బుధవారం 05 ఆగస్టు 2020
Komarambheem - May 11, 2020 , 02:51:35

ముగ్గురు వలస కూలీలకు కరోనా

ముగ్గురు వలస కూలీలకు కరోనా

  • ముంబై నుంచి రాపల్లికి రాక
  • అక్కడి నుంచి ఐసోలేషన్‌ వార్డుకు..
  • పాజిటివ్‌ రావడంతో గాంధీ దవాఖానకు తరలింపు
  • కూలీల ముందు జాగ్రత్తతో తప్పిన ముప్పు
  • గ్రామస్తులకు ధైర్యం చెప్పిన డీసీపీ, ఎమ్మెల్యే నడిపెల్లి 

మంచిర్యాల, నమస్తే తెలంగాణ/మంచిర్యాలరూరల్‌/బెల్లంపల్లిరూరల్‌ : మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం రాపల్లికి చెందిన ముగ్గురు వలస కూలీలకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. బెల్లంపల్లి ఐసోలేషన్‌ వార్డులో ఉన్న వీరిని హుటాహుటిన హైదరాబాద్‌ గాంధీ దవాఖానకు తరలించారు. ముగ్గురు కూలీలు పనుల కోసం ముంబైకి వలస వెళ్లారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అక్కడ పనులు లేకపోవడంతో కాలినడకన మంచిర్యాల జిల్లా రాపల్లికి వచ్చారు. పోలీసులు వారిని బెల్లంపల్లి ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. రక్త నమూనాలు హైదరాబాద్‌కు పంపించారు. రిపోర్టులో కరోనా పాజిటివ్‌ రావడంతో వారిని హైదరాబాద్‌ గాంధీ దవాఖానకు తరలించారు. కూలీలు ముందు జాగ్రత్తగా వ్యవహరించడంతో ముప్పు తప్పింది. వారు ముల్కల్లలో ఉన్న కిరాయి ఇంటికి వెళ్లలేదు. దీంతో అక్కడ ఎవరినీ ముట్టుకోలేదు. ఎవరితో మాట్లాడలేదు. రాపల్లిలోకి వెళ్లకుండా ఊరి చివరన  ఉన్న చెట్టు కింద ఉన్నారు.

ఐసోలేషన్‌కు మరో నలుగురు

హాజీపూర్‌ మండలంలో మరో నలుగురిని బెల్లంపల్లిలోని సింగరేణి ఏరియా దవాఖానలో గల ఐసోలేషన్‌ వార్డుకు  ఆదివారం తరలించారు. రాపల్లికి చెందిన ముగ్గురు విద్యార్థులు ముంబైలో డిగ్రీ చదువుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకొని అక్కడి నుంచి స్వగ్రామానికి బయలు దేరా రు. దారిలో వీరిని జగిత్యాలలో అధికారులు గుర్తించి హోంక్వారంటైన్‌లో ఉండాలని చేతిపై ముద్ర వేశారు. వారు శనివారం సాయంత్రం హాజీపూర్‌ మండల కేంద్రానికి చేరుకోగానే పీహెచ్‌సీ వైద్యులు దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి వారిని ఆదివారం ఉదయం ఐసోలేషన్‌ కేంద్రానికి తీసుకెళ్లారు. అలాగే హాజీపూర్‌కు చెందిన ఓ వ్యక్తి ముంబై నుంచి శనివారం వచ్చాడు. ఐసోలేషన్‌కు తరలించేందుకు అతడి ఇంటికి ఆదివారం 108 సిబ్బంది వెళ్లారు. వారిని తన భార్య అడ్డుకున్నది. దీంతో పోలీసుల సాయంతో అవగాహన కల్పించి ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు.

1239 మంది హోం క్వారంటైన్‌..

జిల్లాలో మొత్తం 1239 మంది హోం క్వారంటైన్‌ లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి వచ్చిన వారు 260 మంది కాగా, సింగరేణి దవాఖానలో ఏర్పా టు చేసిన ఐసోలేషన్‌ వార్డులో ముగ్గురు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 80 మంది రక్తనమూనాలు పంపించారు. ఇందులో 74 మందికి నెగెటివ్‌ రాగా, నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. గతం లో చెన్నూర్‌ మండలం ముత్తరావుపల్లికి చెం దిన మహిళకు, తాజాగా ముంబై నుంచి వచ్చిన ముగ్గు రు వలస కూలీలకు పాజిటివ్‌ వచ్చింది. ఇంకా ఇద్దరికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. 

ధైర్యంగా ఉండండి.. ఎమ్మెల్యే, డీసీపీ

గ్రామస్తులు అందరూ ధైర్యంగా ఉండాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు డీసీపీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో   ఆదివారం రాపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు గ్రామస్తులతో మాట్లాడారు. ఎలాంటి భయం అక్కర్లేదన్నారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలన్నారు. 

పది మంది హోం క్వారంటైన్‌

బెజ్జూర్‌ : ఖమ్మం జిల్లా నుంచి బెజ్జూర్‌కు వచ్చిన పది మంది వలస కూలీలను హోం క్వారంటైన్‌కు ఆదేశించినట్లు తహసీల్దార్‌ ఇమ్రాన్‌ఖాన్‌ తెలిపారు. ఆదివారం వారు స్వగ్రామానికి చేరుకోగా, వైద్య ప రీక్షలు చేసి, చేతులపై స్టాంప్‌ వేశామని పేర్కొన్నారు.


logo