శనివారం 04 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 27, 2020 , 23:47:01

ప్రగతి కనిపించాలి

ప్రగతి కనిపించాలి

కాగజ్‌నగర్‌ టౌన్‌: పట్టణ ప్రగతి కనిపించాలనీ, అందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసికట్టుగా పని చేయాలని అదనపు కలెక్టర్‌ రాంబాబు సూచించారు. పట్టణ కార్యాచరణ ప్రగతిలో భాగంగా 14, 15, 29 వార్డుల్లో మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి గురువారం పాల్గొన్నారు. 14వ వార్డులో కొందరు సెప్టిక్‌ట్యాంక్‌ నిర్మాణాలు చేపట్టకుండానే కాలువల్లో వదులుతున్నారనీ, డ్రైనేజీ సరిగా లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపా రు. అనుమతులు లేకుండానే తమ ప్లాట్లలో విద్యుత్‌ స్తంభాలను వేస్తున్నారనీ, వేసవిలో ఓల్టేజీ సమస్య ఎదురవుతుందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్‌ అధికారులతో మాట్లాడి సమస్య లు లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. వర్షా కాలంలో త్రిశూల్‌ పహాడ్‌ పైనుంచి వర్షపు నీరు ఇండ్లలోకి వస్తుందనీ, ఇరువైపులా కాలువ నిర్మాణాలు చేపట్టాలని కోరారు. 11కేవీ విద్యుత్‌ లైన్‌ తమ కాలనీ పైనుంచి వెళ్తుందని ఇళ్ల నిర్మాణం చేపట్టేప్పుడు ప్రమాదాలు జరిగే ఆవకాశాలున్నాయని కాలనీవాసులు తెలిపారు. ఇనుప స్తంభాల స్థానంలో సిమెంట్‌ పోల్స్‌ ఏర్పాటు చేయాలని కోరారు. కాలనీలో చెత్తాచెదారం పేరుకుపోతుందని దీంతో రోగాలు సోకే అవకాశాలున్నాయనీ,  ఎప్పటికప్పుడు తొలగించేలా మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకునేలా చూడాలన్నారు. వర్షాకాలం వస్తే తన ఇంట్లోకి మురుగునీరు చేరుతుందనీ, ఎస్పీఎం వారిపై మున్సిపల్‌ వారు, మున్సిపల్‌ వారిపై ఎస్పీఎం సిబ్బంది తమ పరిధి కాదంటే తమ పరిధి కాదని పారిశుధ్య పనులు చేపట్టడం లేదని 15వ వార్డులో ఎస్పీయం క్వార్టర్‌ నం. ఆర్‌జీ-8 కార్మికుడు వారి దృష్టికి తెచ్చాడు. క్వాటర్‌లోకి వెళ్లి కాలువను పరిశీలించి కమిషనర్‌ తిరుపతి, ప్రత్యేకాధికారులను సమస్యల పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలంలో డ్రైనేజీ నీటితో చాలా ఇబ్బందులు పడుతున్నామని మహిళలు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. వార్డు నెం.29లో పర్యటించారు. వార్డు కౌన్సిలర్‌ వెన్న సంగీత కిశోర్‌బాబు ప్రధానంగా డ్రైనేజీ సమస్య ఉందని చాలా మంది మురుగు నీటిని కాలువలో కాకుండా రోడ్డుపైనే వదిలివేస్తున్నారనీ, రోడ్డును ఆక్రమించుకుని ఇండ్లు, గోడలు నిర్మించుకున్నారనీ, పట్టణ ప్రగతిలో సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మిషన్‌ భగీరథ నీటిని క్లోరినేషన్‌ చేసి సరఫరా చేసేలా చూడాలన్నారు. పెద్దవాగు ఇన్‌టెక్‌ వెల్‌ నుంచి వచ్చే తాగు నీటిని సరఫరా చేయాలనీ, ప్రజలు కోరుతున్నారని తెలిపారు. వార్డులో గల్లీ రోడ్డును ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు ఉన్నాయనీ, వాటిని తొలగించి మున్సిపాలిటీ నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని వార్డుల ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ప్రత్యేకాధికారులు నమోదు చేయాలన్నారు. ఆయన వెంట మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, టీపీబీవో సాయికృష్ణ, క్రాంతి, కౌన్సిలర్లు రాజేందర్‌, మాజీ కౌన్సిలర్‌ నియాజొద్దీన్‌, తదితరులు ఉన్నారు.


logo