శుక్రవారం 14 ఆగస్టు 2020
Komarambheem - Mar 09, 2020 , 00:26:14

ప్రగతికి ప్రతిరూపకంగా పద్దు

ప్రగతికి ప్రతిరూపకంగా పద్దు

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రూ.లక్షా 82 కోట్లతో ఆదివారం శాసనసభలో మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన 2020-2021 బడ్జెట్‌పై అంతటా హర్షం వ్యక్తమవుతున్నది. ఇందులో ప్రధానంగా వ్యవసాయరంగానికి పెద్దపీట వేయడంతో పాటు భారీ కేటాయింపులు చేయడంపై రైతన్నల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ముఖ్యంగా రైతుబంధు, రైతుబీమాతో పాటు ఒకేసారి రుణమాఫీ ప్రకటన వారిలో కొత్త ఉత్సాహం నింపుతోంది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్ద మొత్తం నిధులు కేటాయించడం అందరినీ ఆకట్టుకుంది.

ఆసరా పథకానికి రూ. 11750 కోట్లు

ఆసరా పింఛన్లకోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 11,750 కోట్ల నిధులు కేటాయించింది. ఈ పథకం ద్వారా జిల్లాలో 50,825 మంది ప్రతినెలా సుమారు రూ. 9 కోట్ల 96 లక్షలు పొందుతున్నారు. తాజాగా వయస్సుని ప్రభుత్వం 57 ఏళ్లకు కుదించడంతో మరో 4 వేల మంది కొత్తగా లబ్ధిపొందే అవకాశమున్నది.  

రుణమాఫీ కింద నేరుగా చెక్కులు..

రైతు రుణమాఫీకి ప్రస్తుతం 6,225 కోట్లు ప్రతిపాదించారు. అంతేకాదు, 25వేల లోపు రుణం తీసుకున్న రైతులకు ఒకే దఫాలో మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. 25 వేల కుపైగా రుణం ఉంటే నాలుగు విడతలుగా మాఫీ చేయనున్నారు. ఇదే సమయంలో బ్యాంకు ఖాతాల్లో జమ చేయకుండా నేరుగా చెక్కులు ఇస్తున్నట్లు చెప్పారు. పంటరుణాలకోసం 74,776 మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. రూ. 25 వేల లోపు రుణాలున్న రైతులకు ఒకేసారి, రూ. లక్ష రుణాలున్న రైతులకు నాలుగు విడతలుగా రుణాలను మాఫీ చేస్తున్నట్లు  వెల్లడించారు. జిల్లాలో పొందిన 74,776 మంది రైతులకు సుమారు రూ. 481 కోట్ల లబ్ధి చేకూరనున్నది.

93 వేల మందికి రైతుబంధు..

అన్నదాతపై సర్కారు మరోసారి తన ప్రేమను చాటింది. ‘రైతుబంధు’ కింద 14వేల కోట్లను ప్రతిపాదించింది. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న ‘రైతుబంధు’ను యథావిధిగా కొనసాగించడమేకాదు, కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు అందుకున్న రైతులకు కూడా వర్తింపజేసేందుకు గతంలో కన్నా 2వేల కోట్లు అదనంగా కేటాయించింది. జిల్లాలో గత ఖరీఫ్‌లో 79,189 మంది రైతులకు సుమారు రూ. 126 కోట్లు రైతు బంధు ద్వారా అందించింది. వచ్చే ఖరీఫ్‌నాటికి కొత్తగా పట్టాలు పొందిన రైతులకు కలుపుకొని సుమారు 93 వేల మంది రైతులకు సుమారు రూ. 140 కోట్ల మేర లబ్ధి జరిగే అవకాశాలు ఉన్నాయి.

‘రైతు’ కుటుంబాలకు ‘బీమా’తో భరోసా 

రైతన్న ఏ కారణంతో మరణించినా ఆ కుటుంబానికి రాష్ట్ర సర్కారు భరోసా ఇస్తున్నది. రైతు ‘రైతుబీమా’ కింద 5 లక్షలను అందిస్తూ చేయూతనిస్తున్నది. అయితే ప్రీమియం మొత్తం పెరిగినా వెనక్కి తగ్గకుండా రైతు పేరిట చెల్లిస్తూ, బీమాను యథావిధిగా అమలు చేస్తున్నది. గతేడాది జిల్లాలో 147 మంది రైతులు వివిధ కారణాలతో చనిపోగా, వీరిలో 127 మంది రైతులకుగాను సుమారు రూ. 6 కోట్ల 35 లక్షలు ప్రభుత్వం ఇన్సూరెన్స్‌ద్వారా వారి కుటుంబాలకు అందించింది. మిగతా రైతు కుటుంబాలకు త్వరలోనే డబ్బులు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నది. జిల్లాలో సుమారు 38 వేల మంది రైతులకు ప్రభుత్వమే ఒక్కొక్కరికీ రూ. 2717 చొప్పున ఇన్సూరెన్స్‌ ప్రీమియాన్ని చెల్లిస్తోంది. ఈ బడ్జెట్‌లో రైతు బీమా పథకానికి రూ. 1141 కోట్లు నిధులను కేటాయించడంతో అర్హులందరికీ ఇన్సూరెన్స్‌ వర్తించనున్నది.

మరింత జలకళ.. 

మిషన్‌ కాకతీయ కింద జిల్లాలో నాలుగు విడుతలుగా చేపట్టిన 372 చెరువులకుగాను 305 చెరువులకు మరమ్మతులు పూర్తయ్యాయి. దీంతో జిల్లాలో 27 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుండగా, ప్రభుత్వం ఇందుకోసం రూ. 55 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్ర బడ్జెట్‌లో మిషన్‌ కాకతీయకు నిధులు కేటాయించడంతో జిల్లాలోని మిగతా చెరువుల కూడా మరమ్మతులు చేపట్టే అవకాశం కలగనున్నది.

చేపలే.. చేపలు..

తాజా బడ్జెట్‌లో పశుపోషణ, మత్స్య శాఖకు 1586 కోట్లు ప్రతిపాదించారు. అంతేకాదు, ఈ ఆర్థిక సంవత్సరం లో 90 కోట్ల చేప పిల్లలను, పది కోట్ల రొయ్య పిల్లలను పం పిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. జి ల్లాలో19 మత్స్యకారుల సహకార సంఘాలుండగా.. సొసైటీల పరిధిలో 492 చెరువుల, 4 జలాశయాల్లో చేపలు పెం చుతున్నారు. మున్ముందు మరిన్ని నిధులు రానున్నాయి.

ప్రగతిపథం..

పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి కోసం ప్రస్తుతం 23,005 కోట్లను ప్రభుత్వం ప్రాతిపాదించింది. అలాగే పట్టణాభివృద్ధిలో భాగంగా 14,809 కోట్లను కేటాయించింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. పల్లె ప్రగతికి.. పట్టణాభివృద్ధికి ఒకేసారి పెద్దపీట వేసింది. తాజాగా ప్రతిపాదించిన బడ్జెట్‌ వల్ల పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా స్థానిక సంస్థలు ప్రగతి పథంలో దూసుకెళ్లే పరిస్థితులు ఏర్పడనున్నాయి. 334 పంచాయతీలతో పాటు కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీకి భారీగా నిధులు రానున్నాయి. 

మరింత మెరుగైన వైద్యం.. 

సర్కారు వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈసారి భారీగానే నిధులు కేటాయించారు. తాజా బడ్జెట్‌లో 6,186 కోట్లు ప్రతిపాదించారు. గతంలో కంటి వెలుగు మాదిరిగానే చెవి, ముక్కు, గొంతు, దంత సంబంధమైన వ్యాధుల నిర్ధారణకు ప్రభుత్వం త్వరలో కార్యాచరణను ప్రారంభిస్తుందని ప్రకటించారు. తెలగాంగాణ హెల్త్‌ ప్రొఫైల్‌ తయారు చేసేందుకు కూడా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని వెల్లడించారు. జిల్లాలోని 20 పీహెచ్‌సీ, జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి పరిధి రోగులకు ఉత్తమమైన వైద్యసేవలు అందుతున్నాయి. ఇప్పటి వరకు 8052 మందికి కేసీఆర్‌ కిట్లను అందించడంతో పాటు ప్రసవాలు పొందిన వారికి రూ. 8 కోట్ల 66 లక్షలు ప్రభుత్వం అందిందించి. 

కల్యాణ లక్ష్మి.. షాదీ ముబారక్‌..

పేదింట ఆడిపిల్లల పెళ్లిళ్ల కోసం ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను తెచ్చి, ఒక్కో పెళ్లికి లక్ష నూట పదహార్లు ఇస్తున్నది. తాజాగా బడ్జెట్‌లో కల్యాణలక్ష్మి కోసం 1350 కోట్లు, షాదీ ముబారక్‌ కోసం 1369 కోట్లు ప్రతిపాదించింది. జిల్లాలో లబ్ధిపొందేందుకు 4804 మంది దరఖాస్తులు చేసుకోగా, వీరిలో 2506 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ రూ. లక్ష 116 చొప్పున అందించారు. మిగతా 2295 మందిలబ్ధి చేకూరాల్సి ఉంది. 

నెరవేరనున్న సొంతింటి కల..

గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు.. సొంత స్థలంలో రెండు పడక గదుల ఇళ్లు నిర్మించుకోవడానికి అవసరమైన ఆర్థిక సాయం ప్రభుత్వం చేస్తుందని తాజా బడ్జెట్‌లో ప్రకటించింది. జిల్లాకు ప్రస్తుతం 1223 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు కాగా, వీటిలో 558 నిర్మాణాల్లో ఉన్నాయి.

Previous Article గాలివాన..

logo