గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Mar 01, 2020 , 23:38:54

ప్రగతిలో ఉత్తమం

ప్రగతిలో ఉత్తమం

అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన ‘పల్లె ప్రగతి’తో గ్రామాలు ఆదర్శంగా మారుతున్నాయి. మొదటి విడతలో 30 రోజులు, రెండో విడతలో 10 రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాలతో ఊరూరా సమస్యలు పరిష్కారమవ్వడంతో పాటు మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 10 ఉత్తమ పంచాయతీలను ఎంపిక చేసిన అధికారులు, ఇటీవల రూ. 2 లక్షల చొప్పున జనరాన అందించారు. 


పల్లె ప్రగతితో మారిన రూపురేఖలు

30 రోజుల ప్రణాళికలో భాగంగా ఊరూరా అనేక సమస్యలను గుర్తించిన అధికారులు.. వాటిని పూర్తిస్తాయిలో పరిష్కరించారు. జిల్లాలోని 334 గ్రామ పంచాయతీలు ఉండగా, అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం సుమారు రూ. 40 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పంచాయతీలకు కావాల్సిన వసతులు, ట్రాక్టర్లను సమకూర్చుకున్నారు. పాడుబడ్డ బావులు, వాడకంలో లేని బోర్లను పూర్తిగా తొలగించారు. ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించుకునేలా ప్రోత్సహించారు. మురుగు కాలువలను శుభ్రం చేయించారు. రోడ్లు బాగు చేశారు. పాఠశాలలు, దవాఖానలు, ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్‌లలో పరిశుభ్రతను పెంపొందించారు. ఇంటింటికీ చెత్త బుట్టలు అందించారు. డంప్‌ యార్డులతో పాటు శ్మశాన వాటికలు నిర్మించారు. మొక్కల పెంపకాన్ని చేపట్టారు. ఊరూరా విద్యుత్‌ సమస్యలను పరిష్కరించారు.


పది ఉత్తమ పంచాయతీలు..

పల్లె ప్రగతి ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకున్న పది గ్రామాలను అధికారులు ఉత్తమ గ్రామాలుగా ఎంపిక చేశారు. కాగజ్‌నగర్‌ మండలంలోని ఈజ్‌గాం, దహెగాం మండలం చిన్నరాస్పల్లి, కొత్మీర్‌, సిర్పూర్‌-టి మండలం వెంపల్లి, డోర్‌పల్లి, పెంచికల్‌పేట్‌ మండలం బొంబాయిగూడ, జైనూర్‌ మండలం పాట్నాపూర్‌, జంగాం, తిర్యాణి మండలం తిర్యాణి, సిర్పూర్‌-యు మండలం నెట్నూర్‌ గ్రామాలను ఎంపిక చేశారు. ఒక్కో పంచాచతీకి రూ. 2 లక్షల చొప్పున నజరానను అధికారులు అందించారు.


కళకళలాడుతున్న ‘వెంపల్లి’..

వేంపల్లి.. గ్రామం ఆదర్శ గ్రామపంచాయతీగా రూపుదిద్దుకున్నది. 30 రోజుల ప్రణాళికను ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు సద్వినియోగం చేసుకొని గ్రామాన్ని జిల్లాలో ఉత్తమ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతున్నారు. డ్రైనేజీలను పంచాయతీ సిబ్బంది నిత్యం శుభ్రం చేస్తున్నారు. వీధుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగిస్తున్నారు. పరిశుభ్రంగా ఉంచేందుకు చెత్తకుండీలు ఏర్పాటు చేసి, వాటిలోనే చెత్త వేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వేలాడుతున్న విద్యుత్‌ తీగలు సరిచేసి, కొత్త మీటర్లు అమర్చారు. గ్రామంలో ప్రమాదకరంగా ఉన్న బావులను గుర్తించి, పూడ్చి వేశారు. శివారులో డంప్‌ యార్డు, శ్మశాన వాటిక నిర్మాణాలు చేపట్టారు.                                            - సిర్పూర్‌(టి)


‘తిర్యాణి’కి కొత్త శోభ

తిర్యాణి.. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ఈ మేజర్‌ గ్రామ పంచాయతీ కొత్త శోభ సంతరించుకుంది. పాలకవర్గం నేతృత్వంలో గ్రామస్తులు, ఐఖ్యంగా ముందుకెళ్లడంతో గ్రామ స్వరూపమే మారిపోయింది. నర్సరీ, డంప్‌ యార్డు, శ్మశాన వాటికల నిర్మాణాలకు ప్రభుత్వ స్థలం లేకపోవడంతో స్థానికులు అజయ్‌రావు, విజయ్‌రావు 20 గుంటల భూమిని విరాళంగా అందజేశారు. అలాగే ‘హరితహారం’ కింద రెండు వేల మొక్కలు నాటారు. ట్రీగార్డులు ఏర్పాటు చేశారు. మరో 4వేల పండ్లు, పూల రకాల మొక్కలను గ్రామస్తులకు పంపిణీ చేశారు. వ్యర్థ పదార్థాల కోసం చెత్త బుట్టల పంపిణీ, ఆయా కూడళ్లలో చెత్త సేకరణ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. 316 విద్యుత్‌ స్తంభాలకు ఎల్‌ఈడీ బల్బులు అమర్చారు. ప్లాస్టిక్‌ వినియోగం వల్ల కలిగే నష్టాలపై, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణాలపై విసృ్తతంగా అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర పరిశీలకులు గ్రామాన్ని సందర్శించి, సంతృప్తి వ్యక్తం చేశారు. గత కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు సైతం గ్రామంలో సందర్శించి, సంతృప్తి  వ్యక్తం చేశారు. ఉత్తమ పంచాయతీగా అధికారులు ఎంపిక చేశారు. జిల్లా అధికారులు రూ.2లక్షల నగదు అందజేశారు.            


logo
>>>>>>