బుధవారం 12 ఆగస్టు 2020
Komarambheem - Apr 20, 2020 , 02:48:33

మిగిలింది ఇద్దరే..

మిగిలింది ఇద్దరే..

  • కరోనా పాజిటివ్‌తో 19 మంది దవాఖానలో చేరిక
  • ఇప్పటివరకు విడతలవారీగా 17 మంది డిశ్చార్జి 
  • కొత్తగా నమోదుకాని కొవిడ్‌-19 కేసులు
  • ఊపిరి పీల్చుకుంటున్న కరీంనగర్‌ ప్రజలు

కరీంనగర్‌ హెల్త్‌ : అది మార్చి 18 బుధవారం.. కరీంనగర్‌లో ఎనిమిది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన దినం. ఒకే రోజున ఇన్ని కేసులు నమోదు కావడం భారతదేశంలోనే సంచలనం.   కరీంనగర్‌ వాసులు అయితే ఏం జరుగుతుందో అర్థంకాక తల్లడిల్లారు. ప్రభుత్వ ప్రణాళిక, అధికారుల శ్రమ ఫలితంగా అన్ని జిల్లాల కంటే ముందే కోలుకుంటోంది. జిల్లాలో మొత్తం 19 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూడగా.. హైదరాబాద్‌లోని గాంధీ, కింగ్‌ కోటి దవాఖానల్లో వీరికి చికిత్స అందించారు. వీరిలో విడతలవారీగా ఇప్పటివరకు 17 మందికి కరోనా నెగెటివ్‌ వచ్చింది. ఇక ప్రస్తుతం గాంధీలో ఒకరు, కింగ్‌ కోటిలో మరొకరు చికిత్స పొందుతున్నారు. నెగెటివ్‌ వచ్చిన వారిని అధికారులు మరో 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. కాగా, శర్మనగర్‌లో వచ్చినదే ఆఖరి కేసు కాగా, ఇప్పటి వరకు కొత్త కేసులు నమోదు కాలేదు. దీంతో జిల్లా అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. రెడ్‌జోన్‌ ఏరియాల్లో విధించిన ఆంక్షలను కూడా క్రమంగా సడలిస్తున్నారు. వైద్యాధికారులు నిరంతరం వైద్య పరీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు.

నిరంతరంగా వైద్య పరీక్షలు

హుజూరాబాద్‌లో ఆదివారం కంటైన్మెంట్‌ ఏరియాలో 59 వైద్య బృందాలు 1,152 గృ హాలను సందర్శించి 5,600 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇదే పట్టణంలో సాధారణ ప్రాంతాల్లో 17 వైద్య బృందాలు 553 గృహాల్లోని 1,611 మందికి పరీక్షలు నిర్వహించా యి. అలాగే, కరీంనగర్‌లోని కశ్మీర్‌గడ్డ ప్రాంతంలో 10 వైద్య బృందాలు 72 గృహాల్లోని 1,102 మందికి, మంకమ్మతోటలో 12 వైద్య బృందాలు 325 గృహాల్లోని 339, ముకరంపుర కంటైన్మెంట్‌ ఏరియాలో 10 బృందాలు 1,350 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాయి. మంకమ్మతోటకు చెందిన వ్యక్తి ఒకరు జ్వరంతో బాధపడుతుండగా అతన్ని ప్రభుత్వ ప్రధాన దవాఖానకు తరలించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుజాత తెలిపారు. అలాగే, హోం క్వారంటైన్‌లో ఉన్న 93 మందికి సంబంధించిన ఇండ్లను వైద్య బృం దాలు సందర్శించాయని ఆమె తెలిపారు. ఐదు మొబైల్‌ వైద్య బృందాలు కరీంనగర్‌లోని బ్యాంకులు, మార్కెట్‌ యార్డులు, షాపింగ్‌ మాల్స్‌ ప్రాంతాల్లో పర్యటించి 532 మందికి, ఆర్నకొండ చెక్‌పోస్టు వద్ద 46మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. 


logo