శుక్రవారం 14 ఆగస్టు 2020
Komarambheem - Mar 07, 2020 , 23:36:22

ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు

ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు

ఆసిఫాబాద్‌,నమస్తే తెలంగాణ : ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా పేర్కొన్నారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో భూగర్భ గనుల శాఖ, ఇరిగేషన్‌, గ్రౌండ్‌ వాటర్‌ అధికారులతో ఇసుక పాలసీ అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా జిల్లా ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా కొత్త పాలసీ విధానానికి రూపకల్పన చేశామన్నారు. క్యూబిక్‌ మీటర్‌కు రూ. 600చొప్పున, ట్రాక్టర్‌ ట్రిప్పునకు రూ. 1800 చొప్పున తీసుకోవాలనీ, తాసిల్దార్ల నుంచి వే బిల్‌ తీసుకోవాలన్నారు. ఈ బిల్లులకు సంబంధించిన చీటీలు మూడు రంగుల్లో ఉంటుందనీ, ఇసుక అవసరమున్న వారు బ్లూ వేబిల్‌ తీసుకోవాలని, రెడ్‌ కలర్‌ది ఏడీ మైన్స్‌కు, పసుపు కలర్‌ది ఆర్డీవో దగ్గర ఉంటుందన్నా రు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇసుక తరలించాలనీ, సంబంధిత మండల తాసిల్దార్ల పేరిట డీడీ తాయాలని సూచించారు. వచ్చే ఆదాయం 25 శాతం గ్రామాలకు, 50 శాతం మండలానికి, 25 శాతం జిల్లా పరిషత్‌కి చెందుతుందన్నారు. గ్రామా పంచాయతీ పరిధిలోని ఇసుక తీయడానికి గ్రామ సభ తీర్మానం చేయాలన్నారు. ఒక మీటర్‌ లోతు వరకే తీయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్‌ హేమంత్‌, అదనపు కలెక్టర్‌ రాంబాబు,డీఆర్‌వో ప్రభాకర్‌, ఆర్డీవో సిడాం దత్తు, భూగర్భ గనుల శాఖ ఏడీ నాగరాజు,ఆర్‌ఐ చంద్రకళ,ఇరిగేషన్‌ ఈఈ గుణవంత్‌రావు,గ్రౌండ్‌ వాటర్‌శాఖ అధికారి ఉన్నారు.


పల్లెలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలి

లింగాపూర్‌ : పల్లెలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా పేర్కొన్నారు. శనివారం లింగాపూర్‌ మండలంలోని కొత్తపల్లి, మోతిపటార్‌, గోపాల్‌పూర్‌, లొద్దిగూడ, వంకమద్ది గ్రామాలను సందర్శించారు. కొత్తపల్లిలోని నర్సరీలను పరిశీలించి మొక్కలు ఎండిపోకుండా జాగ్రత చర్యలు తీసుకోవాలని సూచించారు. మోతిపటార్‌లో మొదటిసారిగా కలెక్టర్‌ పర్యటించడంతో గ్రామస్తులు శాలువాతో సన్మానించారు. అనంతరం కలెక్టర్‌ అక్కడ ఉన్న మహిళలలో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల వంట గది శిథిలమవ్వడంతో కొత్త భవనం కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని పీఆర్‌ ఏఈను ఆదేశించారు. మోతిపటార్‌ నుంచి లింగాపూర్‌కు వెళ్లే రోడ్డుకు వంతెన లేక ఇబ్బందిగా ఉందని సర్పంచ్‌ పద్మ చెప్పగా స్పందించిన కలెక్టర్‌ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గోపాల్‌పూర్‌లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ చూసినా పగలు విద్యుత్‌ దీపాలు వెలుగుతూ కనిపించడంతో విద్యుత్‌ శాఖ సిబ్బందితో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో ఆనంద్‌రావ్‌ను ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారి శ్యాంరావ్‌, ఏఈఈ రమేశ్‌, ఏపీవో సునీత పాల్గొన్నారు. 


logo