ఆదివారం 29 మార్చి 2020
Komarambheem - Feb 27, 2020 , T00:10

ప్రజల భద్రతకే కార్డన్‌ సెర్చ్‌

ప్రజల భద్రతకే కార్డన్‌ సెర్చ్‌

కెరమెరి : ప్రజలకు భద్రత, భరోసా కల్పించేందుకే కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించడం జరుగుతున్నదని ఏఎస్పీ సుధీంద్ర అన్నారు. మండలంలోని సుల్తాన్‌గూడలో బుధవారం డీఎస్పీ సత్యనారాయణతో కలిసి కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు దుకాణాల్లో తనిఖీ చేపట్టారు. గుట్కా, మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ.. ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలను సేవిస్తూ కుటుంబానికి దూరం కావద్దని సూచించారు. ప్రజల ప్రాణాలను రక్షించేందుకే నిత్యం పోలీసులు తనిఖీలు చేపడుతున్నారని చెప్పారు. చాలా మంది ట్రాఫిక్‌ నియమాలను పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కోల్పోతున్నారని పేర్కొన్నారు. వాహనాలపై ప్రయాణం చేసే ముందు జాగ్రత చర్యలు పాటిస్తే అందరికీ సురక్షితమన్నారు. కొంతమంది ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ ధరించకపోవడం, మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని జరిగిన సంఘటనలను గుర్తుచేశారు. హైవే రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు తమపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులను గుర్తు చేసుకోవాలని సూచించారు. లైసెన్స్‌ లేకుండా పిల్లలను వాహనాలు నడిపించవద్దనీ, ఆ బాధ్యత తల్లితండ్రులదేనన్నారు. పిల్లల చేతిలో ప్రమాదం జరిగితే వాహన యజమానిపైనా చర్యలుంటాయని హెచ్చరించారు. కొత్త మోటర్‌ వెహికిల్‌ చట్టం అమలు కానున్నదనీ, దాని ప్రకారం భారీగా జరిమానాలతో పాటు జైలు శిక్ష సైతం విధించే ఆస్కారం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల్లో మరింత భద్రత కల్పించేందుకు పోలీసులతో పాటు సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెంచడం జరుగుతుందనీ, ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆన్‌లైన్‌, సైబర్‌ మోసాలకు గురికావద్దని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ సత్యనారాయణతో పాటు సీఐలు రాణాప్రతాప్‌, సురేష్‌, కెరమెరి, వాంకిడి, సిర్పూర్‌(యు) ఎస్‌ఐలు రమేశ్‌, చంద్రశేఖర్‌, విష్ణువర్ధన్‌, ఇతర పోలీసు బలగాలు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.   


logo