గురువారం 09 ఏప్రిల్ 2020
Komarambheem - Mar 01, 2020 , 01:00:32

డీసీసీబీ, డీసీఎంఎస్‌లపై గులాబీ జెండా

డీసీసీబీ, డీసీఎంఎస్‌లపై గులాబీ జెండా

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పార్టీపై ఉన్న విధేయత.. రాజకీయ నేపథ్యం.. కుల సమీకరణ.. ఇలా అన్నీ కలగలిసి తిప్పని లింగయ్యను జిల్లా కేంద్ర మార్కెటింగ్‌ సమాఖ్య(డీసీఎంఎస్‌) చైర్మన్‌ పదవి వరించింది. మొదటి నుంచి ఆయన పేరే ప్రచారంలో ఉంది. నాలుగు జిల్లాలకు చెందిన నేతలు అండగా నిలవడంతో పదవి దక్కింది. శనివారం ఎన్నిక కాగా.. చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. సహకార ఎన్నికలు పూర్తయిన తర్వాత డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కాగానే నాలుగు జిల్లాల నేతలు సమావేశం అయ్యారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌, ఎమ్మెల్యేలు అంతా కూర్చుని చైర్మన్లను ఏకగ్రీవం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో తిప్పని లింగయ్య పేరు ప్రతిపాదనకు వచ్చింది. ఆయన రాజకీయ నేపథ్యం, పార్టీపై విధేయత, బీసీ నేతగా ఆయనకు ఉన్న పేరు ఇలా అన్ని రకాలుగా నేతలు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. గతంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యేందుకు శ్రీనివాసరెడ్డికి తిప్పని లింగయ్య పూర్తి స్థాయిలో సహకారం అందించారు. ఇప్పుడు లింగయ్య ఎన్నికల్లోనూ శ్రీనివాస్‌రెడ్డి ముందుండి రుణం తీర్చుకున్నారు. రెండు సార్లు చైర్మన్‌గా చేసిన శ్రీనివాస్‌రెడ్డి, పదవి కోసం మొదట్లో ప్రయత్నించినా తనకు రాదని తెలియడంతో ఆయన డైరెక్టర్‌గా పోటీ చేయలేదు.


ఆది నుంచి రాజకీయాల్లోనే.. 

తిప్పని లింగయ్య మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన 1988 నుంచి 2001 వరకు రెండు మార్లు లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేటకు సర్పంచ్‌గా పనిచేశారు. 2001 నుంచి 2006 వరకు లక్షెట్టిపేట మండల పరిషత్‌ అధ్యక్షుడిగా సేవలందించారు. ఇక 2006 నుంచి 2011 వరకు లక్షెట్టిపేట జడ్పీటీసీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన జెండా వెంకటాపూర్‌ చైర్మన్‌గా ఎన్నికైన ఆయన డీసీసీబీ బాధ్యతలు స్వీకరించారు.


ఆదిలాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు, రైతులు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు పట్టం కడుతున్నారు. ఉమ్మడి జిల్లా డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికల్లో కూడా రైతులు గులాబీ పార్టీ అభ్యర్థులను ఆశీర్వహించారు. ఇటీవల జరిగిన డీసీసీబీ ఎన్నికల్లో 77 పీఏసీఎస్‌లకు టీఆర్‌ఎస్‌ 72 సంఘాలను గెలుచుకుంది. గులాబీ పార్టీకీ చెందిన అభ్యర్థులు చైర్మన్‌లు, వైస్‌ చైర్మన్‌లుగా ఎన్నికయ్యారు. ఈ నెల 25న డైరెక్టర్‌ల ఎన్నికలు నిర్వహించగా డీసీసీబీకి 18 మంది, డీసీఎంఎస్‌కు 10 మంది డైరెక్టర్‌ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. షెడ్యూల్‌ ప్రకారం శనివారం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. అధికారులు ఉదయం 8.30 గంటల నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఉదయం సమావేశాన్ని ఏర్పాటు చేసి 9 గంటల నుంచి 11 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. 11.30 గంటలకు నామినేషన్ల పరిశీలన అనంతరం మధ్యా హ్నం 2 గంటల వరకు ఉపసంహరణకు గడువు విధించారు. 


అధిష్టానం ఆదేశాల మేరకు డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికల ఇన్‌చార్జి కోలేటి దామోదర్‌ గుప్త షిల్డ్‌ కవర్‌లో జిల్లా కేంద్రానికి చేరుకుని చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు ఎవరు నామినేషన్లు వేయా లో సూచించారు. నామినేషన్ల గడువు ముగిసేసరికి టీఆర్‌ఎస్‌కు చెందిన నార్నూర్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ కాంబ్లే నాందేవ్‌, వైస్‌ చైర్మన్‌ పదవి కోసం లక్ష్మన్‌చాందా పీఏసీఎస్‌ చైర్మన్‌ రఘునందర్‌రావులు నామినేషన్లు దాఖలు చేశారు. చైర్మన్‌గా కాంబ్లే నాందేవ్‌ పేరును తాంసి పీఏసీఎస్‌ చైర్మన్‌ అడ్డీ భోజారెడ్డి ప్రతిపాదించగా మామడ పీఏసీఎస్‌ చైర్మన్‌ హరీష్‌రావు బలపర్చారు. వైస్‌ చైర్మన్‌గా రఘునందన్‌రావు పేరును చించు శ్రీనివాస్‌ ప్రతిపాదించగా, ఇప్ప సత్యనారాయణ బలపర్చారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా తిప్పని లింగ య్య, వైస్‌ చైర్మన్‌గా మాంతయ్యలు నామినేషన్లు వేశారు.


అంతా ఏకగ్రీవమే.. 

డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో భాగంగా నామినేషన్ల గడువు ముగిసే సమయానికి అధిష్టానం సూచించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. గడువు ముగిసే సమయానికి డీసీసీబీ చైర్మన్‌కు, వైస్‌ చైర్మన్‌కు ఒక్కొక్కటి, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌కు ఒక్కో నామినేషన్‌ రావడంతో అభ్యర్థులు ఏకగ్రీవంగా ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన సమయం మధ్యాహ్నం 2 గంటల తర్వాత డీసీసీబీ చైర్మన్‌గా కాంబ్లే నాందేవ్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌గా రఘునందర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌గా తిప్పని లింగయ్య, వైస్‌ చైర్మన్‌గా కొమరం మాంతయ్యలు ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.


ధ్రువపత్రాల అందజేత

డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లకు అధికారులు, ప్రజాప్రతినిధులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. నూతనంగా ఎన్నికైన వారికి అభినందనలు తెలిపారు. అనంతరం డీసీసీబీ కార్యాలయంలో చైర్మన్‌ కాంబ్లే నాందేవ్‌, వైస్‌ చైర్మన్‌ రఘునందన్‌రెడ్డి, డీసీఎంఎస్‌ కార్యాలయంలో చైర్మన్‌ తిప్పని లింగయ్య, వైస్‌ చైర్మన్‌ కొమరం మాంతయ్యలలతోపాటు డైరెక్టర్‌లకు పుష్పగుచ్చాలు అందజేసి శాలువలతో సన్మానించారు.



logo