సోమవారం 30 మార్చి 2020
Komarambheem - Feb 29, 2020 , 00:01:59

ఎన్నిక లాంఛనమే

ఎన్నిక లాంఛనమే

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : సహకార ఎన్నికలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఇప్పటికే పీఏసీఎస్‌ డైరెక్టర్‌ నుంచి చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికతో పాటు డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్ల పోస్టులకు ఎన్నిక లు పూర్తయ్యాయి. తాజాగా డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మ న్‌ వైస్‌ చైర్మన్‌ పదవులకు నేడు ఎన్నికలు నిర్వ హించ నున్నారు. పీఏసీఎస్‌ ఎన్నికల్లో డైరెక్టర్లతో పాటు చైర్మ న్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌ దక్కించుకోగా.. ఈ నెల 25న నిర్వహించిన డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్ల పదవుల ఎన్నికల్లోనూ గులాబీదే గుత్తాధిపత్యం సాగింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 20 డీసీసీబీ డైరెక్టర్లు, 10 డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ పోస్టులకుగాను.. 17డీసీసీబీ, 10 డీసీఎంఎస్‌ పోస్టులను ఏకగ్రీవంగా టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు దక్కించుకున్నా రు. ఎస్సీ కోటాలో రెండు, బీసీ కోటా ఒక డైరెక్టర్‌ పో స్టుకు అభ్యర్థులు లేకపోవడంతో వాయిదా పడ్డాయి.. దీంతో మొత్తం 27 డైరెక్టర్‌ పోస్టులు ఏకగ్రీవంకాగా.. ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌ మద్దతుదారులకే దక్కాయి. 


నామినేషన్ల స్వీకరణ, అనంతరం ఎన్నిక ..

డీసీసీబీ కార్యాలయంలో డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు నేడు నామినేషన్లు స్వీకరించి.. ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కాంగ్రెస్‌, బీజేపీ నుంచి ఒక్క డైరెక్టరు కూడా లేకపోవడంతో.. ఆ పార్టీల నుంచి నామినేషన్లు వచ్చే పరిస్థితి లేదు. దీంతో టీఆర్‌ఎస్‌ నుంచి ఒక్కొక్కరే నామినేషన్లు వేయనుండగా.. ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. టీఆర్‌ఎస్‌కు పూర్తి మెజార్టీ ఉండడంతో ఈ నాలుగు పదవులు గులాబీ ఖాతాలో పడనున్నాయి. మద్దతుదారులే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను ఏకపక్షంగా, ఏకగ్రీవంగా దక్కించుకోనున్నారు. డీసీసీబీ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణకు సహకార శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 25న డైరెక్టర్లు క్యాంపులోకి వెళ్లగా.. వారంతా నేడు నేరుగా డీసీసీబీ కార్యాలయానికి రానున్నారు. ఈ ఎన్నికల్లో పాల్గొని చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకోనున్నారు.


అధిష్ఠానానికి జాబితా

డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థులు ఎవరనే విషయంపై రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీతో చర్చించారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని.. ఏకాభిప్రాయంతో పేర్ల జాబితాను అధినాయకత్వానికి పంపించారు. ఇప్పటికే డైరెక్టర్లు ఎవరి ప్రయత్నాలు వారు చేయగా.. నేడు జరిగే డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు అభ్యర్థులు ఎవరనేది ఇప్పటికే స్పష్టత రాగా.. అధిష్టానమే అధికారికంగా ప్రకటించనుంది. ఉమ్మడి జిల్లా ఆధారంగా డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఉండగా.. జిల్లా స్థాయి పదవుల్లో అన్ని జిల్లాలకు సమప్రాధాన్యత దక్కేలా చూస్తున్నారు. రెండు చైర్మన్లు, రెండు వైస్‌ చైర్మన్‌ పదవులు ఉండగా.. నాలుగు పదవులను నాలుగు జిల్లాలకు చెరో ఒకటి చొప్పున ఇచ్చి అందరికి న్యాయం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తవగా.. నేడు అధికారికంగా అభ్యర్థుల ప్రకటన, ఎన్నిక, ఫలితాల వెల్లడి చేయనున్నారు.



logo