బుధవారం 05 ఆగస్టు 2020
Komarambheem - Apr 20, 2020 , 02:44:59

అకాల నష్టం

అకాల నష్టం

  • వర్షానికి తడిసిన ధాన్యం nకొనుగోలు కేంద్రాల్లో కొట్టుకుపోయిన వడ్లు
  • కళ్లాల వద్ద ముద్దయిన కుప్పలు 
  • పరిశీలించిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు 
  • కనీస మద్దతు ధరకే కొనుగోలు చేయిస్తామని హామీ.. 

కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాలో  ఆదివారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి చాలాచోట్ల వరి ధాన్యం తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వడ్లు కొట్టుకుపోగా, కళ్లాల వద్ద రైతులు పోసుకున్న రాశులు తడిసి ముద్దయ్యాయి. దీంతో అన్నదాతలకు నష్టం వాటిల్లింది. 

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ చొప్పదండి/ రామడుగు/ మానకొండూర్‌/శంకరపట్నం/చిగురుమామిడి : కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలంలో 30.0 మి.మీ., చిగురుమామిడిలో 26.5, తిమ్మాపూర్‌లో 12.5, మానకొండూర్‌, వీణవంక, హుజూరాబాద్‌ మండలాల్లో 6.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. రామడుగు, గన్నేరువరం, శంకరపట్నం, మానకొండూర్‌, కరీంనగర్‌ రూరల్‌ మండలాల్లోనూ వర్షం పడింది. తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో ధాన్యం తడిసిపోయింది. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో..

సిరిసిల్ల, తంగళ్లపల్లి, జిల్లెల్ల పరిధిలోని కోనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. పెద్దూరు, గండిలచ్చపేట, చింతలపల్లి, ఓబులాపూర్‌, కస్బెకట్కూర్‌, గంభీరావుపేట మండలం, ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌, వేములవాడ, రూరల్‌ మండలాల్లోని పలు గ్రామాలు, కోనరావుపేట, వీర్నపల్లి మండలం అడవిపదిర, ముస్తాబాద్‌ మండలం ఆవునూరులో వర్షం కురవడంతో ధాన్యం, వరిపంటకు నష్టం వాటిల్లింది. అయితే కొద్దిపాటి వర్షం మాత్రమే పడడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని జంగిటి లింగం ఇంటి సమీపంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడడంతో మంటలు చెలరేగాయి.

పరిశీలించిన ప్రజాప్రతినిధులు, అధికారులు

చొప్పదండి మండలం కొలిమికుంట, రామడుగు మండలం గోపాల్‌రావుపేట గ్రామాల్లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పర్యటించి తడిసిన ధాన్యం నిలువలను పరిశీలించారు. ఇటు మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ కూడా మానకొండూర్‌ మండలం ముంజంపల్లి, గన్నేరువరం మండల కేంద్రాలతోపాటు శంకరపట్నం మండలం తాడికల్‌లో పర్యటించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. 

వీర్నపల్లి మండలంలోని అడవిపదిర, ముస్తాబాద్‌ మండలం ఆవునూర్‌ గ్రామంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కోనరావుపేట మండలంలోని నాగారం, మర్తనపేట, కనగర్తి గ్రామాల్లో జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తడిసిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయిస్తామని, రైతులు అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. అకాల వర్షాలు ఎప్పుడు వచ్చేది తెలియదని, తమ దిగుబడులు విక్రయించే వరకు రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వారి వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. చిగురుమామిడి మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరి ధాన్యాన్ని ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ జంగా వెంకటరమణారెడ్డి పరిశీలించారు.


logo