గురువారం 09 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 27, 2020 , T00:20

రబీ రందీ లేకుండా..

రబీ రందీ లేకుండా..

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని 15 మండలాల్లో ఈ ఏడాది యాసంగిలో 9515 హెక్టార్లలో పంటలు సాగవుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాకాలంలో వేసిన పత్తి, సోయా, మిరప, పప్పు దినుసుల దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో.. అదే ఉత్సాహంతో రైతులు పంటలు వేశారు. వ్యవసాయ అధికారులు అంచనాల ప్రకారం వరి 2399 హెక్టార్లు ఉండగా, అంచనాలకు మించి 1131 హెక్టర్లలో సాగవుతోంది. దీంతో పాటు శనగ, వేరుశనగ పంటలు కూడా సాధారణంకంటే ఎక్కువగా సాగు చేస్తున్నారు. శనగ సాగు 1852 హెక్టార్లు కాగా, 2938 హెక్టార్లు అధనంగా, వేరుశనగ 27 హెక్టార్లు కాగా, 10 హెక్టార్లు అదనంగా సాగవుతోంది. ఈ రబీలో 116.75 క్వింటాళ్ల శనగ విత్తనాలను రైతులకు సబ్సిడీపై ప్రభుత్వం అందించింది.

24 గంటల విద్యుత్‌తో ధీమా..

రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తుండడంతో రైతులు ధీమాగా సాగు చేసుకుంటున్నారు. 15 మండలాల్లో 6,666 వ్యవసాయ బోర్లకు విద్యుత్‌ సరఫరా అవుతోంది. నిరంత విద్యుత్‌ నేపథ్యంలో అధికారులు కొత్తగా 6 33/11 ఉప విద్యుత్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో బోర్లు వేసుకున్న ప్రతి రైతుకూ విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. గత మూడేళ్లలో 2352 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చారు. జిల్లా మొత్తంగా 8500 వరకు కనెక్షన్లు వరకు చేరుకున్నాయి. 

మిషన్‌ కాకతీయ చెరువులతో..

ఆసిఫాబాద్‌ జిల్లాలో నాలుగు విడతల్లో చేపట్టిన మిషన్‌ కాకతీయ చెరువుల ద్వారా దాదాపు ఈ యాసంగిలో 5 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది.   ఇప్పటివరకు జిల్లాలో నాలుగు విడుతల్లో చెరువులను పునరుద్ధరించింది. మొదటి విడతలో 184 చెరువు అభివృద్ధికి రూ. 56కోట్ల 98 లక్షలు మంజూరు చేయగా, ఇప్పటి వరకు రూ.43 కోట్ల 83 లక్షలతో 177 చెరువులను పూర్తిచేశారు. దీని ద్వారా వానాకాలంలో దాదాపు 17 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. జిల్లాలో రెండో దశలో మిషన్‌ కాకతీయ పథకం ద్వారా 119 చెరువుల పునరుద్ధరణకు రూ. 36 కోట్ల 77 లక్షలు కేటాయించగా, జిల్లాలో 109 చెరువుల పనులను పూర్తి చేశారు. ఇందుకోసం రూ. 20 కోట్ల 31 లక్షలు ఖర్చుచేశారు. దీని ద్వారా వానాకాలంలో ఆరు వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. మిషన్‌ కాకతీయ మూడో విడత ద్వారా 63 చెరువుల మరమ్మతుల కోసం ప్రతి పాదనలు పంపగా 22 చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం అనుమతినిస్తూ సుమారు రూ. 11 కోట్ల 40 లక్షలు మంజూరు చేసింది. వీటిలో 50 చెరువులకు మరమ్మతులు నిర్వహించారు. సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలతో ఎంచక్కా సాగుక చేసుకుంటున్నామని, జీవితాంతం రుణపడి ఉంటామని అన్నదాతలు పేర్కొంటున్నారు.


logo