శనివారం 15 ఆగస్టు 2020
Komarambheem - Mar 06, 2020 , 23:30:40

కరోనాపై వదంతులు నమ్మద్దు

కరోనాపై వదంతులు నమ్మద్దు

మంచిర్యాల అగ్రికల్చర్‌ :కరోనా ఎఫెక్ట్‌తో జిల్లాలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆర్టీసీ బస్‌స్టేషన్‌తో పాటు బస్సులను శానిటైజర్‌తో శుభ్రం చేశారు. అలాగే డ్రైవర్లకు, కండక్టర్లకు అవగాహన కల్పించారు. కచ్చితంగా మాస్క్‌లు ధరించి విధులకు వెళ్లాలని స్పష్టంచేశారు. ఇటు ప్రభుత్వ దవాఖానలోనూ వైద్యులు, సిబ్బంది మాస్కుల ధరించి డ్యూటీ చేస్తుండగా పాఠశాలల్లోనూ విద్యార్థులు, ఉపాధ్యాయులు మాస్క్‌లతో కనిపించారు. దీంతో మంచిర్యాలలో రెండు నుంచి ఐదు రూపాయలకు దొరికే మాస్క్‌ల ధర ఇప్పుడు 30 నుంచి రూ.40కి చేరింది. కొంత బ్రాండెడ్‌ మాస్క్‌లు రూ.80 నుంచి రూ.100కు కూడా విక్రయిస్తున్నారు. కొందరైతే స్టాకులేదని చెప్పడం గమనార్హం. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఉద్యోగులు కూడా అదే బాటపట్టారు. ఇలా ఎక్కడ చూసినా అవే దర్శనమిస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి వాతావరణం చల్లబడి ఉండడం, బయటకు వస్తే వైరస్‌ ఎఫెక్ట్‌ ఏమైనా ఉంటుందా! అనే సందేహా లతో కొంతమంది ఎండ వచ్చే దాకా ఇంటికే పరిమితమయ్యారు. మరోవైపు వైద్య సిబ్బంది అవగాహన కార్యక్రమా లు ఏర్పాటు చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం, కరపత్రాలు, వాల్‌పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.         - 

ఆటాపాటలతో కళాకారుల అవగాహన

జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరి ఆదేశాల మేరకు హాజీపూర్‌ బస్టాండ్‌ వద్ద జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ‘కరోనా వైరస్‌'పై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు శుక్రవారం ఆట, పాటల ద్వారా అవగాహన కల్పించారు. కరోనా వైరస్‌పై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రభుత్వ దవాఖానలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారని ప్రజలకు పాటల ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాకారులు మామిళ్ల లచ్చన్న, ముల్కల్ల మురళి, బీరుపూరి శ్రీనివాస్‌, లావుడ్య రమేష్‌, కుమ్మరి శ్రవణ్‌, వెల్తూరి పోశం, వావిలాల నాగలక్ష్మీ, గొల్లపల్లి శిరీష పాల్గొన్నారు.logo