శనివారం 15 ఆగస్టు 2020
Komarambheem - Mar 06, 2020 , 23:32:20

ప్రగతి పథం.. సాగుకు ఊతం

ప్రగతి పథం.. సాగుకు ఊతం

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పల్లె ప్రగతి’ సత్ఫలితాలనిస్తున్నది. పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దడమేగాకుండా.. బహుళ ప్రయోజనాలు కల్పించేలా దోహదపడుతున్నది. పల్లె ప్రగతి ప్రధాన లక్ష్యమైన పరిశుభ్రతలో భాగంగా గ్రామాల్లో పడేసే చెత్తతో పంటలకు ఉపయోగపడేలా సేంద్రియ ఎరువుల తయారీకి శ్రీకారం చుట్టింది. జిల్లాలో ప్రయోగాత్మకంగా ఇప్పటికే 7 యూనిట్లు ఏర్పాటు చేయగా,  ఇది విజయవంతమైతే రాబోయే రోజుల్లో ఊరూరా తయారీ యూనిట్లు నెలకొల్పాలని భావిస్తున్నది.

ఏడు గ్రామాల్లో యూనిట్లు..

జిల్లాలోని దహెగాం మండలంలోని చిన్నరాస్పల్లి, కల్వాడ, కొత్మిర్‌, లగ్గాం, ఒడ్డుగూడ, పెంచికల్‌పేట్‌ మండలంలోని ఎన్‌జీటీ విలేజ్‌, కాగజ్‌నగర్‌ మండలంలోని గోడెపల్లి గ్రామాల్లో సేంద్రియ ఎరువుల యూనిట్లు ఏరాటు చేశారు. ఒక్కో యూనిట్‌కు ఉపాధి హామీ పథకం ద్వారా రూ. 2 లక్షలతో కంపోస్ట్‌ ఎరువుల షెడ్లను నిర్మించారు. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో తయారు చేసే సేంద్రియ ఎరువులను హరితహారం మొక్కల పెంపకానికి వినియోగించడంతో పాటు మిగులు ఎరువులను రైతులకు విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

పంచాయతీలకు ఆదాయం..

పల్లెల్లో చేపట్టే పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా ఇండ్లల్లో సేకరించే చెత్తాచెదారాన్ని షెడ్లలో వేసి ఎరువుల ఉత్పత్తి చేయనున్నారు. చెత్తతో సేంద్రియ ఎరువులు తయారీ చేయడం ద్వారా స్థానిక రైతులకు విక్రయించే అవకాశం ఉండడంతో గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరనున్నది. స్వచ్ఛమైన భూసారంతో పంటలకు స్వచ్ఛమైన ఎరువులు అంది పంటల దిగుబడి పెరిగే అవకాశం ఉంది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో చెత్త డంపింగ్‌ యార్డులను ఏర్పాటు చేసింది. ఈ చెత్త డంపింగ్‌ యార్డులోనే ప్రత్యేంగా కంపోస్టు ఎరువుల తయారీ షెడ్లను నిర్మించింది. 

విజయవంతమైతే జిల్లా వ్యాప్తంగా..

జిల్లాలో కంపోస్టు ఎరువుల తయారీ విజయవంతమైంతే జిల్లాలోని 334 గ్రామాల్లో అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఉపాధి హామీ నిధులతో సేంద్రియ ఎరువుల షెడ్లను నిర్మిస్తోంది. జిల్లాలో ఇప్పటికే 7 షెడ్ల నిర్మాణానికి సుమారు రూ. 15 లక్షలు ఖర్చు చేసింది. త్వరలోనే ఈ షెడ్లలో సేంద్రియ ఎరువుల తయారీ చేపట్టనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే జిల్లాలోని మిగతా గ్రామాల్లో అమలు చేయనున్నారు. ప్రభుత్వం గతంతో వ్యవసాయ శాఖ ద్వారా సేంద్రియ ఎరువుల యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నప్పటికీ రైతులు ఆసక్తి చూపకపోవడంతో ఈ పథకం అమలు సరిగా జరుగలేదు. ప్రభుత్వం తాజాగా ఉపాధి హామీ నిధులతో పంచాయతీల ఆధ్వర్యంలోనే సేంద్రియ ఎరువుల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనుండగా, విజయవంతమయ్యే అవకాశాలున్నాయి. చెత్త ద్వారా సేంద్రియ ఎరువులు తయారు చేసే విధానంతో గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణ నెలకొనడంతో పాటు వ్యసాయానికి కావాల్సిన సేంద్రియ ఎరువులు అందుబాటులోనికి రానున్నాయి. 


logo