శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Komarambheem - Mar 09, 2020 , 00:18:29

పల్లెలో ప్రత్యేకం హోలీ

పల్లెలో ప్రత్యేకం హోలీ

కెరమెరి: ఏజెన్సీ ప్రాంతంలో హోలీ పండుగకు ఎం తో ప్రత్యేకత ఉంది. ఆదివాసీ గ్రామాల్లో గ్రామపటేల్‌ ఆధ్వర్యంలో నిర్వహించుకునే ఈ వేడుకను వైభవంగా నిర్వహిస్తారు. ఆచార వ్యవహారాలను పాటిస్తూ సం స్కృతి, సంప్రదాయాలతో పండుగను అందరూ కలిసి మెలిసి నిర్వహించుకునేదే ఈ పండుగ. ఆదివాసీలు తమ సంప్రదాయ పద్ధతుల్లో కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు.

వేడుకలు ఇలా.. 

ప్రతి సంవత్సరం కాముని దహనం రోజున గ్రామంలోని పటేల్‌ ఇంట్లో ఇంటికో కుడక, రెండు చక్కెర బిల్లల హారాలు తీసుకొచ్చి సమావేశమవుతారు. ఇతర గ్రామాల ఉంటూ సాంప్రదాయాలు పాటించని వారిని  ఈ వేడులకు అనర్హులుగా ప్రకటిస్తారు. అందరూ కలిసి సమస్యలు, గ్రామాభివృద్ధిపై చర్చించి, వార్షిక ప్రణాళికను రూపొందించడం ఆచారం. ఈ సందర్భంగా మా తరి, మాతర పేరట రెండు వెదురు కంకలను సిద్ధం చేసి ప్రజలు తీసుకొచ్చిన చక్కెర బిల్లల హారాలు, కుడకలతో పాటు పటేల్‌ ఉంట్లో తయారు చేసిన గారెలు, పచ్చి ఉల్లిపాయలు, వంకాయలు, మోదుగ పూలను కర్రలకు అలంకరిస్తారు. సాయంత్రం పటేల్‌ ఇంటి నుంచి ఊరి పొలిమేరకు వాయిద్యాలతో బయలుదేరి వెళ్తారు. మాతరి, మాతర పేరిట రెండు గుంతలు తవ్వి అందులో కోడిగుడ్డు పెట్టి కాముని దహనం చేస్తారు. ఈ సందర్భంగా మంటల్లో మాతరి, మాతర తయారు చేసిన కంకలు కిందపడేవరకు ఎదురు చూస్తారు. కంకలకు అలంకరించిన వస్తువులు కింద పడకుండా గొంగ ళి లేదా ఇతర వస్ర్తాలు సేకరిస్తారు. తర్వాత దీన్నే నైవేధ్యంగా పంచుకుంటారు. దహనం చేసిన అగ్నిగుండం చుట్టూ ఆదివాసీలు సంప్రదాయ వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ సంబురాలు చేసుకుంటారు. రాత్రిపూట అదే ప్రాంతంలో కబడ్డీ ఆడుతూ అక్కడే బస చేస్తారు. మరుసటి రోజున ఉదయం అన్ని ధాన్యలతో కూడిన గుడాలు తయారు చేసి సహపంక్తి భోజనం చే స్తారు. అనంతరం గోగిపూలతో తయారు చేసిన రంగు ను మాతరి, మాతరలపై చల్లిన తర్వాత ఒకరిపై ఒకరూ రంగులు చల్లుకుంటూ పండుగ వేడుకలను ఆనందోత్సవంగా నిర్వహించుకుంటారు. ప్రతి ఉంటికి వాయిద్యాలతో నృత్యం చేస్తూ వెళ్లి కానుకలు, పండించిన నవధాన్యలు సేకరించిన అనంతరం దహనం చేసిన బూడిదను ఇంటి గడపకు రేఖ వేస్తారు. ఇది ఆదివాసులకు శ్రీరామరక్షగా ఉంటుందనీ, ఎలాంటి దుష్టశక్తి గడపను దరిచేరదని ఆదివాసీల విశ్వాసం.


logo