శనివారం 15 ఆగస్టు 2020
Komarambheem - May 10, 2020 , 02:39:18

గాలివాన బీభత్సం

గాలివాన బీభత్సం

దండేపల్లి : మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. పాత మామిడిపెల్లిలో ఈదురుగాలికి ఇంటి పైకప్పు రేకులు విరిగి మీద పడడంతో పడిదెం అర్జయ్య(50) మృతిచెందాడు. అతడి భార్య పుష్పల, కుమారులు పవన్‌, ప్రవీణ్‌ బంధువుల ఇంటికి వెళ్లగా అర్జయ్య ఒక్కడే ఇంట్లో నిద్రిస్తుండగా ప్రమాదం జరిగిం ది. కర్ణపేటలో పలు ఇండ్ల పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. అలాగే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. శనివారం ఉదయం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

లక్షెట్టిపేట రూరల్‌ : లక్షెట్టిపేట మండలంలో శనివారం ఈదురుగాలులకు శాంతాపూర్‌లోని రెండు ఇండ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. బాధితులకు తక్షణ సాయం కింద సర్పంచ్‌ శైలజ ఒక్కొక్కరికి రూ.1500 చొప్పున అందించారు. అంకత్‌పల్లి స్టేజీ వద్ద మంచిర్యాల-నిజామాబాద్‌ రహదారికి అడ్డుగా చెట్లకొమ్మలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలిగింది.

తడిసిన ధాన్యం

దహెగాం/బెజ్జూర్‌(పెంచికల్‌పేట్‌) : శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి దహెగాం, లగ్గాం, ఒడ్డుగూడ, గిరివెల్లి, చంద్రపల్లి, కొంచవెల్లి, కల్వాడా గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లోని ధాన్యం తడిసింది. ఒక్కసారిగా వానరావడంతో రైతులు టార్పాలిన్లు కప్పుకోలేని పరిస్థితి ఎదురైంది. పెంచికల్‌పేట్‌ మండలం మేరగూడలో గాలివాన బీభత్సం సృష్టించింది. పలు ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. ధాన్యం తడిసిపోవడంతో ఆరబెట్టేందుకు రైతులు ఇబ్బంది పడ్డారు.

పిడుగుపాటుకు దెబ్బతిన్న ఆలయ శిఖరం 

దహెగాం : లగ్గాంలోని శ్రీ ఉమాచంద్రశేఖరస్వామి ఆలయ శిఖరం పిడుగు పాటుకు దెబ్బతిన్నది. శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో భారీ వర్షం మొదలైంది. ఒక్కసారిగా పిడుగు పడడంతో ఆలయ గోపురం కూడా కొంత భాగం పగుళ్లు చూపింది. శనివారం ఉదయం వేద పండితులు సంప్రోక్షణ నిర్వహించారు.

మంచిర్యాల రూరల్‌ (హాజీపూర్‌) : హాజీపూర్‌ మండలంలోని బుద్దిపల్లిలో శనివారం సాయంత్రం పిడుగు పాటుకు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు ఓ భారీ వృక్షం నేల కూలాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. logo