గర్భిణి పురిటినొప్పులతో బాధపడుతుండగా, ఆమె భర్త వైద్య సాయం అందించాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌ వేదికగా రిక్వెస్ట్‌ చేయగా సత్వరమే స్పందించారు. ఆయన ఆదేశాలతో స్థానిక సీఐ నారాయణ్‌నాయక్‌ ఆధ్వర్యంలో పోలీసు పెట్రోల్‌ వాహనంలో సదరు గర్భిణిని మంచిర్యాల దవాఖానకు తరలించడంతో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. శ్రీరాంపూర్‌ ఏరియాకు చెందిన ఓ ఇంటర్‌ విద్యార్థిని గోదావరిలో దూకి ఆత్మహత్యకు చేసుకునేందుకు వెళ్తుండగా, పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్‌ ఇచ్చి కాపాడారు. ఇందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి సిబ్బందిని అభినందించడం మరువలేనిది. మన్నెగూడలో తమ శాఖ తరపున సుమారు 70 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించి అండగా నిలిచారు. రాజ్యసభ ఎంపీ సంతోశ్‌కుమార్‌ పిలుపుమేరకు జిల్లా కేంద్రంలో రామగుండం సీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో వలస కార్మికులకు భోజనం పెట్టారు.


logo