గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Mar 05, 2020 , 00:01:51

మార్కెట్లను ముంచెత్తిన పత్తి

 మార్కెట్లను ముంచెత్తిన పత్తి

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో పత్తి కొనుగోళ్లు గతేడాదికంటే అధికంగా జరిగాయి. ఈ ఏడాది జిల్లాలో మొత్తంగా ఇప్పటి వరకు 10 లక్షల 43 వేల 645 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరుగగా, ఇందులో ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ ద్వారా 8 లక్షల 25 వేల 23 క్వింటాళ్లు, ప్రైవేటు వ్యాపారులు 2 లక్షల 18 వేల 622 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. గతేడాది 4 కొనుగోలు కేంద్రాల ద్వారా 7 లక్షల 32 వేల 479 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయగా, ఈ ఏడాది 5 కొనుగోలు కేంద్రాల ద్వారా 10 లక్షల 43 వేల 645 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. ఇప్పటికే గతేడాదికంటే 3 లక్షల 11 వేల 116 క్వింటాళ్ల పత్తి అదనంగా కొనుగోలు చేశారు.


గతేడాది ప్రైవేట్‌.. ఈ ఏడాది సీసీఐ..

గతేడాది ప్రైవేటు వ్యాపారుల హవా సాగగా, ఈ ఏడాది ప్రభుత్వం రంగ సంస్థ సీసీఐదే పై చేయి అయ్యింది. గతేడాది ప్రైవేటు వ్యాపారులు 5 లక్షల 10 వేల 492 క్వింటాళ్లు కొనుగోలు చేయగా, సీసీఐ ద్వారా 2 లక్షల 21 వేల 987 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేశారు. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు పత్తి అమ్ముకొని గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు పడ్డారు. పైగా సీసీఐ.. పత్తి కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభించడంతో రైతులకు నష్టం కలిగింది. కానీ.. ఈ ఏడాది 10 లక్షల 43 వేల 645 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయగా, ఇందులో ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ ద్వారా 8 లక్షల 25 వేల 23 క్వింటాళ్లు, ప్రైవేటు వ్యాపారులు 2 లక్షల 18 వేల 622 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. సీసీఐ సీజన్‌ ప్రారంభం నుంచే పత్తి కొనుగోళ్లు చేపట్టడంతో ప్రైవేటు వ్యాపారుల ఆగడాలకు ముందు నుంచి అడ్డుకట్టపడింది. 


సీసీఐ కొనుగోళ్లతో రైతులకు

 గిట్టుబాటు ధర..

ప్రభుత్వం కల్పించిన గిట్టుబాటు ధరకు తోడుగా సీసీఐ ముందు నుంచే పత్తి కొనుగోళ్లు చేపట్టడంతో రైతులకు మంచి గిట్టుబాటు ధర లభించింది. పారదర్శకమైన పద్ధతిలో రైతులకు బ్యాంకుల ద్వారా చెల్లింపులు చేపట్టారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ. 5550 ధర నిర్ణయించగా, చివరి దాకా ఇదే ధర చెల్లించనున్నారు. రైతులు కూడా గిట్టుబాటు ధర పొందేందుకు వీలుగా పత్తిని ఆరబెట్టిమరీ తీసుకువస్తున్నారు. రైతులకు ప్రభుత్వం కల్పించిన గిట్టుబాటు ధరకు సీసీఐ పత్తిని కొనుగోలు చేస్తున్నది. జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదు కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లతో ఈ సీజన్‌ మొత్తం కళకళలాడింది. రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరుగుతుండడంతో కొద్ది రోజులుగా పెద్ద వాహనాల్లో పత్తిని తీసుకురావద్దని అధికారులు రైతులకు విజ్ఞప్తి చేశారు. పత్తి అమ్మకాల సమయంలోనే రైతులు నేరుగా తమ పట్టా పాసుపుస్తకాలు, ఆధార్‌, బ్యాంకు పుస్తకాలను అధికారులకు అందివ్వడంతో రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది పత్తి అమ్మకాల్లో మధ్యదళారుల బెడద చాలా వరకు తగ్గింది. 


ఏటేటా పెరుగుతున్న పత్తి సాగు

జిల్లాలో పత్తి సాగు ఏటేటా పెరుగుతూ వస్తున్నది. ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు సీసీఐ ద్వారా కొనుగోళ్లు చేపడుతుండడంతో రైతులు పత్తి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో దాదాపు సుమారు 3 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. గతేడాదికంటే సుమారు 20 హెక్టార్లలో అధికంగా సాగు చేశారు. పైగా పత్తి సాగుకు అనువైన వాతావరణం ఉండడం రైతులకు కలిసివస్తున్నది.logo