శనివారం 28 మార్చి 2020
Komarambheem - Mar 02, 2020 , 23:30:39

ఐదేళ్లలోపు పిల్లలందరికీ టీకాలు వేయించాలి

ఐదేళ్లలోపు పిల్లలందరికీ టీకాలు వేయించాలి

వాంకిడి: ఐదేళ్లలోపు పిల్లలందరికీ మిషన్‌ ఇంద్రధనుష్‌ టీకాలు వేయించాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. సోమవారం మండలంలోని ఇందాని గ్రామంలోని సబ్‌సెంటర్‌లో మిషన్‌ ఇంద్రధనుష్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ, జిల్లాలోని గర్భిణులతో పాటు డ్రౌపౌట్‌ పిల్లలను గుర్తించి వ్యాధి నిరోధక టీకాలు వేయాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు. ఈ టీకాలు పిల్లలకు వేయడం ద్వారా ఏడు రకాల వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు. గ్రామాల్లో స్థానికంగా ఉన్న వైద్యసిబ్బంది, అంగన్‌వాడీలు, ఉపాధ్యాయ సిబ్బంది బాధ్యతగా తీసుకొని, దీనిపై విస్తృతంగా ప్రచా రం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వర్షకాలంలో సబ్‌సెంటర్‌లో ఉరుస్తుందని, కరెంట్‌ సౌకర్యం కూడా లేదని వైద్యసిబ్బంది కలెక్టర్‌కు వివరించడంతో మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. నూతన భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయని అధికారులను అడగడంతో కాంట్రాక్టర్‌ గత కొన్నేళ్ల నుంచి సక్రమంగా పనులు చేయడం లేదని చెప్పాడంతో వేరే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలని ఎంపీడీవోను ఆదేశించారు. కుమ్రం భీం ప్రధాన కాలువ నుంచి లెండిగూడ చిన్న కాలువ ఏర్పాటు చేసి సాగునీరు అందించాలని కోరుతూ ఇందాని రైతులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సాగునీరు అందించేలా చూస్తామని చెప్పారు. అంతకుముందు మండలంలో జరిగిన పల్లె ప్రగతి అభివృద్ధి పనులపై ఎంపీడీవోను ఆరాతీశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో బాలు, అదనపు డీఎంహెచ్‌వో సుధాకర్‌నాయక్‌, సర్పంచ్‌ కోట్నాక నిర్మలబాయి, ఎంపీటీసీ మాధవి, ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి, సూపర్‌వైజర్లు రోహిదాస్‌, నర్సమ్మ పాల్గొన్నారు.logo